ఉల్లి పొట్టుతో ఉపయోగాలెన్నో!

30 Jun, 2020 08:26 IST|Sakshi
ఉల్లిపొట్టు, గుడ్ల పెంకులు, వాడేసిన టీ పొడి

ఉల్లి పొట్టుతో సేంద్రియ ఎరువు, సేంద్రియ పోషక జలం

టమాటా, పండ్ల, పూల మొక్కలకు ఎంతో ఉపయోగం

ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు

ప్రతి వంటింట్లో అనుదినం ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ పై పొర ఎండిపోయి ఉంటుంది. సాధారణంగా ఈ పొట్టును తీసి చెత్తబుట్టలో వేస్తుంటాం. అయితే, అలా పారెయ్యకుండా మీ ఇంటిపంటల ఉత్పాదకత పెంపుదల కోసం ఉల్లి పొట్టును ఉపయోగించుకోవచ్చు. చక్కని సేంద్రియ ఎరువును, పోషక జలాన్ని కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని వాడుకునే పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉల్లి పొట్టుతో సేంద్రియ ఎరువు
పండ్ల మొక్కలు, పూల మొక్కలకు పోషక లోపం లేకుండా అన్ని పోషకాలనూ అందించేందుకు ఉల్లి పొట్టుతో తయారు చేసుకునే సేంద్రియ ఎరువు ఉపయోగపడుతుంది. పూత రాలుడు సమస్యను ఆపుతుంది. ఉల్లి పొట్టులో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్‌ పుష్కలంగా, స్వల్పంగా గంధకం ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు పోషక లోపం లేకుండా, వేరు వ్యవస్థ బాగా విస్తరించి, ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. ఉల్లి పొట్టుతోపాటు.. వాడేసిన టీపొడిని, కాల్షియం కోసం గుడ్ల పెంకులను కూడా కలుపుకుంటే సమగ్రమైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. 

ఉల్లిపొట్టు ఎరువు

ఉల్లి పొట్టును బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన పొట్టునే వాడాలి. వాడేసిన టీ పొడిని కూడా బాగా ఎండబెట్టి వాడాలి. టీ పొడితోపాటే పంచదార వేసుకొని మరగబెట్టే అలవాటు మీకుంటే.. వాడేసిన టీ పొడిని నీటిలో కడిగి మరీ పూర్తిగా ఎండబెట్టి, ఆ తర్వాత ఈ ఎరువు తయారీలో ఉపయోగించాలి. టీ పొడిలో 4.4% నత్రజని, 0.24% ఫాస్ఫరస్, 0.25%పొటాషియం ఉంటాయి. గుడ్ల పెంకులను కూడా బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన ఉల్లి పొట్టు, వాడేసిన టీ పొడి, గుడ్ల పెంకులను సమపాళ్లలో తీసుకొని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అంతే.. సమగ్ర పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువు సిద్ధమైనట్లే. దీన్ని 3–4 నెలల పాటు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఉల్లి ఎరువు వేసుకునే విధానం... ప్రతి మొక్కకు వారానికి 2–3 చెంచాలు వేసి నీరు పోయాలి. టమాటా మొక్కలకు, గులాబీ మొక్కలకు ఇది వేస్తే తేడా ఇట్టే తెలిసిపోతుంది. 

ఉల్లి పొట్టుతో సేంద్రియ పోషక జలం
కేవలం ఉల్లి పొట్టుతో చాలా సులువుగా సేంద్రియ పోషక జలాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఇంటిపంటలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఒక పాత్రలోకి నీరు (పట్టుకొని పెట్టుకున్న వాన నీటిని వాడుకుంటే శ్రేష్టం. అవి లేకపోతే ఆర్‌.ఓ. నీరు పోయాలి) తీసుకొని అందులో ఎండు ఉల్లి పొట్టును వేసి మూత పెట్టాలి. రోజు గడిచే కొద్దీ పొట్టులోని పోషకాలు నీటిలోకి వచ్చి చేరుతూ ఉంటాయి. నీటి రంగు మారుతూ ఉంటుంది. 3–4 రోజుల తర్వాత వడపోసి బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. 1–2 నెలలు నిల్వ ఉంటుంది.
పిచికారీ విధానం... పూత దశకు ముందు 15 రోజులకోసారి ఈ పోషక జలాన్ని మొక్కలకు పోయండి. నీరు కలపాల్సిన అవసరం లేదు. ఎండ వేళ్లలో కాకుండా ఉదయం/సాయంత్రపు వేళల్లోనే పోయాలి. ఉల్లి పొట్టులోని యాంధిసైనెన్‌ పిగ్మెంట్స్‌ వల్ల పూలకు చక్కని నిగారింపు వస్తుంది. వేసవిలో గులాబీ మొక్కలు చక్కగా పూయడానికి దోహదపడుతుంది. 

వారానికి 2-3 చెం‘చాలు’

పచ్చబారిన ఆకులకు చెక్‌
పోషక లోపం వల్ల మొక్కల ఆకులపై పసుపు పచ్చ మచ్చలు వస్తుంటాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉల్లి పొట్టుతో తయారు చేసుకున్న పోషక జలం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. 100–200 ఎం.ఎల్‌. పోషక జలంతోపాటు 800 ఎం.ఎల్‌. నీటి (వాన నీరు/ఆర్‌.ఓ. నీరు)ని కలిపి పిచికారీ చేయాలి. మొక్కల ఆకులు పూర్తిగా తడిచేలా వారానికి రెండు సార్లు సూర్యోదయానికి ముందే చల్లాలి.   సిట్రస్‌ జాతి పండ్ల మొక్కలకు నీరు ఎక్కువగా పోయనవసరం లేదు. నీటి తేమ చాలు. నీటి తేమ త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే.. ఉల్లి పొట్టును/గడ్డిని మొక్కల చుట్టూ ఆచ్ఛాదన (మల్చింగ్‌)గా వేయాలి.  

మరిన్ని వార్తలు