సముద్రం మౌనం దాల్చింది

13 Dec, 2019 01:26 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు

నివాళి

ఒక కెరటం తీరానికి నుదురు తాకించి మరి అలాగే ఉండిపోయింది. ఒక వాక్ప్రవాహం తన ధారను నెమ్మదింపజేసి విరామం ప్రకటించింది. ఒక చేయి రాసి రాసి కాగితాల బొత్తిని ఆఖరుసారి అటక మీద విసిరేసింది. ఒక ముఖం తాను పూసుకునే రంగును అక్కర్లేనట్టుగా నేలన ఒంపేసింది. ఒక  పదేపదే వచ్చే ప్రస్తావన ఇక రాలేనన్నట్టుగా పక్కకు తప్పుకుంది. ఒక అనంత జ్ఞాపకాల రాశి మన్నింపు కోరుతూ తనను తాను శూన్యపరుచుకుంది. ఒక సముద్రం తన ఘోషను చాలించింది. ఒక కడలి మౌనం దాల్చింది. గొల్లపూడి మారుతీరావుకు ‘సాయంకాలమైపోయింది’.

‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో నెల ఖర్చుల దగ్గర తండ్రికీ కొడుక్కూ మాటామాటా పెరుగుతుంది. ఎదురుగా ఉన్నది ముసలితండ్రి. ఎదిరిస్తున్నది యవ్వనంలో ఉన్న కొడుకు. ‘నిన్ను నేను సాకాల్సిన పని లేదు’ అంటాడు కొడుకు. ‘నిన్ను కనీ పెంచి పెద్ద చేసిన ఈ తండ్రితోనే మాట్లాడుతున్నావా నువ్వు’ అంటాడు తండ్రి. ‘అవును’ అంటాడు కొడుకు. ‘నీ చదువుల కోసం ఓవర్‌టైమ్‌ పని చేసి ఫీజులు కట్టిన తండ్రితోనే మాట్లాడతున్నావా నువ్వు?’ అంటాడు తండ్రి. ‘అవును’ అంటాడు కొడుకు. ‘నీకు యాక్సిడెంట్‌ అయితే భుజాల మీద మోసుకొని వెళ్లి రక్తమిచ్చి కాపాడుకున్న తండ్రితోనే మాట్లాడుతున్నావా నువ్వు?’ అంటాడు తండ్రి. ‘అవును’ అంటాడు కొడుకు. ఇంకో తండ్రయితే ఆ క్షణంలో కుప్పకూలుతాడు. కాని ఆ తండ్రి మాత్రం, అక్కడ ఉన్న తండ్రి మాత్రం, నెరిసింది తల వెంట్రుకలే తప్ప రోషం కాదు అనుకుని తాపీగా, తీర్పుగా, పెద్దగా ‘అయితే నా ఇంట్లో నుంచి బయటకుపోరా కుక్కా’ అంటాడు.

‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో..

ఆ క్షణంలో ఆ తండ్రి చాలామందికి గుర్తుండి పోయాడు. ఆ తండ్రిగా నిలబడ్డ గొల్లపూడి మారుతీ రావు కూడా. ఎడమ చేయి ఆడిస్తూ డైలాగ్‌ చెప్పి పాపులర్‌ అయిన తారలు ఇద్దరున్నారు తెలుగులో. ఒకరు సూర్యకాంతం. మరొకరు గొల్లపూడి మారుతీరావు. ఇద్దరూ నాటకాల నుంచి వచ్చినవాళ్లే. ‘కాని నాకు సినిమా నటన నేర్పింది మాత్రం చిరంజీవి. ఆయనే  కెమెరా ముందు ఎలా నిల బడాలి, ఎలా విరమించుకోవాలి నేర్పించాడు’ అని వినమ్రంగా చెప్పుకున్నారు గొల్లపూడి. మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’ (1982) విడుదలయ్యి హిట్‌ అయ్యేంతవరకూ ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో, నాటకాల్లో, సాహితీ వ్యాసంగంలో రాణించారు గొల్లపూడి. అప్పటి వరకూ ఆయన ఏనాడూ విశ్రాంతిగా లేరు. ఆ తర్వాత కూడా లేరు. విశాఖలో బాల్యం గడపడం, విశాఖ సముద్రాన్ని చూస్తూ ఎదగడం, ఆ గాలి, ఆనాటి సాంస్కృతిక ఔన్నత్య స్పర్శ తాకుతూ ఉండటం ఆయనను ఆది నుంచి అవిశ్రాంతంగానే ఉంచింది.

