వందే వాల్మీకి కోకిలమ్‌

2 Apr, 2020 08:16 IST|Sakshi

శ్రీరామరామరామేతి రమే రామో మనోరమేసహస్ర నామ తత్తుల్యం రామనామవరాననే..విష్ణుసహస్రనామాలు చదవలేని వారు రామ అనే రెండు అక్షరాలు జపిస్తే చాలని సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతితో అన్నాడు. అంతటి మహిమాన్వితమైన రాముడిని వాల్మీకి ఒక ఆదర్శ మానవుడిగా మనసులో భావించి రామాయణ రచన చేశాడు. ‘ర’ అనే ఒక్క అక్షరాన్ని మాత్రమే రేఫం అంటారు. ర వర్ణానికి శరీర శుద్ధి చేసే లక్షణం ఉందని పరిశోధనలు వెల్లడించాయి.

రాముడు అందరివాడు.. అంతా రామమయం..పాలు మీగడల కన్న పంచదారల కన్న తియ్యనైన నామం..అందరినీ బ్రోచే నామం.. అంటూ రాముడిని ఎవరెవరుఏ విధంగా స్మరించుకున్నారో ఒక్కసారి మనం కూడా వారిని తలచుకుందాం.ఆది కవి వాల్మీకి క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షి నేల కూలటం చూసి, మనసు చలించి, రామాయణ కావ్యం రచించాడు. రామాయణం ఆదికావ్యం అయింది. నాటి నుంచి కలం పట్టిన ప్రతి కవీ రామాయణాన్ని వారి వారి భావాలతో అక్షరీకరించారు. రంగనాథ రామాయణాన్ని రచించిన గోన బుద్ధారెడ్డి, రామాయణాన్ని ఆ కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చేశాడు. లక్ష్మణ రేఖ, సీతమ్మవారిని భూమి పెకలించి రావణుడు ఎత్తుకు వెళ్లటం, శబరి ఎంగిలి పండ్లను ఇవ్వటం, రావణుడి కడుపులో అమృతభాండాన్ని సృష్టించటం.. ఇలా ఎన్నో. తరవాత భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, కంబ రామాయణం, తులసీదాసు రామచరిత మానస్‌... ఇలా అనంతకోటి రామాయణాలు వచ్చాయి. కాళిదాసు ‘రఘువంశ’ కావ్యాన్ని భారతీయులకు అందించాడు. వాల్మీకి రామాయణం తరవాత తెలుగువారు తరవాత ప్రసిద్ధిగా చెప్పుకోదగ్గది విశ్వనాథ రచించిన ‘రామాయణ కల్పవృక్షం’. 30 సంవత్సరాలు ఈ యజ్ఞం సాగింది.  రాముడి మీద ఉండే చనువుతో కొద్దిగా స్వేచ్ఛ తీసుకుని, రామాయణ మూల కథ చెడకుండా, మరిన్ని అందాలు సమకూర్చారు, జ్ఞానపీఠాన్ని అందుకున్నారు. రాముడిని తెగనాడినవారూ లేకపోలేదు. ఆ రాముడి ద్వారానే సదరు రచయితలు ప్రసిద్ధి పొందారు. ఇక సినిమా రచయితలు సైతం రాముడు సీతమ్మను అగ్నిపరీక్షకు గురి చేశారంటూ వారి సొంత కలాన్ని ఉపయోగించారు. సీతమ్మ తనకు తాను అగ్ని ప్రవేశం విధించుకుందని వాల్మీకి ఘోషించాడు. పురిపండా అప్పలస్వామి, బేతవోలు రామబ్రహ్మం, పుల్లెల శ్రీరామచంద్రుడు... గణింపలేనంత మంది రామాయణాన్ని రచించారు.

ఇదంతా సాహిత్యం..
భాగవతాన్ని రచిస్తూ పోతన..‘పలికెడిది భాగవతమట/పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట/పలికెద వేరొండు గాథ పలుకగనేలా!’అన్నాడు.రామనామంతో కంచర్ల గోపన్న రామదాసు అయ్యాడు. ‘శ్రీరఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభి రామ.......... భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!’ అంటూ వందకు పైగా పద్యాలతో శ్రీరామచంద్రుడిని ఆరాధించుకున్నాడు. వందలకొలదీ శ్రీరామ కీర్తనలు రచించాడు. ‘నను బ్రోవమని చెప్పవే’ అంటూ సీతమ్మను అర్థించాడు.

సంకీర్తనలు...
త్యాగరాజు తన కృతులతో, కీర్తనలతో రామనామాన్ని గానం చేసి పరవశించిపోయాడు. ‘బ్రోచేవారెవరే రఘుపతే’ అంటూ రాముడి ఔన్నత్యాన్ని చాటాడు. ఒకటా రెండా వందల కొలదీ కీర్తనలు రామనామాన్ని ప్రతిధ్వనించాయి. నీ దయ రాదా రామా.. అని విలపించాడు. త్యాగరాజుతో పాటు ఇతర వాగ్గేయకారులు కూడా రాముని స్తుతించారు.

సినిమాలలో...
రాముడి సినిమా అనగానే బాపురమణల జంట గుర్తుకు వస్తుంది. రాముడిని అన్నిరకాల కోణాలలో చూపేశారు బాపు. రాముడిని ఎన్నో రకాలుగా తన కలంతో ముద్దాడారు ముళ్లపూడి వెంకట రమణ. సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, సీతారామవనవాసం, శ్రీరామాంజనేయ యుద్ధం... లాంటి పౌరాణికాలే కాకుండా, సాంఘిక చిత్రాలలోనూ రాముడికి అగ్రస్థానం కల్పించారు. ముత్యాలముగ్గు, గోరంతదీపం, కలియుగ రావణాసురుడు లాంటి సినిమాలన్నీ రామాయణాన్ని సాంఘికంగా చూపినవే. ఎక్కడ కుదిరితే అక్కడ రాముడిని తెచ్చేస్తారు ఈ జంట. కమ్యూనిస్టుగా పేరుబడ్డ ఆరుద్ర కీర్తించినంతగా రాముడిని మరి ఏ ఇతర సినిమా కవి  పొగడలేదేమో.

మాధ్యమాల ద్వారా..
శ్రీరామనామం డా.  మంగళంపల్లి బాలమురళి గొంతు నుండి అమృతవర్షిణిగా కురిసింది. రామదాసు కీర్తనలను బాలమురళి తన గళం ద్వారా తెలుగు సంగీత ప్రపంచానికి అందచేశారు. విజయవాడ ఆకాశవాణిæ కేంద్రం ద్వారా ఇంటింటినీ అయోధ్యగా మలిచారు ఉషశ్రీ. తన గళంతో వాల్మీకి రామాయణాన్ని ప్రతి ఆదివారం తెలుగు శ్రోతలకు వీనులవిందు చేశారు.  దూరదర్శన్‌లో రామాయణాన్ని దృశ్యకావ్యంగా మలిచారు రామానందసాగర్‌. దువ్వూరి వెంకటరమణశాస్త్రి ‘జానకితో జనాంతికం’ అంటూ సీతమ్మతో స్వయంగా మాట్లాడినట్లు చేసిన రచన, ఆయన గొంతులో తెలుగు శ్రోతలను అలరించింది.
ప్రస్తుత కరోనా సమయంలో రాములోరి కల్యాణాన్ని అందరం ఇంటి దగ్గరే ఏకాంతంగా చేసుకుందామని పెద్దలందరూ చెబుతున్న విషయాన్ని పాటిద్దాం. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’ అని ఆ తల్లిని ప్రార్థిద్దాం.– వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు