ఉగ్రరూపంలో వీరభద్రస్వామి

26 Aug, 2018 01:25 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన చారిత్రక పట్టణం లేపాక్షి. మధ్యయుగం నాటి శిల్పకళా నిర్మాణంలో ఒక పురాతన శివాలయం ఇక్కడ కొలువు తీరి ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి సుమారు 30 అడుగుల ఎత్తువరకు పాము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు కనువిందు చేస్తుంది. పై కప్పు కూడా లేకుండా ఈ విగ్రహం ఆరుబయట దర్శనమిస్తుంది. ఇక్కడ స్తంభాలు, మండపాలతో పాటు అనేక శివలింగాలతో కూడిన ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయి.

విశాలమైన ఆవరణ మధ్యభాగంలో కొలువుతీరి ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఇక్కడి మూలవిరాట్టు వీరభద్రస్వామి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంటుంది. సాధారణంగా దేవుడు మనకు గుడి బయట నుంచి కనపడతాడు. వీరభద్రస్వామిది ఉగ్రరూపం, ఆయన కోపపు చూపులు సూటిగా గ్రామం మీద పడకూడదు.

అందువల్ల ఈ ఆలయ ముఖద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. ఇది ఈ ఆలయ విశేషం. ఇక్కడి వేలాడే స్తంభం ఈ గుడికి ముఖ్య ఆకర్షణ. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక పల్చటి వస్త్రాన్ని అతి సులువుగా తీయగలుగుతాం. ఇది అప్పటి శిల్పకారుల నైపుణ్యానికి తార్కాణం. ఇక్కడి వీరభద్రస్వామిని మహిమలు గల దేవునిగా కొలుస్తారు.

–డా. వైజయంతి

మరిన్ని వార్తలు