రైతులకు, గ్రామీణులకూ హక్కులొచ్చాయి!

1 Jan, 2019 10:32 IST|Sakshi

17 ఏళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత అతిముఖ్యమైన డిక్లరేషన్‌ వెలువరించిన ఐక్యరాజ్య సమితి 

సంప్రదాయ విజ్ఞానం, జీవవైవిధ్యం, ప్రకృతి వ్యవసాయం, దేశీ విత్తనాలు, నీటి వనరులపైనా హక్కులు 

రైతులు, గ్రామీణుల హక్కుల చట్టాల రూపకల్పనపై సభ్యదేశాలకు మార్గదర్శనం 

ఆరుగాలం కాయకష్టంతో పొట్టపోసుకునే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామాల్లో పనీపాటలతో జీవనం సాగించే బడుగు ప్రజల హక్కులకు ఐక్యరాజ్య సమితి బాసటగా నిలిచింది. 2018 ఆఖరులో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఒక ముఖ్య పరిణామం ఇది. పరిమిత వనరులతోనే ప్రపంచ జనాభాకు 70% ఆహారాన్ని పండించి అందిస్తున్న మట్టి మనుషులకు ఉన్న హక్కులను సముచితంగా గుర్తించమని అంతర్జాతీయ సమాజానికి ఐరాస సర్వసభ్య సమావేశం చాటిచెప్పింది. ఈ మేరకు డిసెంబర్‌ 17న తుది డిక్లరేషన్‌ను న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 73వ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఇందులో పేర్కొన్న హక్కులను దేశీయ చట్టాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు, గ్రామీణులకు రక్షణ కల్పించాలని ప్రపంచ దేశాల నేతలకు, ప్రభుత్వాలకు సూచించింది. 
పాలకుల నిరాదరణకు, అన్యాయాలకు గురవుతూ కనీస మానవ హక్కులకు నోచుకోకుండా.. అరకొర ఆదాయాలతో అర్థాకలితో అలమటిస్తూ.. భూమి హక్కులు, సాంఘిక, ఆర్థిక, ఆహార భద్రత లోపించి, అప్పులపాలై కుంగిపోతూ, ఆత్మహత్యల పాలవుతున్న చిన్న–సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, ఆదివాసులు, సంచార జాతులు, ఇతర గ్రామీణ వృత్తిదారులకు.. ఐక్యరాజ్య సమితి కొత్త సంవత్సరం కానుకగా ఈ డిక్లరేషన్‌ను వెలువరించడం గొప్ప సానుకూల పరిణామం. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ తర్జన భర్జనల తర్వాత డిసెంబర్‌ 17న ఐక్యరాజ్య సమితి రైతులు, గ్రామీణ ప్రజల ప్రత్యేక హక్కుల డిక్లరేషన్‌ను వెలువరించడం విశేషం. 

ఏమిటీ డిక్లరేషన్‌? 
74 దేశాలకు చెందిన 164 రైతు సంఘాలతో కూడిన సమాఖ్య ‘లా వయ కంపెసినా’, స్వచ్ఛంద సంస్థలు ‘సెటిమ్‌’, ‘ఫియమ్‌’ ఇంటర్నేషనల్‌తో కలిసి తొలుత 17 ఏళ్ల క్రితం ఈ ప్రతిపాదనను ఐరాస మానవ హక్కుల విభాగం ముందుకు తెచ్చాయి. అంతేకాదు. అది మరుగున పడిపోకుండా పట్టించుకున్నాయి. 

ఆ తర్వాత ఐరాసలో బొలీవియా దేశ ప్రతినిధి 2012 నుంచి ఈ డిక్లరేషన్‌ను భుజానేసుకొని డిసెంబర్‌ 17న ఆమోదింపజేసే వరకూ విశేష కృషి చేశారు. ఐరాసలో సభ్యదేశాలు 193. రైతులు, గ్రామీణులకు ప్రత్యేక హక్కులు అవసరమేనని గుర్తించే 28 అధికరణాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను భారత్, చైనా సహా 121 దేశాలు సమర్థించాయి. ఆస్ట్రేలియా, యూకే, యు.ఎస్‌.ఎ. వంటి 8 దేశాలు వ్యతిరేకించాయి. 54 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఏదైతేనేమి డిక్లరేషన్‌ ఇప్పుడు అంతర్జాతీయ చట్టబద్ధత పొందింది. ఈ హక్కులను ఇక ప్రపంచ దేశాలు ప్రత్యేక చట్టాలు చేసి రైతులు, గ్రామీణుల హక్కులు రక్షించాల్సి ఉంది.   

దీనికి ఎందుకంత ప్రాధాన్యం?
చిన్న కమతాల్లో పంటలు పండించుకొని జీవనం సాగించే చిన్న, సన్నకారు రైతులు ప్రపంచ జనాభాకు అవసరమైన 70% ఆహారాన్ని ఆరుగాలం కష్టపడి పండించి అందిస్తున్నారు. ప్రకృత వనరలను తగుమాత్రంగా వాడుకుంటూ, గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించేందుకు దోహదపడుతున్నారు. అయితే, హక్కుల విషయానికి వచ్చేసరికి పట్టణప్రాంతీయులతో పోల్చితే చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణులు వివక్షకు గురవుతున్నారు. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న వ్యవసాయ విధానాలు సంపన్న రైతులు, పారిశ్రామిక వ్యవసాయదారులకు లబ్ధి చేకూర్చేవిగానే ఉన్నాయని.. ఈ విధానాల వల్ల చిన్న, సన్నకారు రైతులకు, రైతు కూలీలకు, ముఖ్యంగా వ్యవసాయంలో అత్యధికంగా శ్రమిస్తున్న మహిళా రైతులకు, చేకూరుతున్న లబ్ధి తూతూ మంత్రమేనని ఐరాస మానవ హక్కుల సలహా సంఘం చేసిన అధ్యయనంలో వెలడైంది. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణుల హక్కుల డిక్లరేషన్‌ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, సంప్రదాయ విజ్ఞానాన్ని పెంపొందించుకొని అనుసరించడం, ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడం, భూమిపైన, నీటిపైన, అడవి, ఇతర ప్రకృతి వనరులపైన రైతులు, గ్రామీణులకున్న సామూహిక హక్కులను కాపాడటం.. సభ్య దేశాల్లోని ప్రభుత్వాల విధి అని ఐక్యరాజ్యసమితి ఈ డిక్లరేషన్‌లో పేర్కొంది. 
దేశీ, స్థానిక వంగడాలను సాగు చేసి భద్రపరచుకొని వినియోగించుకోవడంతోపాటు ఇతర రైతులకు విక్రయించుకునే హక్కు కూడా కల్పించమని ఈ డిక్లరేషన్‌ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. మన దేశంలో ఇప్పటికే చట్టం ఉన్నా, అది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదన్న అభిప్రాయం ఉంది.   రైతులకున్న హక్కులు పాలకుల దృష్టిలో ఇకనైనా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు