కునుకు లేమితో  అనారోగ్యకరమైన అలవాట్లు

15 Nov, 2018 01:45 IST|Sakshi

పిల్లలు, కౌమార వయస్కులకు తగినంత నిద్ర లేకపోవడమన్నది అనారోగ్యకరమైన అలవాట్లు ఏర్పడేందుకు కారణమవుతుందని న్యూబ్రన్స్‌విక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 1.77 లక్షల మందితో జరిపిన అధ్యయనం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని లాబ్రోస్‌ సిడోసిస్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. అధ్యయనం చేసిన వారందరిలో కనీసం 40 శాతం మంది తగినంత సమయం నిద్రపోవడం లేదని ఫలితంగా వాళ్ల ఆరోగ్యపు అలవాట్లు దెబ్బతినడంతోపాటు టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం కూడా ఎక్కువగా ఉంటోందని.. ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయని వివరించారు.

ఆరు నుంచి 12 ఏళ్ల మధ్య వయస్కుల నిద్రా సమయం 9  – 12 గంటలు కాగా.. 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు కనీసం ఎనిమిది నుంచి పది గంటలపాటు నిద్రపోవాలని వివరించారు. ఈ స్థాయిలో నిద్రపోని వారు పొద్దున్నే ఉపాహారం తీసుకోకపోవడం, పిజ్జా, బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటం, తరచూ తీపి పదార్థాలు తీసుకోవడం చేస్తున్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని లాబ్రోస్‌ తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏరోబిక్‌ వ్యాయామం చేసే వాళ్లు.. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లూ కలిగి ఉన్నట్లు తెలియడం ఇంకో విశేషమన్నారు.  

మరిన్ని వార్తలు