మంచి కథను గుర్తించనీయని ఉద్దేశ భ్రమ

16 Dec, 2019 00:07 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

అనుశీలనం, నవలాశిల్పం, కథాశిల్పం, విమర్శాశిల్పం లాంటి పుస్తకాలతో తెలుగు సాహిత్య విమర్శకు, ముఖ్యంగా కథాసాహిత్యానికి మంచి భూమికను ఏర్పరిచారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. 1995లో వచ్చిన ఆయన కథాశిల్పంకు 1999లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ పుస్తకంలో మంచి కథను అంచనా గట్టడానికి భావజాలం అడ్డుకాకూడదనీ, ఉద్దేశం మంచిదైనంత మాత్రాన రచన మంచిదైపోదనీ ఇలా వ్యాఖ్యానించారు:
తటస్థ చరిత్రలాగే తటస్థ సాహిత్యం కూడా ఉండదు. చరిత్రను చదవటానికి ముందుగా చరిత్రకారుణ్ణి చదవాలని ఇ.హెచ్‌.కార్‌ సూచించాడు. అలాగే సాహిత్యం చదవటానికి ముందు దాన్ని సృష్టించిన సాహిత్యకారుణ్ణి చదవటం మంచిది. సాహిత్యం నుంచి భావజాలాన్నీ– మరీ ముఖ్యంగా రచయిత భావజాలాన్నీ– దూరం చేసి పరిశీలించటం మంచిపద్ధతి కాదు. కానీ రచయిత భావజాలానికీ, ఉద్దేశానికీ అతి ప్రాముఖ్యత ఇచ్చి, రచన విలువను నిర్ణయించటం కూడా తప్పు పద్ధతే. అంటే ‘‘రచయిత ఈ ఉద్దేశంతో రాశాడు, ఉద్దేశం గొప్పది, కాబట్టి రచన గూడా గొప్పది,’’ అన్న సమీకరణం పొరపాటు. దీన్ని నవ విమర్శకులు ‘‘ఉద్దేశ భ్రమ’’ (ఇంటెన్షనల్‌ ఫాలసీ) అన్నారు. రచయిత ఉద్దేశం ఎంత గొప్పదైనా కావచ్చు. అది రచనలో కళాత్మకంగా వ్యక్తం కానంతవరకూ దానికి విలువ లేదు. కథావస్తువు గమ్యమే ఉద్దేశం. ఉద్దేశాన్ని కళగా మార్చే పరుసవేది శిల్పం లేదా రూపం. ఈనాడు తెలుగు సాహిత్య విమర్శలో ‘‘ఉద్దేశ భ్రమ’’ చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. అందుచేత విమర్శకుడు ఆ భ్రమలో పడకుండా ఉండాలంటే కథాక్రమం, కథాంశం, ఉద్దేశం కళగా మారే క్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మీకు తెలుసా?
‘కవిత్వం ఒక స్వప్నక్రియ. కవిత్వం ఒక రహస్య క్రీడ. అంతా ఒక ‘చిత్కళ’. నేను వ్రాసిన పద్యాలన్నీ చిత్తుప్రతులే. ఎప్పుడో రాసిన పద్యాన్ని గూర్చి ఇప్పటికీ ఆలోచిస్తూవుంటాను. అవసరమైతే మార్పులు కూడా’ అన్న కవి అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. తన జీవితకాలంలో సుమారు 40 కవితలు మాత్రమే రాసిన ఆయన కవితాసంపుటి ‘స్వప్నలిపి’. దీనికి 1997లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
వల్లంపాటి వెంకటసుబ్బయ్య 

మరిన్ని వార్తలు