ఆవిరైపోతున్న అస్తిత్వాలు

13 Jul, 2020 00:04 IST|Sakshi

కొత్త బంగారం

మాలర్డ్‌. అమెరికా దక్షిణాదిలో మాప్‌లో దొరకని ఒక కాల్పనిక గ్రామం. అక్కడున్న నల్లవాళ్లంతా తెల్లవాళ్లుగా చలామణీ కాగలిగినంత తెల్లగా, తగ్గితే కాస్త చామనఛాయగా ఉంటారు. వీళ్లటు పూర్తిగా నల్లవారూ కాదు, ఇటు తెల్లవాళ్లలో కలిసిపోనూలేరు. స్టెల్లా, డెజిరీ అనే ఇద్దరు అమ్మాయిలూ ఒకే పోలికతో ఉన్న కవలలు. తండ్రి చదువు రానివాడైనప్పటికీ అతను ఒక అమెరికన్‌ యువతికి అసభ్యకరమైన ఉత్తరం రాసాడన్న నెపం మీద అమెరికన్లు కొంతమంది అతన్ని కొడుతూ బయటకు ఈడ్చుకెళ్లి తుపాకీతో కాల్చేస్తారు. తలుపుచాటు నుండి ఈ లించింగ్‌ని చూసిన కవలలకి అప్పటిదాకా తమ అస్తిత్వాల గురించి అర్థంకాని విషయమేదో ఆ క్షణంలో అర్థమయినట్టు అనిపిస్తుంది. 

ఒకరికొకరు అన్నట్టుగా ఉండే ఈ అక్కచెల్లెళ్లు, తండ్రి చనిపోయాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక అమెరికన్‌ ఇంట్లో పనిచేయటం మొదలుపెడతారు. ఉన్న ఊరిలో భవిష్యత్తు లేదనుకున్న కవలలు తల్లికి చెప్పకుండా ఊరొదిలి పారిపోతారు. న్యూ ఆర్లీన్స్‌కి చేరుకున్న కొద్దిరోజుల తరవాత డెజిరీని వదిలేసి వెళ్లిపోతుంది స్టెల్లా. ‘వైట్‌ ప్రివిలేజెస్‌’ కోసం స్టెల్లా అమెరికన్‌ యువతిగా చలామణి అవుతూ ఉన్నత కుటుంబీకుడైన ఒక అమెరికన్‌ని పెళ్లిచేసుకుని తాను కోరుకున్న స్వతంత్రతా, భద్రతా, సమాజంలో గౌరవం సంపాదించుకున్నప్పటికీ ఆమె జీవితం కత్తిమీద సాములా సాగుతుంది. భర్త ప్రేమను పూర్తిగా పొందినా, ఒంటరితనం ఆమెను వేధిస్తూ ఉంటుంది. 

ఇంకొకరిలా మారడమనే ప్రక్రియ అసంపూర్ణమనీ, తనది కాని ప్రపంచంలో తను ఎప్పుడూ ఒంటరేననీ ఆమె ఊహించలేదు. నిరంతరం చేసే నటనలో ఎప్పుడైనా తాను దొరికిపోతుందేమో, భర్త తనని వదిలేస్తాడేమో అన్న అనుమానం, తనగతాన్ని తనే తృణీకరించుకున్నానన్న నిజం ఆమెను వేధిస్తూనే ఉంటాయి. కూతురు కెన్నెడీకి ఆమె విషయమంతా తెలిసిపోవటంతో, అప్పటికే ఇద్దరి మధ్యా ఉన్న దూరం మరింత పెద్దదవుతుంది. జీవితంలో ఏం చేయాలో, తనకేం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటుంది కూతురు కెన్నెడీ. 

ఇటు ఒంటరిగా జీవిస్తున్న డెజిరీ కొంతకాలానికి ఒక నల్ల జాతీయుడిని పెళ్లి చేసుకుంటుంది గానీ, అతను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక కూతురు జూడ్‌ని తీసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది. మాలర్డ్‌లో తనను ప్రేమించిన, తనకీ ఇష్టమైన వ్యక్తితో సహజీవనం ప్రారంభిస్తుంది. కూతురు జూడ్‌ మాత్రం తను ఎదుర్కొంటున్న వివక్షకి అతీతంగా అకుంఠిత ధ్యేయంతో మెడికల్‌ కాలేజ్‌లో చేరుతుంది. ఆడపిల్లగా పుట్టిన ట్రాన్స్‌ సెక్సువల్‌రీస్‌ పట్ల ఆమె ప్రేమా, అతనికి ఆసరానివ్వడం ఆమె స్థిర జీవిత దృక్పథాన్ని తెలియజేస్తాయి. 

నలభై యేళ్ల కథతో బాటు ఆ కథని జాతి వివక్ష, ఎల్జీబీటీక్యూ చరిత్రలతో అనుసంధానించే స్పష్టమైన కాలరేఖ నవలలో ఉంది. వానిషింగ్‌ హాఫ్‌ – అదృశ్యమైపోతున్న సగం అస్తిత్వం – అనేది నవలలోని కీలకాంశం. విడిపోయిన డెజిరీ, స్టెల్లాలు తమలోని చెరి సగాలనీ, గతాన్ని కోల్పోవడం వల్ల స్టెల్లా తనలోని సగాన్నీ, మానసిక దూరాల కారణంగా స్టెల్లా, కెన్నెడీలు తమలో చెరి సగాలనీ కోల్పోయారు. నవలంతా పరుచుకునున్న ఊపిరి సలపని అస్తిత్వాన్వేషణల సమస్యలకి భిన్నంగా జూడ్, రీస్‌ల మధ్య ప్రవహించే ప్రేమమాత్రం కొంత ఊరట కలిగిస్తుంది. నవలలో తప్పొప్పుల నైతిక బేరీజులు లేవు– జీవిత గతులను పరిచయం చేయటం తప్ప, ఆ జీవితాల గురించి మనకి ఆలోచనలు రేకెత్తించడం తప్ప. 

మరో టోనీ మారిసన్, జేమ్స్‌ బాల్డ్విన్‌ అని విశ్లేషకులచేత అభివర్ణించబడుతున్న అమెరికన్‌ రచయిత్రి బ్రిట్‌ బెన్నెట్‌ రాసిన ద వానిషింగ్‌ హాఫ్‌ నవల గత నెల రివర్‌హెడ్‌ ద్వారా విడుదలై అగ్రస్థానంలో ఉంది. హెచ్‌బివో వారు పెద్దమొత్తానికి సినిమా హక్కులు కొనటం రచయిత్రి సాధించిన మరో విజయం.

‘‘దూరమవడానికి వంద కారణాలుండవచ్చు, చేరువవవ్వటానికి కొన్ని చాలు,’’ అని నవలలోని ఒక పాత్ర అంటుంది. ఆ కారణాలని ఆప్యాయంగా భద్రపరచుకోకపోతే, ఉత్తరోత్తరా వివక్ష సృష్టించే ఉత్పాతాలకి మనమే ఉత్తరవాదులం అవుతాం. (నవల: ద వానిషింగ్‌ హాఫ్‌ రచన: బ్రిట్‌ బెన్నెట్‌ ప్రచురణ: రివర్‌ హెడ్, 2020)

- పద్మప్రియ

మరిన్ని వార్తలు