ప్రియతమా నీవచట కుశలమా...

9 Oct, 2017 13:27 IST|Sakshi

గుణ చిత్రంలోని ఈ పాటకు నాకు మంచి పేరు వచ్చింది. తమిళం నుంచి తెలుగులోకి బాలుగారు హక్కులు తీసుకున్నారు. అప్పటికే డబ్బింగ్‌ చిత్రాలకు రాజశ్రీగారు రాసి ఉన్నారు. ఈ చిత్రానికి రాజశ్రీతో మాటలు, నాతో పాటలు రాయించాలని నిశ్చయించారు బాలు. అనువాదం రాసేటప్పుడు వారి పెదవుల కదలికకు అనుగుణంగా భావం చెడకుండా పాట రాయాలి. ఒరిజినల్‌ పాటకు తెలుగు అనువాదం గురించి రాజశ్రీగారిని అడిగాను, ఆయన కొన్ని పదాలు అందిస్తూ పాట రాయమన్నారు. నేను కేవలం అనువాదం మాత్రమే తెలుసుకుని, నా ఆలోచనలకు అనుగుణంగా గంటలో పాట పూర్తి చేసి రాజశ్రీగారికి చూపించాను. రాజశ్రీగారు ఆప్యాయంగా ముద్దుపెట్టుకుని నన్ను అభినందించారు.

ఈ సినిమాలో కథానాయకుడు ప్రేమ పిచ్చివాడు,  కథానాయిక పార్వతీదేవిలా కనిపిస్తుంది. ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తాడు. ఆ అమ్మాయికి ఉత్తరం రాయాలనుకుంటాడు. తనకు  చదువు రాదు కనుక, తాను చెబుతుంటే ఆ అమ్మాయినే ఉత్తరం రాసి ఆ తరవాత చదువుకోమంటాడు. తన హృదయంతో ప్రేమలేఖ రాస్తాడు. ‘కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే’ అంటూ ప్రారంభించాను. ఏ ఉత్తరంలో ముందుగా రాసేది ఉభయకుశలోపరి. ‘ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే’ అని పలకరించాక, ఆ మాటల్లో కవిత్వం ఉంటే అందరూ ఆహా ఓహో అంటారు. అందుకే మూడునాలుగు వాక్యాలలో ‘ఊహలన్నీ  పాటలే కలల తోటలో.. తొలి కలల కవితలే మాట మాటలో’ అంటూ కొద్దిగా కవిత్వం రాశాను.

మరిన్ని వార్తలు