బి.ఎస్సీ ఆనర్స్‌లో చేరారుగాని ఏనాడూ చదువు మీద శ్రద్ధ లేదు. తెల్లవారి లేస్తే ఊరి వీధుల్లో కనిపించే పురిపండా అప్పలస్వామి, చాగంటి సోమయాజులు, రావిశాస్త్రి, అప్పుడప్పుడు శ్రీపాద వంటి గొప్పవారు ఆయనను ఊరికే ఉంచలేదు. పుస్తకాల వెంట పడేలా చేసి పదిహేనేళ్లకే కళ్లకు అద్దాలు తెచ్చుకునేలా చేశారు. చేతికి కలం ఇచ్చి రాసేందుకు పరుగులెత్తించారు. గొల్లపూడి రాయడమే కాదు ఆ రోజులలోనే పెద్ద పెద్ద ఇంగ్లిష్‌ నవలలని అనువాదం చేయడం మొదలెట్టారు. ఉంటున్నది విశాఖ. పక్కనే విజయనగరం. ‘కన్యాశుల్కం’ రాసిన గురజాడవారి ఊరు. చీటికిమాటికి నాటకోత్సవాలు జరిగి తారసపడే జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, కె.వెంకటేశ్వరరావు వంటి నటులు. ఆయన నాటక రచయిత అయ్యాడు. ఆంధ్ర యూనివర్సిటీలో నాటకం పేరు చెబితే గురొచ్చే విద్యార్థి రచయితగా ఎదిగాడు. నిజంగానే మనం ఎలా ఉన్నామనేది మనం ఎవరితో ఉన్నాం అన్నదాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది.

‘మంగమ్మగారి మనవడు’లో..

ఢిల్లీలో ఉద్యోగవేటకు వెళ్లినప్పుడు ఆయన దోస్తీ చేసింది పురాణం సుబ్రహ్మణ్యశర్మతో. చిత్తూరులో ఆంధ్రప్రభ రిపోర్టర్‌గా చేరినప్పుడు కలిసి తిరిగింది కె.సభావంటి రచయితలతో. శంకరంబాడి సుందరాచార్యవంటి గేయకర్తలతో. జి.కృష్ణ వంటి ఉద్దండ జర్నలిస్టుల జ్ఞానానికి ఆయన దోసిట పట్టాడు. ఇక రేడియోలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, మునిమాణిక్యం నరసింహరావు, బుచ్చిబాబు, ఉషశ్రీ... కూచుంటే ఒక భావ వీచిక. మాట్లాడితే ఒక సృజనకేళిక. అదంతా ఆయన చేత  ‘కళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’ వంటి శక్తిమంతమైన నాటికలు రాసేలా చేసింది. నవలలు, కథలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. అవే ఆయనను సినిమాలలో ప్రవేశపెట్టాయి. సాహిత్యం నుంచి, రేడియో నుంచి వెళ్లిన అందరూ సినిమాల్లో సక్సెస్‌ కాలేదు. కాని గొల్లపూడి అయ్యారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు కోడూరి కౌసల్యాదేవి ‘చక్రభ్రమణం’ నవలను ‘డాక్టర్‌ చక్రవర్తి’ పేరుతో సినిమాగా మలచాలంటే ఆ కష్టతరమైన ప్లాట్‌కు ట్రీట్‌మెంట్‌ రాయగలిగే చేయి గొల్లపూడిదిగా తప్ప మరొకటిగా కనిపించలేదు.

