వాతావరణ సూచన : హర్షాభావం

24 Feb, 2020 03:59 IST|Sakshi

కొత్త బంగారం

అడవిలో నడుస్తున్న ఇద్దరు కొద్ది దూరంలో ఆకలిమీదున్న ఒక ఎలుగుబంటిని చూశారు. వెంటనే ఒకతను పారిపోవడానికి తయారైపోయాడు. రెండో అతను, ‘‘నువ్వెంత ప్రయత్నించినా ఎలుగుబంటి కంటే వేగంగా పరిగెత్తలేవు,’’ అన్నాడు. మొదటి వ్యక్తి అతన్ని చూసి–‘‘ఫర్లేదు, నీకంటే వేగంగా పరిగెత్తితే చాలు కదా!’’ అన్నాడు. ఆరేళ్ల క్రితం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పెక్యులేషన్‌ నవలతో సంచలనాన్ని సృష్టించిన అమెరికన్‌ రచయిత్రి జెన్నీ ఓఫిల్‌ తన తాజా నవల వెదర్‌లో ‘లేట్‌ కాపిటలిజం’ అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్నకి ఇచ్చిన చమత్కార సమాధానం అది. అలాగని ఈ నవల లేట్‌ కాపిటలిజమ్‌ గురించి కాదు. హాస్య వ్యంగ్యాలు కథనశైలిలో ఒక భాగమే తప్ప, ఇది పూర్తిగా అలాంటి తరహా నవలా కాదు. వీటన్నింటినీ దాటుకుని వాతావరణం, పర్యావరణం, మనిషి మనుగడల మీదుగా నవల విస్తృతి కొనసాగుతుంది.

నవలలోని కథకురాలు లిజీ ఒక లైబ్రేరియన్‌. భర్త, కొడుకు, తమ్ముడి చుట్టూ ఆమె జీవితం అల్లుకుని ఉంటుంది. లిజీకి ఒకప్పటి ప్రొఫెసర్‌ అయిన సిల్వియా, వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తూంటుంది. సిల్వియాకి ఉన్న పని ఒత్తిళ్ల వల్ల ఆమెకొచ్చే రకరకాల మెయిల్స్‌ చూసి సమాధానాలు ఇవ్వటానికి లిజీని కుదుర్చుకుంటుంది. ఆ మెయిల్స్‌లోని వైవిధ్యం చూసి లిజీ ఆశ్చర్యపోతుంది. పర్యావరణానికి మనిషి కలిగిస్తున్న హాని, తద్వారా వచ్చే వాతావరణ మార్పులు రానున్న ఉపద్రవానికి సూచనలనీ, ఆ ప్రమాదం సుదూర భవిష్యత్తులో కాదనీ, అనుకున్న దానికంటే చాలా వేగంగా సమీపిస్తోందనీ ఎంతోమంది ఆందోళన చెందటం ఆ మెయిల్స్‌లో గమనిస్తుంది. ముంచుకొస్తున్న వినాశనాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయని అలసత్వాన్ని గుర్తిస్తుంది. రాబోయే తరాల భద్రత గురించి ఎలాంటి అనుమానాలూ లేని లిజీకి ఈ కొత్త ఎరుక ఉలికిపాటుని కలిగిస్తుంది. తన పిల్లవాడి గురించీ, తరువాతి తరాల గురించీ ఆలోచిస్తున్న లిజీతో ‘‘నువ్వు నీ పిల్లల్ని వీటన్నిటినుంచీ రక్షించగలననే అనుకుంటున్నావా?’’ అని ఆమె ఆలోచనా భారాన్ని మరింత పెంచుతుంది సిల్వియా.

అందరిలానే జీవన వైరుధ్యాలని లిజీ కూడా ఎదుర్కొంటూనే ఉంటుంది. బొటాబొటి జీతం, తమ్ముడి బాధ్యత, ఆ బాధ్యత వల్ల సంసారంలో ఇబ్బందులూ, పిల్లవాడూ, చదువూ వంటి వైయక్తిక సమస్యలు ఎన్ని ఉన్నా, ఎన్నికల ఫలితాలూ, నిరంకుశ ధోరణులూ, పెరుగుతున్న అసమానతలూ, స్కూల్లో కాల్పులూ, అభద్రతలూ, అలుముకుంటున్న నిరాశ వంటి సామాజిక పరిస్థితులు భయం కలిగిస్తున్నా – వీటన్నిటి మధ్య కూడా పర్యావరణం పట్ల తన బాధ్యత గురించి ఆలోచించే లిజీ కథే ఈ నవల. రకరకాల విషయాల ప్రస్తావనలతో ప్రారంభంలో పాఠకుడికి పట్టు దొరకనివ్వని కథనం, పోనుపోను అల్లిక చిక్కనై అందులోకి లాగేస్తుంది. కథావిస్తరణలో ఏ నవలా సూత్రాలకీ కట్టుబడకుండా, తార్కికమైన మొదలూ తుదీ అంటూ లేకుండా సాగే కథ– లిజీ ఆలోచనల విస్ఫోటనాల చుట్టూ పాదరసంలా సంచలిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు కొంత హాస్యంతో, కొంత తాత్త్వికతతో కలగలిసి ఆమె మేధను తాకి విడిపోతుంటాయి. రోజువారీ జీవితపు పరుగులో మనిషి కొట్టుకుపోతూ, తన మనుగడనే ప్రశ్నార్థకం చేసే ముఖ్యమైన విషయాలను చూసీచూడనట్టు వదిలేయటం సరికాదన్నదే ఈ  నవల ఇతివృత్తం. మేధోపరమైన చర్చలకే పరిమితమైపోతున్నవారు, మార్పుకోసం బరిలోకి దిగి అందరితో కలిసి నడవాలన్నది నవలాంతరంగం.

పద్మప్రియ
 

మరిన్ని వార్తలు