ఉపమానం చెప్పలేని వేల్పు వేంకటేశ్వరుడు

19 Apr, 2017 00:38 IST|Sakshi
ఉపమానం చెప్పలేని వేల్పు వేంకటేశ్వరుడు

ఉపమాక వేంకటేశ్వరాలయం

ఉపమాక అంటే సాటి లేనిది అని అర్థం. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం స్ఫురించేలా పురాణాలలో ఉపమాక అనే పదాన్ని ఉపయోగించారు. ‘కలౌ వేంకటనాయక’ అన్నట్లుగా, కలియుగంలో శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరస్వామి అవతారంలో వేంచేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఉపమాక వేంకటేశ్వరస్వామి. ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శించినవారు తిరిగి భగవంతుడిని దర్శించుకోవడానికి పదే పదే వెళ్లి తీరతారని స్థానికులు చెబుతారు. స్వామివారు గరుడాద్రిపై విశ్రాంతి కోసం పవళించినట్లుగా తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో బందుర సరస్సు ఉంది. ఇది చాలా పవిత్రమైనదని, తిరుమలలోని పాపనాశంతో సమానమని చెబుతారు.

క్రీ.శ. ఆరవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ భూపాలుడు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. ఇక్కడ క్షేత్రపాలకుడైన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని, 11వ శతాబ్దంలో రామానుజులవారు ఈ ఆలయాన్ని దర్శించారనీ తెలుస్తోంది.

స్థలపురాణం
ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండాలని కోరాడు. దక్షిణ సముద్రతీరంలో గరుడ పర్వతం ఉందని, తాను వేటకు వచ్చి అక్కడ వేంకటేశ్వరునిగా స్థిరపడతానని వరమిచ్చాడు. అలాగే మునులు తమకు మోక్షం ప్రసాదించాలని కోరగా, దక్షిణ సముద్ర తీరమంతా అరణ్యప్రాంతమని, అక్కడ అడవి జంతువులుగా జన్మిస్తే, తాను వేటకు వచ్చి మోక్షం ప్రసాదిస్తానని, అనంతరం అక్కడే స్థిరపడతానని వరమిచ్చినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. మాట నిల»ñ ట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు... ఉపమాక గ్రామంలో ఉన్న గరుడ పర్వతం మీద కొలువయ్యాడని, అక్కడ సంచరించే గొర్రెల కాపరులు స్వామివారికి నిత్య సేవలు చేస్తూ, నైవేద్యాలు సమర్పించడం ద్వారా భగవంతుడు వెలిశాడని గ్రామప్రజలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి, ఋషీశ్వరులకు ఇచ్చిన వరప్రభావంతో కలియుగంలో షడ్భుజాలతో, లక్ష్మీ సమేతుడై, అశ్వాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు.

ఆరు భుజాలతో దర్శనమిచ్చే అరుదైన విగ్రహం: ఇక్కడి వేంకటేశ్వరుడు ఆరు భుజాలు, పంచాయుధాలతో దర్శనమిస్తాడు. ఇందులో ఐదు భుజాలు దుష్ట శిక్షణకు, ఒక హస్తం అభయ ముద్రలో ఉంటూ, భక్తులకు అభయమిస్తుంటాడు. గుర్రం మీద కూర్చుని, క్రింద వామభాగంలో ఎడమవైపున లక్ష్మీదేవిని కలిగి కనువిందు చేస్తాడు. స్వయంభూగా వేంచేసిన క్షేత్రం ఉపమాక. ఈ పేరు పురాణాలలోనూ కనిపిస్తుంది.


ఎక్కడ ఉంది?
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం క్రీ.పూ 6వ శతాబ్దానికి చెందినది. తుని – విశాఖపట్టణం ప్రాంతాలకు మధ్యగా ఎన్‌హెచ్‌ – 5 నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉంది ఉపమాక గ్రామం.

స్వామి దర్శనం
17, 18 శతాబ్దాలలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువు ఎంతో ముచ్చటపడి విలువైన పచ్చలు, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని చేయించుకున్నాడట. ధారణకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ముందు రోజు రాత్రి ఆ రాజుకి కలలో స్వామి దర్శనమిచ్చి, ‘ఉపమాక క్షేత్రంలో నేను వేంచేసి ఉండగా, నాకు సమర్పించకుండా నువ్వు ఎందుకు ధరించాలనుకుంటున్నావు’ అని అడిగాడట. పశ్చాత్తాప పడిన రాజు మరునాడు ఊరేగింపుగా ఉపమాక వచ్చి స్వామివారికి కిరీటం సమర్పించాడట.

ఎలా చేరుకోవాలి? రోడ్డు మార్గం
నర్సీపట్నం రోడ్‌... రైల్వే స్టేషన్‌నుంచి 4 కిలోమీటర్లు ∙రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి గంటగంటకూ ఆర్టీసీ బస్సులు ∙తుని, యలమంచిలి ప్రాంతాల నుంచి బస్సులు ఎక్కువగా ఉన్నాయి ∙నర్సీపట్నం రోడ్, అడ్డ రోడ్, నక్కపల్లి ప్రాంతాల నుంచి సర్వీస్‌ ఆటోలు నడుస్తూనే ఉంటాయి.

రైలు మార్గం
∙చెన్నై – కలకత్తా మార్గంలో తునిలో దిగితే, అక్కడ నుంచి 20 కి.మీ. దూరం ∙కొన్ని రైళ్లు నర్సీపట్నం రోడ్‌ స్టేషన్‌లో ఆగుతాయి. ఇక్కడి నుంచి ఉపమాక గ్రామం కేవలం 4 కి.మీ.
విమానమార్గం
విశాఖపట్టణం విమానాశ్రమం. ఇక్కడ నుంచి ఉపమాక గ్రామం 90 కి.మీ. దూరం

క్షేత్ర విశేషాలు
గరుడాద్రి పర్వతంపై గుర్రంపై వేటకు వెళ్తున్న రూపంలో స్వామి దర్శనమిస్తాడు ∙ఆలయానికి ఎదురుగా ఉన్న బందుర సర స్సులో బ్రహ్మ తపస్సు చేశాడట. ఆ సరస్సులోని పవిత్ర జలాలతో అనునిత్యం స్వామివారికి అభిషేకం చేస్తా్తరు ∙స్వామి వారు పగలు తిరుపతిలోను, రాత్రి ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరి (విశ్రాంతి కోసం) ఉంటారని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. అందువల్లే ఉదయం 5గం.లకు స్వామివారి గర్భాలయ ద్వారాలు తెరిచి, పూజాదికాలు నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు ∙కొండ దిగువన బేడా మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులు, పక్కన ఉపాలయంలో ఆండాళ్లమ్మవారు కనువిందు చేస్తారు ∙బందుర సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

స్వామివారికి కోట్ల విలువ చేసే స్వర్ణాభరణాలు, నవరత్నాల ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యం ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి శనివారం అన్నదానం చేస్తారు ∙అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్కరోజు లభించే ఉత్తర ద్వారదర్శనం, ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా విలసిల్లుతోంది. ∙దూరం నుంచి ఈ పర్వతం గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఈ కొండను గరుడాద్రి అంటారు ∙భక్తులు దగ్గరుండి మూలవిరాట్‌కు అనునిత్యం పంచామృత అభిషేకం  చేయించుకోవచ్చు.

పంచామృతాభిషేక సమయంలో స్వామివారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే, సంతానప్రాప్తి కలుగుతుందని నమ్మకం ∙స్వామివారికి తమ కోరికను విన్నవించి, అది నెరవేరిన తరవాత కాలి నడకన కొండపైకి వస్తాననుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని, నెరవేరిన వెంటనే కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని స్థానికులు చెబుతారు ∙త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్‌ స్వామివారు భారతదేశంలో ప్రతిష్ఠించిన 108 స్థూపాలలో ఇది 48వది.
– డా.పురాణపండ వైజయంతి
సహకారం: ఆచంట రామకృష్ణ సాక్షి, నక్కపల్లి

మరిన్ని వార్తలు