అసాధారణ ఆదిశంకరులు

20 Apr, 2018 00:36 IST|Sakshi

రోబో సినిమా గుర్తుందా? అందులో రజనీకాంత్‌ ఇంతింతలావు పుస్తకాలు కూడా ఒక్క లుక్కుతో స్కాన్‌ చేసి పడేస్తాడు. తర్వాత ఎక్కడ ఏమున్నదీ ఠకాఠకా చెప్పేస్తాడు. అలాగే ఒక్కసారి వినగానే లేదా ఒక్కసారి చదవగానే ఒక పుస్తకం మొత్తం అక్షరం పొల్లు పోకుండా అప్పచెప్పగలవారు ఉంటారు. అలాంటి వాళ్లని ‘ఏకసంథాగ్రహి’ అంటారు. ఆంజనేయస్వామి ఆ కోవకే చెందుతాడు. ఆ తర్వాత జగద్గురు ఆదిశంకరులు. ఆయన కూడా ఏకసంథాగ్రహే!  శంకరాచార్యులవారి ప్రియ శిష్యుడు పద్మపాదుడు ఒకసారి యాత్రలకు బయలుదేరాడు. యాత్రలు చేస్తూ దారిలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లాడు. ఆ ఊరివారందరూ శంకరుల వారి ప్రధాన శిష్యుడైన పద్మపాదుణ్ని చూడటానికి వచ్చారు. ఆయన తన గురువు శంకరాచార్యుల గురించి చెబుతున్నాడు. పద్మపాదుడి దగ్గర ఉన్న ‘సూత్ర భాష్యార్థం’ అనే గ్రంథాన్ని చూశాడు మేనమామ. అందులో ఆ మేనమామ గురువైన ప్రభాకరుల సిద్ధాంతాన్ని పద్మపాదుడు విమర్శించాడు. ఆ మామయ్యకి చాలా కోపం వచ్చింది – అయినా ఆ కోపంపైకి కనిపించనివ్వలేదు.

కోపాగ్నికి ఆహుతి
‘‘నీ పుస్తకం చాలా బాగుంది. ఒకసారి చదివి ఇస్తాను. నువ్వు యాత్రలు ముగించుకుని ఇటే వస్తావు కదా! అప్పుడు తీసుకోవచ్చు. పుస్తకం ఇస్తావా?’’ అని అడిగాడు. ‘‘తీసుకో మామయ్య’’ అని దాన్ని ఇచ్చాడు పద్మపాదుడు. పద్మపాదుడు ఇలా బయలుదేరి వెళ్లగానే ఇలా ఆ పుస్తకాన్ని కాల్చిపారేశాడు మేనమామ. పద్మపాదుడు యాత్రలు ముగించుకొని మామయ్య దగ్గరికి వచ్చాడు. పుస్తకం ఇవ్వమని అడిగాడు. ‘‘ఇంకెక్కడి పుస్తకం? అగ్ని ప్రమాదంలో కాలిపోయిందిగా’’ అన్నాడు మామయ్య.

ఉన్నది ఒకటే ప్రతి
పాపం.. పద్మపాదుడికి ఏడుపొచ్చింది. ఏం చెయ్యాలి? ఆ కాలంలో రచనలన్నీ తాటాకుల మీదనే చేసేవారు. ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ సాయంతో ఒకేసారి వెయ్యి పుస్తకాలు అచ్చు వేస్తున్నారు. కానీ, ఆ కాలంలో చేత్తోనే రాసేవారు. అందుకని ఒకటే ఉండేది. ఎవరికి కావాలంటే వాళ్లు ఆ పుస్తకాన్ని చూసి రాసుకునేవారు. ఉన్న ఒక్క గ్రంథం కాలిపోతే, ఇక పద్మపాదుడు ఏం చేయగలడు? మళ్లీ రాయాలంటే సాధ్యమవుతుందా? తన బాధ చెప్పుకోవడానికి తన గురువుగారైన శంకరాచార్యుల దగ్గరికి వచ్చాడు – తన గ్రంథం కాలిపోయిందని చెప్పి బాధపడ్డాడు పద్మపాదుడు.

శంకరుని పునఃకృతి
శంకరాచార్యులు చిరునవ్వు నవ్వాడు. ‘‘నువ్వు రాసేటప్పుడు, ఏ రోజు రాసింది ఆ రోజు నాకు వినిపించావు కదా! నాకు గుర్తున్నంత వరకూ చెబుతాను – రాసుకో’’ అన్నాడు శంకరాచార్యులు. పద్మపాదుడు రాయడానికి కూర్చున్నాడు. ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్పాడు శంకరాచార్యులు. పద్మపాదుడి ఆనందం అంతా ఇంతా కాదు. శంకరాచార్యుల ధారణశక్తి ఎంత గొప్పదో కదా!
ఇది ఒక గ్రంథం మాత్రమే కదా! ఇంకో సంఘటనలో మూడు నాటకాలు తిరిగి చెప్పారు! కేరళ ప్రభువు రాజశేఖరుడు  మూడు నాటకాలు రచించి, శంకరాచార్యులవారికి చూపించాడు. కొంతకాలం గడిచింది. ఆ నాటకాలు పోయినయి. రాజు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి శంకరాచార్యులని కలిసినప్పుడు మాటల సందర్భంలో నాటకాల సంగతి చెప్పాడు రాజశేఖరుడు. ‘‘నేను చెబుతాను రాసుకో’’ అన్నాడు శంకరాచార్యులు. ఉన్నదున్నట్లుగా మూడు నాటకాలు చెప్పడంతో రాజు ఆనందించాడు.
శంకరులకున్న ఈ విద్యనే ధారణ అంటారు. అంటే కాన్‌సన్‌ట్రేషన్‌తో విని గుర్తు పెట్టుకోవడం. ఒకసారి కాకపోతే మానె, కనీసం నాలుగైదుసార్లు చదివినా సరే, పిల్లలకు గుర్తుండిపోతే చాలదూ! శంకరుల వారు పుట్టిన తిథి నేడు. వారిని స్మరించుకోడానికి ఇదొక సందర్భం.
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు