కలెక్టర్‌ గారి ప్రేమకథ

14 Feb, 2020 08:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు ప్రేమికుల దినోత్సవం

త్రేతా యుగంలో సీతారాముల ప్రేమ లోకానికి రావణుడి పీడను వదిలించింది. ద్వాపరంలో సత్యభామ ప్రేమ నరకాసురుడి కథను అంతం చేసింది. కలియుగంలో పద్మావతి ప్రేమ శ్రీనివాసుడి సాక్షాత్కారాన్ని సకల జనులకు కలిగించింది. ప్రేమ ఎప్పుడూ అంతే మంచినే కోరుతుంది. అందుకే ప్రేమ అఖిలం.. అమరం. హారంలో దారంలా కనిపించదు. కానీ రెండు గుండెలను కలిపి ఉంచుతుంది. భావాలకు అందదు. మౌనంలో మాత్రం ప్రతిధ్వనిస్తుంది. మన జిల్లాలోనూ వేలాది ప్రేమకథలు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని. అచ్చమైనవి.. స్వచ్ఛమైనవి. కులాల కట్టుబాట్లు కాదని, ఆస్తుల అంతరాలను దాటుకుని ప్రేమను గెలిపించిన జంటలివి. మీది ఏ కులమంటే.. ప్రేమికులమని చెప్పిన ఫేమస్‌ లవర్స్‌ గురించి..  

సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : ఆయన ఇప్పుడు మేఘాలయ కలెక్టర్‌. ఆమె గుంటూరులో డీసీటీఓ. ఇద్దరివీ ఉన్నత ఉద్యోగాలే. ఉన్నత ఉద్యోగాలు రాకముందే వీరి మధ్య ప్రేమ చిగురించింది. మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే దశలో ప్రేమ వారికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. నరసన్నపేట మండం జమ్ము గ్రామానికి చెందిన సాధు శిబిచక్రవర్తి ఏసీటీఓగా కాకినాడలో శిక్షణ పొందుతున్న రోజుల్లో అదే కేంద్రంలో శిక్షణ పొందుతున్న గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన అంజనా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు కులాలు వేరయినా, మనసులు మాత్రం కలిశాయి.


కలెక్టర్‌ శిబిచక్రవర్తి దంపతులు 

అదే సమయంలో ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయిన శిబి చక్రవర్తి 2011వ సంవత్సరం మేఘాలయ రాష్ట్రంలో నార్త్‌ గోరోహిల్స్‌ జిల్లాకు కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. తాను ఉన్నతి స్థితికి చేరుకున్నప్పటికీ స్నేహితురాలు అంజనకు ఇచ్చిన మాట తప్పలేదు. 2013లో కట్నం అనే మాటే లేకుండా అన్నవరం సత్యనారాయణ సాక్షిగా ఇరువురూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం శిబి చక్రవర్తి మేఘాలయ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేస్తుండగా, అంజనా గుంటూరు జిల్లాలో డీసీటిఓగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు కుమారు, కుమార్తెలున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రేమ అనేది మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలే తప్ప అదే ప్రేమ పేరిట వినాశనానికి దారి తీయకూడదని సూచించారు.

శాండ్‌లవ్‌ 
ఎల్‌.ఎన్‌.పేట: ఇసుక రేణువులతో రూపొందించిన సైకత చిత్రాలు ప్రేమకు అసలైన అర్థం చెబుతున్నాయి. లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి తరణి ప్రసాద్‌ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత ప్రేమ చిత్రమాలిక. 

అంతరాలు చెరిపిన ప్రేమ 
టెక్కలి: అంతరాలు చెరిపిన ప్రేమ వారిది. నిజమైన అభిమానం, ఆప్యాయతకు ఆస్తులు అడ్డుగోడలు కావని నిరూపించిన బంధం వారిది. వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిల ప్రేమకథ స్వచ్ఛమైనది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో పలుకుబడి ఉన్న సంపతిరావు రాఘవరావు కుమార్తె దువ్వాడ వాణి. అప్పటికి దువ్వాడ శ్రీనివాస్‌ ఓ సామాన్య వ్యక్తి. దూరపు బంధువులే అయినా వారిద్దరికీ పరిచయమే లేదు. ఏదో ఒక సందర్భంలో కలిశారు. అంతే మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకోలేదు.


ప్రేమ జ్ఞాపకాలను చెబుతున్న దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి

ఇరువైపులా రెండు కుటుంబాల వాళ్లతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఐశ్వర్యంలో పెరిగిన తనకు కష్టం అనే పదం లేకుండా శ్రీనివాస్‌ కంటికి రెప్పలా చూసుకున్నారని దువ్వాడ వాణి తన భావాన్ని పంచుకోగా...శూన్యంగా ప్రారంభమైన తన జీవితానికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి వాణి అంటూ శ్రీనివాస్‌ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో చిన్న పాటి మనస్పర్థలు రావడం సహజమని అయితే ఆ మనస్పర్థలకు ప్రాణాలు తీసుకోవడం విడాకులతో విడిపోవడం చేస్తే వారి ప్రేమలో ఎలాంటి నిజాయితీ లేనట్లేనని దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 
ఉపాధ్యాయులు శ్రీనివాసరావు దంపతులు 

కులాల గోడలు బద్దలుగొట్టి.. 
ఇద్దరూ టీచర్లు. ఉన్నత భావాలు కలవారు. పదిమందికీ మంచిని చెప్పేవారు. ప్రేమ పెళ్లి విషయంలోనూ ఆ ఆదర్శం ఫాలో అయ్యారు. కులాల గోడలు బద్దలుగొట్టిని ప్రేమను గెలిపించారు. నరసన్నపేట మండలానికి చెందిన అక్కివలస శ్రీనివాస రావు 2010లో ఉపాధ్యాయ శిక్షణ పొంది ఇచ్ఛాపురం మండలం బాలకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా చేరారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో బోధనలో శిక్షణ పొందుతున్నప్పుడు సోంపేట మండలానికి చెందిన పి.ప్ర త్యూష అనే ఉపాధ్యాయురాలితో స్నేహం ఏర్పడింది. మూడేళ్ల పాటు కొనసాగిన వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరి వివాహానికి కులాలు అడ్డు గోడలుగా నిలిచాయి. వీరికి బాసటగా స్నేహితుడు సాధు శిబి చక్రవర్తి (మేఘాలయ రాష్ట్రం నార్త్‌ గోరోహిల్స్‌ కలెక్టర్‌) అండగా నిలిచారు. ఇద్దరి భావాలు ఒకటే కావడంతో 2013వ సంవత్సరంలో అన్నవరంలో అదే స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రీనివాసరావు బాలకృష్ణాపురంలో, ప్రత్యూష ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రేమించడం తప్పులేదు గానీ, ఆ ప్రేమ పేరుతో మోసం, దగా చేయకుండా ప్రేమ పవిత్రతను చివరి వరకూ కాపాడుకుంటు వెళ్లాలంటూ నేటి ప్రేమికులకు ఈ దంపతులు సూచిస్తున్నారు.


కుటుంబంతో మందస ఎస్‌ఐ చిట్టిపోలు ప్రసాద్‌

మేధావి ప్రేమికులు 
మందస: ఇద్దరూ మేధావులే. అన్ని విషయాలను తర్కంతో ఆలోచించగలిగిన వారే. ప్రేమ విషయంలోనూ అంతే. మందస పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న చిట్టిపోలు ప్రసాద్‌ ప్రేమకథ ఎంతో మందికి ఆదర్శం. ప్రసాద్‌ సొంత గ్రామం విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని మామిడిపల్లి. ఆయనది కాపుకులం. ఆయన మనసుపడిన మేడిబో యిన లతది సారవకోట మండలంలోని ఓ పల్లెటూరు కాగా, శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. ఆమెది తెలగ కులం. విజయనగరంలో 2002 సంవత్సరంలో ఎంఎస్సీ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి. ఇద్దరూ వివాహం చేసు కోవడానికి నిర్ణయించుకున్నారు. ఎంఎస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన ప్రసాద్‌ కాకినాడలో పీజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంఫిల్‌ చదివిన లత కాకినాడలోనే బీఈడీ, డైట్‌ కళాశాలకు ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈ తరుణంలో ఇద్దరి బంధం బలపడింది. కులాలు వేరు కావడంతో కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. కానీ ఇరువర్గాలను అంగీకరింపజేసి, ఒక్కటయ్యారు. పెద్ద చదువులు చదువుకున్న ఇద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇద్దరు పిల్లలతో వీరి కుటుంబం అల్లారుముద్దుగా సాగుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్, లత దంపతులు ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 


