ఇంకుడు బోరు!

23 Jun, 2020 06:16 IST|Sakshi
వర్షపు నీటిని ఇంకింపజేసే ఇంకుడు బోరును చూపుతున్న డా. జగదీష్‌

స్వల్ప ఖర్చుతో వినూత్న వాన నీటి సంరక్షణ పద్ధతి

రైతులు తమంత తామే ఏర్పాటు చేసుకోవచ్చు

శాస్త్రవేత్త డాక్టర్‌ జగదీష్‌ ఆవిష్కరణ

తాగటానికో, వ్యవసాయం కోసమో భూమి లోపలి పొరల్లో నీటిని పైకి తెచ్చుకోవడానికి బోర్లు తవ్వుకోవడం మనకు తెలుసు. భూగర్భం వేగంగా ఖాళీ అయిపోతోంది. వర్షం పడినప్పుడైనా నీటిని భూమిలోకి ఇంకింపజేసుకోవాలి కదా.. అందుకే, ఇప్పుడు భూమిలోకి ఇంకింపజేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా తక్కువ లోతు (6 నుంచి 50 అడుగుల లోతు) బోర్లు తవ్వుకోవటమే ఉత్తమ మార్గం అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త డా. జగదీష్‌. ఈ ‘ఇంకుడు బోర్ల’ కథా కమామిషు ఏమిటో చూద్దాం..!

భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపధ్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. నెల్లూరుకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏ. జగదీష్‌ ఓ వినూత్నమైన వాన నీటి సంరక్షణ పద్ధతిని ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పాటూరువారి కండ్రిగలోని కొబ్బరి తోటలో ఈ ఇంకుడు బోరు’ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి  సత్ఫలితాలు సాధించారు.

ఇంకుడు బోరు ప్రత్యేకత ఏమిటి?
సాధారణ ఇంకుడు గుంట కొన్ని చదరపు మీటర్ల చోటును ఆక్రమిస్తే.. దీనికి కేవలం ఒక చదరపు మీటరు చోటు సరిపోతుంది. భూమి లోపలికి నిలువుగా బోరు గుంత తవ్వి, అందులోకి పీవీసీ పైపును దింపి, దాని పైన గరాటను అమర్చితే చాలు. దీన్ని ఇంకుడు గుంత అనే కంటే ‘ఇంకుడు బోరు’ అని పిలవటమే సమంజసం. భూమి లోపలకు నిలువుగా దింపే పీవీసీ పైపు ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వర్షపాతాన్ని బట్టి ఎంతో కొంత వర్షపు నీరు గరాటా ద్వారా కూడా భూమి లోపలికి ఇంకుతుంది.   దీన్ని ఆరు బయట, పొలాల్లోనూ, బోరు బావి దగ్గర్లో గానీ ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇంటిపై నుంచి వచ్చే వర్షపు నీరును భూమిలోపలికి ఇంకింపజేసుకోవడానికి కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై నుంచి వచ్చే నీటిని గరాటలో పడే విధంగా కూడా పెట్టుకోవచ్చు. గరాట మూలంగా ఏర్పడే వత్తిడి కారణంగా భూమి లోపలికి నీరు చాలా వేగంగా, ఎక్కువ పరిమాణంలో ఇంకిపోతుందని డా. జగదీష్‌ అంటున్నారు.  ఇది సాధారణ ఇంకుడు గుంత కన్నా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సులువుగా ఎవరైనా తమంతట తాము ఏర్పాటు చేసుకోగలిగిన వాన నీటి సంరక్షణ వ్యవస్థ అని డా. జగదీష్‌ తెలిపారు. సాధారణ ఇంకుడు గుంట కన్నా ఇది ఎంతో సమర్థవంతంగా వాన నీటిని భూమి లోపలికి ఇంకింపజేయగలుగుతుందన్నారు.  

ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
‘ఇంకుడు బోరు’ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు.. పీవీసీ పైపు, మెష్, గరాట, కొంచెం ఇసుక, గులకరాళ్లు మాత్రమే.  పీవీసీ పైపునకు చుట్టూతా అంగుళం వెడల్పు ఉండే బెజ్జాలు పెట్టాలి. గుంత ఎంత లోతు తీస్తామో అంత పొడవు పైపు వాడాలి. ‘ఇంకుడు బోరు’ 6 అడుగుల నుంచి 50 అడుగుల వరకు లోతు పెట్టుకోవచ్చు. అంతకన్నా లోతు పనికిరాదు. పైపు ఒక చివరన అడుగు ఎత్తున పైపును వదిలేసి మిగతా పైపునకు మాత్రమే బెజ్జాలు పెట్టాలి. పైపు అడుగు వైపు, చుట్టూతా బెజ్జాలు వేసిన ప్రాంతం మొత్తానికీ ఫైబర్‌ మెష్‌ను చుట్టాలి. రెండు పొరలుగా చుడితే మంచిది.

దీని ద్వారా భూమి లోపలికి ఇంకే వాన నీటితోపాటు మట్టి రేణువులు, ఇసుక రేణువులు పైపు లోపలికి వెళ్లకుండా ఈ మెష్‌ అరికడుతుంది.  భూమి లోపలికి నిలువుగా హేండ్‌ బోరు (మరీ లోతుగా అయితే బోరు యంత్రం వాడాలి)తో గుంత తవ్వు కోవాలి. ఆ గుంతలో అడుగున అర అడుగు ఎత్తున గులకరాళ్లు వేయాలి. ఆ తర్వాత.. బెజ్జాలు వేసి మెష్‌ చుట్టి సిద్ధం చేసుకున్న పీవీసీ పైపును దింపాలి. దాని చుట్టూ ఇసుక, గులక రాళ్లు వేసి పూడ్చేయాలి. పైపు పై భాగంలో జీఐ షీటుతో చేసిన గరాటను అమర్చితే సరి.. ‘ఇంకుడు బోరు’ రెడీ అయినట్టే!

పీవీసీ పైపు ఎంత పొడవుండాలి?
నీటి లభ్యతను బట్టి 6 అడుగుల నుంచి 50 అడుగుల వరకు ఎంత లోతు అవసరం అనుకుంటే అంత లోతున్న ‘ఇంకుడు బోరు’ను ఏర్పాటు చేసుకోవచ్చు. లోతు పెరిగే కొద్దీ పీవీసీ పైపు వ్యాసం, పొడవుతో పాటు దాని పైన అమర్చే గరాటా సైజు కూడా  ఆ మేరకు పెంచుకోవాలి. ఉదాహరణకు.. 6 అడుగుల లోతు చాలు అనుకుంటే.. 6అడుగుల పొడవు, 6 అంగుళాల వ్యాసం ఉన్న పైపు వాడాలి. గరాటా 1 అడుగు వెడల్పు ఉన్న గరాట పెట్టుకోవచ్చు. అదే.. 10 అడుగుల లోతు ‘ఇంకుడు బోరు’ కావాలనుకుంటే పైపు పొడవు 10 అడుగుల పొడవు, వ్యాసం 8అంగుళాలు ఉండాలి. గరాటాను కూడా మీటరు వెడల్పున ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక 50 అడుగుల లోతు వరకు 10అంగుళాల వ్యాసం కలిగిన పైపునకు 1 మీటరు వ్యాసం కలిగిన ఫనల్‌(గరాటా) అమర్చుకోవచ్చు. అధిక మోతాదులో నీటిని ఒడిసిపట్టుకొని భూగర్భంలోకి ఇంకింపజేసుకోవచ్చు.
– కేఎస్వీ రాజన్, సాక్షి, ముత్తుకూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  

సన్న, చిన్నకారు రైతులకు మేలు
వర్షపు నీటి సంరక్షణ కోసం గతంలో ప్రభుత్వం నిర్మించిన ఇంకుడు గుంతలు విఫలమయ్యాయి. అయితే, ఈ నూతన పద్ధతి ద్వారా వర్షపు నీటిని సులభంగా ఒడిసిపట్టుకోవచ్చు. ఈ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తుంది. నిర్వహణ సమస్యలు ఉండవు. సన్న, చిన్నకారు రైతుల పొలాల్లో, ఇళ్ల దగ్గర ఇది ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే పరికరాలతో కారు చౌకగా ఈ పరికరాన్ని తయారు చేసుకొని, తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు.

– డాక్టర్‌ ఏ. జగదీష్, శాస్త్రవేత్త, (94901 25950, 95336 99989)
డైరెక్టర్, నాయుడమ్మ సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆల్టర్నేటివ్స్, నెల్లూరు


ఇంకుడు బోరు నిర్మాణానికి  గుంత తవ్వుతున్న దృశ్యం, పీవీసీ పైపునకు బెజ్జాలు వేసి మెష్‌ను చుడుతున్న దృశ్యం

మరిన్ని వార్తలు