ప్రైమ్‌ మినిస్టర్‌

7 Feb, 2018 00:08 IST|Sakshi
నజియా ఖాన్‌

అరగంట సేపు మాట్లాడారు!

ప్రధాని నరేంద్ర మోదీ ఎవరితోనైనా కనీసం అరగంట సేపు మాట్లాడారంటే.. వాళ్లు, దేశంలోని ప్రముఖులైనా అయి ఉంటారు. లేదా ప్రత్యేక విదేశీ ఆహ్వానితులైనా అయి ఉంటారు. అయితే ఇటీవల మోదీతో అరగంట సేపు ముచ్చటించిన ఉత్తరప్రదేశ్‌ యువతి.. 18 ఏళ్ల నజియా ఖాన్‌ ఆ ప్రముఖులందరిలోకీ ప్రముఖురాలిగా గుర్తింపు పొందారు. బి.ఎ. ప్రథమ సంవత్సరం చదువుతున్న నజియా.. ‘సాహస పురస్కారం (బ్రేవరీ అవార్డు) అందుకోవడానికి మరో 14 మందితో కలిసి ఢిల్లీ వచ్చిన సందర్భంగా మోదీ ఆమెతో ప్రత్యేకంగా సంభాషించారు. కిడ్నాప్‌ కాబోతున్న ఆరేళ్ల బాలికను దుండగుల బారి నుంచి కాపాడటమే కాకుండా, ఆగ్రాలో తన కుటుంబ పరిసరాలలో జూదాన్ని అరికట్టడానికి తెగువ చూపడంతో ఈ అవార్డుకు నజియా ఎంపికయ్యారు. అవార్డును స్వీకరించేందుకు తల్లితో కలిసి ఢిల్లీ వచ్చిన నజియాతో మాట్లాడుతూ ఆ వివరాలన్నిటినీ కుతూహలంగా అడిగి తెలుసుకున్నారు మోదీ.

సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్పంచుకుని అనేక అవార్డులను గెలుచుకున్న నజియాకు.. మోదీ తనతో అంతసేపు మాట్లాడడం సహజంగానే సంతోషాన్ని కలిగించింది. ‘‘మోదీజీ నన్ను ‘లడకు’ అని పిలిచారు అని ఇప్పటికీ ఆమె ఎంతో అబ్బురంగా చెప్పుకుంటున్నారు. లడకా, లడికీ (అబ్బాయి, అమ్మాయి) లను కలిపి.. మోదీ మురిపెంగా ‘లడకు’ అని చేసిన పద ప్రయోగంలో అమ్మాయిలు అబ్బాయిలకన్నా ఏమీ తక్కువ కాదు అనే భావన ఉంది. అయితే మోదీ అక్కడితో ఆగలేదు. ‘‘నజియా మీతో పోట్లాడుతుంటుందా?’’ అని నజియా తల్లిని దగ్గరకు పిలిచి మరీ అడిగారు. దానికి ఆ తల్లి మనసు ఉప్పొంగిపోయింది. అవార్డు తీసుకున్న అనంతరం రిపబ్లిక్‌ డే పరేడ్‌లో కూడా నజియా పాల్గొన్నారు.  మొత్తం 18 మంది అవార్డు గ్రహీతలలో నజియా ఒకరు. వారిలో ముగ్గురికి  మరణానంతరం అవార్డు లభించింది. 

మరిన్ని వార్తలు