అతిథి కోసం వెలిగిన దీపం

12 Mar, 2018 01:02 IST|Sakshi

మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానానికి చాణక్యుడు ప్రధాన సలహాదారు. ఓ రాత్రి అతడు తన ఇంట్లో కూర్చొని, దీపం బుడ్డీ వెలుగులో రాజప్రాసాదానికి అవసరమైన పాలనా పత్రాలను లిఖిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఓ అతిథి చాణక్యుడి ఇంటికి వచ్చాడు. చాణక్యుడు అతడిని తన పక్కనే కూర్చోబెట్టుకుని, తన రాత పనిని త్వరత్వరగా ముగించాడు. తర్వాత వేరొక దీపపు బుడ్డీని వెలిగించి తెచ్చి ఆ అతిథి దగ్గర పెట్టాడు. ఆ వెంటనే అంతకు క్రితం వరకు ఏ దీపపు బుడ్డీ వెలుగులోనైతే తను రాస్తూ కూర్చున్నాడో ఆ బుడ్డీని ఆర్పేశాడు.
అతిథి ఆశ్చర్యపోయాడు!

‘ఇదేమైనా మీ ఇంటి ఆచారమా?’’ అని అడిగాడు. చాణక్యుడు నవ్వాడు. ‘కాదు’ అన్నాడు. ‘మరేమిటి?’ అని అడిగాడు ఆ అతిథి. అప్పుడు చాణక్యుడు: ‘‘నేను రాస్తున్నప్పుడు వెలుగుతూ ఉన్న దీపపు బుడ్డీలో ఉన్నది రాజప్రాసాదం ఇచ్చిన తైలం. అందుకని ఆస్థాన పత్రాలను ఆ వెలుగులో రాశాను. నువ్వు నా వ్యక్తిగత అతిథివి కనుక నీతో మాట్లాడ్డం కోసం నా ఇంట్లో ఉన్న తైలంతో వెలిగే దీపపు బుడ్డీని తెచ్చాను’’ అని అన్నాడు. అతిథి ఆశ్చర్యపోయాడు. వృత్తి వల్ల ఒనగూడే ప్రయోజనాలతో ఇంటిని గడుపుకునేవారు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలా చెయ్యడం తప్పు అని, అనైతికం అని ఈ కథ నీతి. కథ నీతి కాదు. చాణక్య నీతి.

మరిన్ని వార్తలు