సంకల్పబలుడు

30 Oct, 2014 23:36 IST|Sakshi
సంకల్పబలుడు

భారతదేశంలో ఐక్యత గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు దేశ జాతీయోద్యమంలోను, ఆ తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం మాత్రమే మొదటి నిలువెత్తు ప్రతిమలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా... స్వాతంత్య్రానంతరం, మొరాయించిన సంస్థానాలకు ముకుతాడు వేసి మరీ భారతదేశంలో విలీనం చేయడంలోని దృఢ సంకల్పం ఆయనలోని ఉక్కు మనిషిని ప్రపంచానికి చూపింది. మనుషుల్ని, ప్రాంతాలను కలిపి ఉంచడానికి పటేల్ ఈ దేశపు తొలి హోమ్ మంత్రిగా కఠినమైన నిర్ణయాలే తీసుకున్నారు.

దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో చెలరేగిన అల్లర్లను కూడా తొలి ఉప ప్రధానిగా ఆయన ఎంతో సమర్థంగా అణచివేయగలిగారు. మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత పటేల్‌కు భారతరత్న లభించి ఉండవచ్చు కానీ, అందుకు సమానమైన గౌరవం ఈ ఏడాది నుంచి ఆయనను చిరస్మరణీయం చేయబోతోంది. పటేల్ జన్మించిన అక్టోబర్ 31 వ తేదీని ఏటా రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతాదినం)గా జరుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మరోపక్క మధ్య గుజరాత్‌లోని నర్మదా నది ఆనకట్టకు మూడు కి.మీ. సమీపంలో ఉన్న సాధు ద్వీపంలో 2,989 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తున ఏర్పాటు చేయ తలపెట్టిన పటేల్ ఐక్యతా ప్రతిమ నిర్మాణ పనులను గత సోమవారమే గుజరాత్ ప్రభుత్వం ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తు ఉండే ఈ విగ్రహం 2018లో పూర్తయ్యాక, ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా ఎత్తై స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ రికార్డును మించిపోతుంది. పటేల్‌లోని శిఖర సమాన దృఢచిత్తానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ఛాయామాత్రమైన ప్రతిరూపంగా నిలవగలుగుతుంది.
 
1875లో గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, తిరిగి ఇండియాకు వచ్చాక క్రియాశీలక ఉద్యమ రాజకీయాల్లో పాల్గొన్నారు. రాజనీతిజ్ఞుడిగా ఎదిగారు. దేశ పౌరుల ప్రథమ విధి తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడమేనని పటేల్ అంటారు.
 

మరిన్ని వార్తలు