తనది కాని దానం!

22 Apr, 2018 01:10 IST|Sakshi

ఒకరోజున శీలవర్థనుడు అనే భిక్షువు తన మార్గంలో పోతూ ఒక మామిడి తోపులో ఆగాడు. కొంతసేపు ఒక చెట్టుకింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. తోటలో చెట్లన్నీ మామిడిపండ్లతో నిండి ఉన్నాయి. అతనికి బాగా ఆకలిగా ఉంది. పైగా తోటలో కాపలాదారు కూడా లేడు. కోసుకు తినడం దొంగతనంగా భావించి అలాగే కూర్చొని పోయాడు.

ఇంతలో ఒక మామిడిపండు రాలి తన ముందే పడింది. దోరమగ్గిన పండు వాసన ఘుమాయించి కొచ్చింది. ఇతరులు దానంగా ఇవ్వకుండా ఇలా తీసుకుని తినడం కూడా నేరంగానే భావించాడు. ఆ పక్క పొలంలో పశువుల్ని మేపుకుంటున్న ఒక వ్యక్తి ఇదంతా గమనించాడు. గబగబా వచ్చి ‘‘భంతే! మీ ముందు రాలి పడిన పండు ఉంది కదా! తీసుకోలేదేం?’’ అని అడిగాడు.

‘‘ఇతరులు దానం చేయకుండా గ్రహించను’’ అన్నాడు. ‘‘సరే, ఇదిగో తీసుకోండి’’ అని ఆ వ్యక్తి ఆ పండుని తీసి, భక్తితో భిక్షువుకి ఇచ్చాడు. ‘‘ఈ తోట నీదేనా?’’ అని అడిగాడు భిక్షువు. ‘‘కాదు భంతే! నాకు తెలిసిన వారిదే!’’అన్నాడు. ‘‘నీది కానప్పుడు దీన్ని దానం చేసే అర్హత నీకు లేదు. దాన్ని గ్రహించడం కూడా దోషమే’’ అన్నాడు భిక్షువు. ఆ వ్యక్తి ఆశ్చర్యపడి, వెంటనే పోయి తోట యజమానిని తీసుకుని వచ్చాడు. ఆ యజమాని ఇస్తే ఆ పండు స్వీకరించి ఆకలి తీర్చుకున్నాడు భిక్షువు. తగిన యజమానులు దానం చేయకుండా ఏ వస్తువుని గ్రహించినా అది ‘దొంగతనమే’ అని బుద్ధుడు చెప్పిన సూత్రాన్ని నిజాయితీగా పాటించి, అనతి కాలంలోనే మంచిభిక్షువుగా రాణించాడు శీలవర్థనుడు.

– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు