వెన్నెల్లో గోదారి అందం...

26 Nov, 2017 00:24 IST|Sakshi

నేను దర్శకత్వం వహించిన ‘సితార’ చిత్రంలో  గౌరీమనోహరి రాగంలో ఇళయరాజా స్వరపరిచిన ‘వెన్నెల్లో గోదారి అందం’ పాట నాకు చాలా ఇష్టం. నేను భారతీరాజా దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నప్పుడే ఆయన ఈ ట్యూన్‌ను ఇళయరాజాతో చేయించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ట్యూన్‌ వాడుకోలేదు.  నాకు ఎంతగానో నచ్చిన ఈ ట్యూన్‌లాంటి ట్యూన్‌ ఇళయరాజాతో చేయించుకోవాలనుకున్నాను. నా అదృష్టం కొద్దీ ఆ ట్యూన్‌నే ‘సితార’ చిత్రంలో వాడుకున్నాను. రెండవ చరణంలో చివరి వాక్యాలకు మాత్రం సన్నివేశానికి అనుగుణంగా కొద్దిగా మార్పులు చేయించుకున్నాను.
సితార చిత్రంలో కథానాయిక... రాజకుమార్తె నుంచి సినిమా తారగా ఎదిగి, తనపై వచ్చిన దుష్ప్రచారం భరించలేక, ఆత్మహత్యకు పూనుకునే సన్నివేశానికి అనువుగా ఈ పాట రాశారు వేటూరి. ఈ పాట పాడిన ఎస్‌. జానకి గారికి జాతీయ అవార్డు వచ్చింది. 

ఎత్తుగడలోనే ‘వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం’ అంటూ సగం కథను వివరించేశారు వేటూరి. ‘నది కన్నుల్లో కన్నీటి దీపం’ పద ప్రయోగంలో ఎంతో తత్త్వం దాగి ఉంది. ‘తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై’ వాక్యంలో పదాలు తలచుకున్నకొద్దీ గుండెను పిండేస్తాయి.  ఇందులో వేటూరి ప్రయోగించిన కొన్ని కొన్ని పదాలను అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కొంత ఆబ్‌స్ట్రాక్ట్‌ గా రాశారు వేటూరి. ‘వెన్నెలంత ఏటిపాలు చేసుకొంటినే’ అంటూ కథానాయిక తన జీవితం గురించి బాధపడుతుంది. సాధారణంగా ‘అడవిగాచిన వెన్నెల’ అని వాడటం తెలిసిందే. కాని ఇక్కడ వేటూరి కొత్త ప్రయోగం చేశారు. ‘నాకు లేదు మమకారం మనసు మీద అధికారం’  వాక్యంలోని పదాలు కథానాయిక అంతరంగాన్ని స్పష్టం చేస్తాయి. ‘స్వర పంజరం’ ‘తెరల చాటు నా చూపు’ ‘మనసు వయసు కరిగి’ ‘కలతలు రేపిన వలపుల ఒడి’ పదాలు చదువుతుంటేనే గుండె తడి అవుతుంది. 

మనసులోని మాటలు గొంతులోనే ఆగిపోతాయి. ఈ పాటలోని పదాలు స్వయంగా సంగీతాన్ని, భావాన్ని చూపుతాయేమో అనిపిస్తుంది. సినీ కవులలో అత్యంత వేగంగా పాటలు రచించే కవి వేటూరి, అత్యంత నెమ్మదిగా రచించే కవి ఆత్రేయ. నేను కె. విశ్వనాథ్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే వేటూరి గారు పాట చెబుతుంటే నేను రాసేవాడిని. అలా ఆయనతో నాకు చాలా చిన్నతనంలోనే సాన్నిహిత్యం ఏర్పడింది. ‘శంకరాభరణం’ పాటలు కూడా ఆయన చెబుతుంటే నేను రాశాను. సితార సినిమాకి పాటలు రాసే సమయంలో వేటూరి చాలా బిజీగా ఉన్నారు. నా దగ్గర పనిచేస్తున్న ఒక పంజాబీ యువకుడికి ‘సితార’ చిత్ర కథ వివరించి, వేటూరిగారి వెనకే వెళుతూ, కథ వినిపించి, ఆయన ఎప్పుడు పాట చెబితే అప్పుడు రాసుకోమని చెప్పాను. వేటూరిగారు  తోచినప్పుడల్లా ఒక్కో లైను చెప్పారు. అలా పాట పూర్తయింది. ఇది 34 శరత్తుల నాటి సంఘటన.
– సంభాషణ: డా. వైజయంతి

మరిన్ని వార్తలు