ఆస్పత్రిలో అమృతాహారం!

30 Jan, 2018 05:15 IST|Sakshi

శ్రీకాకుళం ‘రిమ్స్‌’ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరల సాగు

రోగుల బంధువులకు ఆ కూరలతోనే అన్నదానం

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)కి పేరు. దీన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఇది 500 పడకల ఆసుపత్రి. ఇక్కడి రోగులకు ఆసుపత్రి సేవల్లో భాగంగా భోజనం అందుతుంది. వారికి సహాయకులుగా వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం బయట క్యాంటీన్లకు వెళ్లాల్సి వచ్చేది. వారికి కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే భోజనం అందిస్తే బాగుంటుందనే ఆలోచనతో సత్యసాయి సేవాదళ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మూడేళ్ల క్రితం ఉచిత నిత్యాన్నదానం ప్రారంభించారు. మధ్యాహ్నం 300–350 మంది వరకూ, రాత్రి పూట 300 మంది వరకూ రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలనే ఉపయోగిస్తుండటం విశేషం.

రిమ్స్‌ ప్రాంగణంలో నిత్యాన్నదానం క్యాంటీన్‌లో అన్నంతో పాటు సాంబారు, ఒక కూర, పచ్చడితో అరటిపండు, బొప్పాయి పండ్ల ముక్కలు కూడా అందిస్తున్నారు. తొలుత ఈ క్యాంటీన్‌కు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు మొత్తం బయట మార్కెట్‌లోనే కొనుగోలు చేసేవారు. అలాగాకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేసిన ఆకుకూరలు, కూరగాయలైతే రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలైనవనే ఉద్దేశంతో శ్రీకాకుళానికి చెందిన సామాజిక సేవకురాలు పేర్ల అనురాధ చొరవ చూపి కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పుడు క్యాంటీన్‌లో రోజువారీ అవసరాలకు ఈ ప్రకృతి సాగు తోట నుంచే వెళ్తున్నాయి.

‘‘నిత్యాన్నదానం కోసం కేటాయించిన భవనం వెనుక దాదాపు వెయ్యి గజాల ఖాళీ స్థలం వృథాగా ఉండేది. దీనిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా ప్రకృతి సేద్య విధానంలో పండించిన కూరగాయలు, ఆకుకూరల రుచి చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద కొన్నిరకాల కూరగాయల మొక్కలు పెంచేవాళ్లం. ఆ ఆసక్తితోనే రిమ్స్‌లో ఆ ఖాళీ స్థలం ప్రకృతి సాగు కోసం ఇవ్వాలని జిల్లా కలెక్టరును కోరాం. రెండేళ్ల క్రితం అనుమతి రాగానే బయటి నుంచి సారవంతమైన మట్టి తెప్పించి వేయించాం. పశువుల గెత్తం కూడా వేశాం.

తొలుత టమాటా, మునగ, వంకాయలు, పచ్చిమిర్చి సాగు ప్రారంభించాం. తర్వాత ముల్లంగి, దొండ, గోంగూర, కొత్తిమీర.. వేశాం. వాటిలో అత్యధికంగా గోంగూర, కొత్తిమీర రోజువారీ వంటకు సరిపోతోంది. సాంబారులో వాడకానికి కంది కూడా పండిస్తున్నాం. కరివేపాకు, కొత్తిమీర, గోంగూర పూర్తిగా ఇక్కడిదే వంటకు వినియోగిస్తున్నాం. వీటికి రసాయనిక ఎరువులు వేయలేదు. కేవలం వర్మికంపోస్టు ఎరువు తీసుకొచ్చి వేస్తున్నాం. చీడపీడల సమస్య కూడా కనిపించలేదు. ఎప్పుడైనా కనిపిస్తే దశపత్ర కషాయం, వేపనూనె పిచికారీ చేయిస్తున్నాం. పంటల మధ్యలో బంతి మొక్కలు పెంచడం ద్వారా చీడపీడలను నియంత్రిస్తున్నాం.

పచ్చిమిర్చి రోజూ రెండు మూడు కిలోల వరకూ వస్తాయి. వచ్చే వేసవిలో అందుబాటులోకి వచ్చేలా ఇప్పుడు కొన్ని రకాల కూరగాయల మొక్కలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సాయి భక్తులు కాళీప్రసాద్, అన్నపూర్ణ గార్ల సహకారంతో అరటితో పాటు మామిడి, సపోట, ఉసిరి, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నాం. సాక్షి ‘సాగుబడి’లో వచ్చే కథనాలు, సూచనలు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. ఈ స్ఫూర్తితో శ్రీకాకుళంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద పూలమొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పెంచుతున్నాం. ప్రతిరోజూ పూజలకు వాటి పూలు సరిపోతున్నాయి’’ అని అనురాధ చెబుతున్నారు.


– అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: కుప్పిలి జయశంకర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు