ఆకు లేని పాలకూరలు

8 Feb, 2020 04:01 IST|Sakshi

ఇక్కడ చెప్పినవన్నీ ‘పాల’కూరలే. మామూలుగా మనం పాలకూర అని పిలిచే వెజిటబుల్‌లో ఆకులుంటాయి. ఇక్కడ చెప్పిన కూరల్లో దేనిలోనూ ఆకుల్లేవు. కానీ ఆకుకూరలంత ఆరోగ్యముంది. సంపూర్ణాహారమైన ‘పాలు’ పోసి వండిన కూరలివి. వీటి రుచుల్లో పాలభాగం సగపాలు. మిగతాది ఆ కూరల పాలు. వీటి రుచులెంతో మేలు. తింటే మంచి ఆరోగ్యం మీ ‘పాలు’. 

బీరకాయ పాలు కూర

కావలసినవి: బీరకాయలు – అర కేజీ; పాలు – పావు కప్పు
పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టీ స్పూను; మినప్పప్పు – ముప్పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 4; పసుపు – అర టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత.
తయారీ: ∙చెక్కు తీసేసిన బీర కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి, ఐదు నిమిషాల తరవాత పాలు పోసి మరోమారు కలియబెట్టి, పది నిమిషాల సేపు మూత ఉంచాలి ∙మెత్తగా ఉడికి, పాలన్నీ ఇగిరిపోయిన తరవాత దింపేయాలి ∙ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది.

మునగకాడ పాలు కూర

కావలసినవి: మునగ కాడలు – 3 (పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; నానబెట్టిన బియ్యం – పావు కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూను; పాలు – 400 మి.లీ.
పోపు కోసం: నూనె – 5 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: ∙మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన బియ్యం వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి నాలుగైదు నిమిషాలు కలియబెట్టాలి ∙మునగ కాడ ముక్కలు, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, పావు గంట సేపు ఉడికించాలి ∙మెత్తగా చేసిన పచ్చి కొబ్బరి తురుము మిశ్రమం, పాలు జత చేసి బాగా కలియబెట్టి, మరో పావు గంట ఉడికించి దింపేయాలి ∙అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

సొరకాయ పాలు కూర

కావలసినవి: సొరకాయ ముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6 (సన్నగా పొడవుగా తరగాలి); పాలు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను.
తయారీ: ∙సొరకాయ ముక్కలకు తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి కొద్దిసేపు మూత ఉంచాలి ∙ఉడికించిన సొరకాయ ముక్కలు జతచేసి మరోమారు కలియబెట్టాలి ∙బాగా ఉడికిన తరవాత పాలు పోసి, మూత ఉంచి, కూర దగ్గర పడేవరకు ఉడికించి దింపేయాలి (ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం కాని పం^è దార కాని వేసుకోవచ్చు) ∙అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. 

వంకాయ పాలు కూర

కావలసినవి: వంకాయలు – 8 (గుత్తి కాయలు); ఉల్లి తరుగు – పావు కప్పు; ధనియాలు – ఒక టేబుల్‌ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; గసగసాలు – ఒక టేబుల్‌ స్పూను; లవంగాలు – 2; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి పొడి – 3 టేబుల్‌ స్పూన్లు; మిరప కారం – అర టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; పాలు – ఒక కప్పు; ఆవాలు + జీలకర్ర – ఒక టేబుల్‌ స్పూను; పసుపు– పావు టీ స్పూను; నూనె – తగినంత
తయారీ: ∙వంకాయలను గుత్తులుగా కట్‌ చేసి, ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి ∙మిక్సీలో గసగసాలు, ధనియాలు, ఉల్లి తరుగు, అల్లం తురుము, టొమాటో తరుగు, ఎండు కొబ్బరి పొడి, మిరప కారం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేసి, ఈ మిశ్రమాన్ని వంకాయలలోకి స్టఫ్‌ చేయాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్‌ స్పూన్ల నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙స్టఫ్‌ చేసిన వంకాయలను జత చేసి బాగా కలిపి, మూత ఉంచాలి ∙పది నిమిషాల తరవాత పాలు జత చేసి కూరను బాగా కలియబెట్టి, మరోమారు మూత ఉంచి, బాగా ఉడికించి దింపేయాలి ∙వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

పొట్లకాయ పాలు కూర

కావలసినవి: పొట్ల కాయ – అర కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; జీడిపప్పులు – 10; నూనె – ఒక టేబుల్‌ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – ఒక కట్ట (చిన్నది); పాలు – పావు లీటరు (ఒక గ్లాసు).
తయారీ: ∙పొట్ల కాయను శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, ఉప్పు నీళ్లలో శుభ్రంగా కడిగి, నీరంతా పిండేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, జీడి పప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙టొమాటో తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙పొట్లకాయ చక్రాలను జత చేసి బాగా కలియబెట్టి, పది నిమిషాల పాటు ఉడికిన తరవాత, పాలు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙బాగా ఉడికిన తరవాత మూత తీసేసి, కరివేపాకు, కొత్తిమీర జత చేసి బాగా కలిపి, ఉడికించి దింపేయాలి ∙ ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా