వ్యర్థాలతో పోషక జలం!

19 May, 2020 06:42 IST|Sakshi

కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సౌలభ్యం ఏమిటంటే.. ఏరోజుకారోజే పోషక జలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో రెండు పద్ధతులున్నాయి.

మొదటిది.. వంట కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని సాధారణంగా సింక్‌లో పారబోస్తుంటాం. కానీ, అలా పారబోయకుండా.. వంటింట్లోనే ఒక మూలన ప్రత్యేకంగా ఇందుకోసం ఒక బక్కెట్‌ను ఉంచండి. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఉదయం నుంచి దాంట్లో పోస్తూ ఉండండి.  కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తరిగినప్పుడు వచ్చిన తొక్కలు, ముక్కలను ఆ నీటిలో వేయండి. బక్కెట్‌పై ఈగలు మూగకుండా మూత పెట్టండి.

సాయంత్రం (నియమం ఏమిటంటే.. బియ్యం, పప్పులు కడిగిన నీటిలో వేసిన వ్యర్థాలు 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు) వంట పూర్తయిన తర్వాత.. ఆ బక్కెట్‌లో నీటిలో నుంచి తొక్కలు, ముక్కలను బయటకు తీసి లేదా వడకట్టి.. ఆ పోషక జలాన్ని మొక్కల కుండీల్లో పోసుకోండి. ఇలా పోస్తూ ఉంటే.. మొక్కలు అంతకుముందు కన్నా కళగా, ఏపుగా పెరుగుతుండటం గమనించవచ్చు. మిగిలిన వ్యర్థాలను మీరు ఇప్పటికే కంపోస్టు తయారు చేస్తూ ఉన్నట్లయితే కంపోస్టు పిట్‌ లేదా పాత్రల్లో వేయండి.

ఒకవేళ.. ఇంకా కంపోస్టు తయారు చేయడం ప్రారంభించకపోతే.. ఆ వ్యర్థాలను కూడా బయట పారేయనక్కర లేదు. అందుకు ఇంకో ఉపాయం ఉంది.

కూరగాయలు, పండ్ల తొక్కలను.. నీటి లో నుంచి బయటకు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మిక్సీలో వేయండి. దాన్ని పోషక జలంతో కలిపి కుండీలు, మడుల్లో మీరు పెంచుకుంటున్న ఇంటిపంటలకు పోసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పోషక జలం మరీ చిక్కగా లేకుండా మట్టిలో ఇంకిపోయేలా ఉండేలా చూసుకోవాలి. పెరట్లో పెరిగే చెట్లకు కూడా పోసుకోవచ్చు. వారానికి రెండు సార్లు పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు