ఒక శతాబ్దాన్ని పూడ్చేశాం

13 Aug, 2018 00:53 IST|Sakshi

కరుణానిధి స్మృతిలో

నా ఆచార్యా
నువ్వులేని సమయంలో
నిన్ను తలచుకుంటున్నాను

నేను చందమామని
సాహితీ వెలుగునిచ్చిన
సూరీడివి నీవే!

నువ్వు
విచిత్రాల చిత్రం
చిత్రాల విచిత్రం

నీ అడుగుజాడలను కలిపితే
ఒక బాటే ఏర్పడుతుంది

నీ మాటలను కలిపితేరము
ఒక భాషే ఏర్పడుతుంది

నీ విజయాలను కలిపితే
ఒక చరిత్ర ఏర్పడుతుంది

నీ అపజయాలను కలిపితే
కొన్ని వేదాలు ఏర్పడతాయి

ఎంత ఘనత – నీది
ఎంత ఘనత

నీ శ్రమలజాబితా పొడవు చూసి
కొండలు బెణుకుతాయి

నీతో పరుగిడి అలసి
గాలి మూర్చబోయింది.

వేసవి ఋతువుల్లో నువ్వు
వాడవాడలా ఎలా ఎండని మోసావు?

నేలకి నీడేది
చెట్టు ఎండ మోయకుంటే?

ఈ జాతికి నీడేది
నువ్వు ఎండ మోయకుంటే?

రాజకీయాన్ని తీసేసినా
నువ్వు సాహిత్యమై మిగులుతావు

సాహిత్యాన్ని తీసేసినా
అధ్యక్షుడవై నిలుస్తావు

నిన్ను
నేటి తరం స్తుతిస్తుంది
ఏడు తరాలు నెమరువేస్తాయి

నిన్ను
సమకాలీనం కొన్నివేళల మరిచిపోవచ్చు
భవిష్యత్తు ఎన్నడు మరవబోదు

తమిళులు కొందరు మరిచిపోవచ్చు
తమిళం ఎన్నడు మరవబోదు

కొండలను గులకరాళ్ళుగా
గులకరాళ్ళను ఇసుక రేణువులుగా
మార్చగల కాలమనే చెదలపుట్టకూడా
నీ కీర్తిని తాకబోదు

నిన్ను
ద్రావిడ ఉద్యమ అశ్వమన్నారు

ఒక సవరణ  –
తనమీద ఎవర్నీ
అధిరోహించనీయని
అసాధ్యమైన అశ్వం నీవు

పక్షుల విహారం
అడవి అభివృద్ధి అంటారు
నీ విహారం దేశాభివృద్ధి

నిన్న సంధ్యవేళ
ఒక సాగరతీరాన
మా శతాబ్దాన్ని పాతిపెట్టాము
వేచియుంటాము
అది ఒక యుగమై మొలకెత్తేందుకు.  

‘కవిరారాజు’ వైరముత్తు
తెలుగు అనువాదం: అవినేని భాస్కర్‌

మరిన్ని వార్తలు