లిల్లీపుష్పనాథం, లిల్లీరాణి 

ప్రేమించి.. పెద్దలను ఒప్పించి 
పాలకొండ: కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. కానీ చదువులు వదల్లేదు. ఉద్యోగాలు వచ్చే వరకు ఒకరికొకరు సహకరించుకున్నారు. పెద్ద వాళ్లు ముందు ఒప్పుకోలేదు. అయినా వారు పట్టు విడవలేదు. ఇరు కుటుంబాలను కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పాలకొండ నగరపంచాయతీ కమిషనర్‌ ఎ.లిల్లీపుష్పనాథం, హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం లిల్లీరాణిల ప్రేమకథ అందరికీ ఆదర్శం. వీరిద్దరూ ఇంటర్‌ చదువుకునే సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డా రు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. విజయనగరంలో డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రేమలో ఉన్నామన్న విషయం అర్థమైంది. ప్రేమలోనే ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. 

చదువు పూర్తి చేసిన తరువాత లిల్లీరాణి 1985లో ఉద్యోగంలో చేరాక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే అప్పటి ఇంకా ఉద్యోగం పొందని లిల్లీపుష్పనాథం ఉద్యోగం సాధించాకే పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నారు. అదే పంతంతో 1989లో ఉద్యోగం సాధించారు. అదే ఏడాది ఇద్దరూ తమ కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో ఏర్పడాలని, ప్రేమించడంతో పాటు తమ భవిష్యత్‌ లక్ష్యాలు సాధించుకోవాలని వీరు చెబుతున్నారు.  

 
కవిటి: కుమార్తె జాగృతితో సాయిరాజ్, విజయ

నొప్పించకుండా.. ఒప్పించి 
కవిటి: ప్రేమంటే ఎదురించడం మాత్రమే కాదు ఒప్పించడం కూడా. డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్, వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ మహిళా కన్వీనర్‌ పిరియా విజయలది పెద్దలకు కుదిర్చిన వివాహం. కానీ ఈ కుదర్చడం వెనుక మరో కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. 1997–98లో విశాఖ మహిళా కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుతున్న విజయను గాయత్రీ కాలేజీలో బీఏఐఆర్‌పీఎం చదువుతున్న సాయిరాజ్‌ తొలిసారి చూశారు. ముందు స్నేహితులయ్యారు. కొత్త మిలీనియం మొదలయ్యే సరికి ప్రేమికులయ్యారు. ప్రేమికులంటే పెద్దవాళ్లకు భయపడడం రివాజు. కానీ ఇక్కడ మేటర్‌ కాస్త రివర్స్‌.

ఒక రోజు విజయ తన తండ్రి వద్ద కెళ్లి ‘మీకు అభ్యంతరం లేకుంటే నా స్నేహితుడు సాయిరాజ్‌ను పెళ్లిచేసుకుంటా’ నని కోరింది. అందుకు ఆయన అంతే హుందాగా బదులిచ్చారు. ‘నీవు ఎంత ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటానన్నావో అక్కడ ఎదురయ్యే కష్టాన్ని కూడా అంతే ఇష్టంగా భరించాలి’ అని పెళ్లికి పచ్చ జెండా ఊపేశారు. 2000లోనే సాయిరాజ్‌తో విజయ వివాహం జరిగింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరిద్దరూ ‘సాక్షి’తో మాట్లాడుతూ జీవితంలో స్వశక్తిపై నమ్మకం ఉంచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. అప్పుడు ప్రే మ వివాహాలను సమాజం కూడా సమర్థిస్తుందని అన్నారు. తల్లిదండ్రు ల మనస్సులు గుర్తెరిగి వారి మనసులు గెలుచుకోవడం ద్వారా ప్రేమ వివాహాల్ని పెద్దలు కుదిర్చిన వివాహాలుగా చేసుకోవచ్చని సాయిరాజ్, విజయ వెల్లడించారు. 


లల్లూ దంపతులు

జై ఆంధ్రా అంటూనే.. 
కంచిలి: ఆయన ఓ రాజకీయ నాయకుడు. జీవిత సహచరి కూడా ప్రజా సేవకురాలే. నిత్యం గంభీరమైన ప్రసంగాలు, చర్చలు వీరి జీవితంలో సాధారణం. జనాల ముందు సీరియస్‌గా కనిపించే ఈ దంపతుల మధ్య కొండంత ప్రేమ ఉంది. కాలేజీ రోజుల్లో మొదలైన కథ అది. పెద్దలు ఒప్పుకోకపోతే ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు వీరు. ఇచ్ఛాపురం మాజీ శాసనసభ్యుడు నరేష్‌కుమార్‌ అగర్వాలా(లల్లూ), ఆయన భార్య కంచిలి మండల పరిషత్‌ మాజీ అధ్యక్షురాలు అనిత అగర్వాలాల గతంలోకి వెళ్తే.. వీరిద్దరూ సోంపేటలో గల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుకున్నారు. 1972–73 కాలంలో జై ఆంధ్రా ఉద్యమం జోరుగా జరుగుతోంది. విద్యార్థులంతా యాక్టివ్‌గా ఉద్యమంలో పాల్గొంటున్నారు.

ఆ ఉద్యమమే వీరికి ప్రేమకు వేదికైంది. కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వీరిద్దరూ జీవితాంతం కలిసే ఉండాలని ఆ నినాదాల మధ్యే అనేసుకున్నారు. అయితే చదువుకు పక్కన పెట్టి ప్రేమించడం లాంటి పనులు వీరు చేయలేదు. లల్లూ తన బి.ఎ. డిగ్రీ విద్యను అనకాపల్లిలో చేయగా, అనిత శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలలో పూర్తిచేశారు. న్యాయవిద్యను ఆమె విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో పూర్తిచేయగా, లల్లూ తన న్యాయవిద్యను ఒడిశా బరంపురంలో గంజాం లా కళాశాలలో పూర్తిచేశారు. విడివిడిగా చదువుకున్నా ప్రేమ మాత్రం తగ్గలేదు. చివరకు పెద్దలు కాదన్నా, కులాలు ఒకటి కాకపోయినా అందరినీ ఎదురించి 1983 సెప్టెంబర్‌4వ తేదీన ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చారు. లల్లూ రావడమే కాకుండా భార్యను కూడా రాజకీయాల్లో ప్రోత్సహించి ప్రేమికుడికి అసలైన అర్థం చెప్పారు.   

ప్రేమ 
ఓ ప్రేమ రామతత్వం 
ఓ ప్రేమ హరిశ్చంద్రుని సత్యం 
ఓ ప్రేమ అహల్య శాపం 
ఓ ప్రేమ బుద్ధుని రూపం 
ఓ ప్రేమ కార్తీక దీపం 
ఓ ప్రేమ కబీరు గానం 
ఓ ప్రేమ విశ్వకవి రవీంద్రుని ధ్యానం 
ఓ ప్రేమ మథర్‌ థెరిసా వాత్సల్యం 
ఓ ప్రేమ రైతన్న బసవన్నల అనుబంధం 
ఓ ప్రేమ అబ్ధుల్‌ కలాం ఆశయం 
ఓ ప్రేమ గాంధీమార్గం 
ఓ ప్రేమ అన్నాచెల్లెళ్ల రాఖీబంధనం 
ఓ ప్రేమ మన భవిష్యత్‌ భవబంధనాల సోపానం 
ఓ ప్రేమ మల్లె మకరందాల తుమ్మెదల ఓంకారనాదం 
ఓ ప్రేమ కుటుంబ వ్యవస్థకు ప్రాకారం 
ఓ ప్రేమ త్రివేణి సంగమం 
ప్రేమంటే ప్రేరేపించే మమకారం అంటుంది నా అంతరంగం 
ప్రేమ సృష్టికి మూలం, సత్యం, సనాతన ధర్మం 

– ఎస్‌. పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయుడు 
పెద్దదూగాం, జలుమూరు మండలం 

మరిన్ని వార్తలు