ఆ సినిమాకు దర్శకత్వశాఖలో పని చేసిన కె.విశ్వనాథ్‌ గొల్లపూడిని గమనించి ‘ఆత్మగౌరవం’తో మొదలు ‘చెల్లెలి కాపురం’, ‘శుభలేఖ’, ‘ఓ సీతకథ’, ‘శుభసంకల్పం’ సినిమాల వరకూ పనిచేశారు. వారిద్దరూ ఆప్తమిత్రులు. కాని గొల్లపూడి సినిమా కెరీర్‌లో మరో ముఖ్యవాటాదారు ఎన్‌.టి.ఆర్‌ అని చెప్పాలి. ఎన్‌.టి.ఆర్‌ తాను నటించిన రీమేక్‌ చిత్రాలు ‘నిప్పులాంటి మనిషి’ (జంజీర్‌), ‘అన్నదమ్ముల అనుబంధం’ (యాందోకి బారాత్‌), ‘నేరం నాది కాదు, ఆకలిది’ (రోటీ), ‘లాయర్‌ విశ్వనాథ్‌’ (విశ్వనాథ్‌) అన్నింటికీ సంభాషణ రచయితగా గొల్లపూడినే ఎంచుకున్నారు. గొల్లపూడి రచన చేసిన సినిమాలలో ‘ఆరాధన’, ‘అమెరికా అమ్మాయి’, ‘పాపం పసివాడు’, ‘మరుపురాని తల్లి’ చెప్పుకోవాల్సినవి. కోడి రామకృష్ణకు ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’, ‘తరంగిణి’, ‘ముక్కుపుడక’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన రచయిత గొల్లపూడి.

‘బ్రహ్మోత్సవం’లో..

గొల్లపూడిని నటుణ్ణి చేసి కోడి రామకృష్ణ, కోడి రామకృష్ణకు రాసి గొల్లపూడి పరస్పరం లాభపడ్డారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘పుణ్యస్త్రీ’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’ ఇవన్నీ గొల్లపూడి మెరిసిన చిత్రాలు. భార్య చాటు భర్తగా ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ప్రేమ’ సినిమాల్లో, కుతంత్రుడిగా ‘స్వాతిముత్యం’లో,  సింగిల్‌పూరి సుబ్బారావుగా ‘సుందరకాండ’లో, అమాయక పంతులుగారిగా ‘మంగమ్మగారి మనవడు’లో ఆయన నవ్విస్తారు. ‘లీడర్‌’, ‘కంచె’, ‘బ్రహ్మోత్సవం’, ‘మనమంతా’ ఆయన చివరగా కనిపించిన సినిమాలు. సినిమా నటుడిగా ఎంత కృషి చేశారో రచయితగా, టీవీ వ్యాఖ్యాతగా, కాలమిస్ట్‌గా గొల్లపూడి అంతే కృషి చేశారు. చేసిన పనంతా ఒకచోట కూర్చి చూస్తే ఇంత పని సాధ్యమా అనిపిస్తుంది. కథలు, నవలలు, నాటికలు, కాలమ్స్, యాత్రాకథనాలు... అసంఖ్యాకంగా రాస్తూనే ఉన్నారు. తన జీవితానుభవాలను, అభిప్రాయాలను ఎప్పటికప్పుడు చెప్పే ‘జీవనకాలమ్‌’ పాఠకులకు ఒక అనుభవాత్మకపాఠం.

‘అమ్మకడుపు చల్లగా’ ఆయన ఆత్మకథ. డెబ్బయ్యేళ్లు పైబడిన వయసులో ఎవరైనా పడక్కుర్చీకి పరిమితమవుతారు. కాని ఆయన ఆ వయసులో తెలుగు కథను గౌరవించాలని బయలుదేరి ఎంతో ప్రయాసతో నూరుమంది రచయితలను ఇంటర్వ్యూ చేసి వారి కథలను పరిచయం చేస్తూ టీవీ ప్రోగ్రామ్‌ చేసి అంతటితో ఆగక ‘వందేళ్ల కథకు వందనాలు’ పేరుతో విలువైన గ్రంథం ప్రచురించడం కచ్చితంగా శ్లాఘించదగిన పని. చెట్టంత కొడుకు, గొల్లపూడి శ్రీనివాస్, ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ శోకం నుంచి తట్టుకొని నిలబడటానికి చివరి శ్వాస వరకూ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. శ్రీనివాస్‌ పేరు మీద ఆయన ఏర్పాటు చేసిన అవార్డు దేశంలో గౌరవప్రదమైన అవార్డు అని దానిని అందుకున్న ఆమిర్‌ఖాన్‌ వంటి వారిని చూస్తే అర్థమవుతుంది.

‘లీడర్‌’లో..

చేసింది చాలు అని ఏనాడూ అనుకోకుండా చేయాల్సింది ఎంతో ఉంది అని గొల్లపూడి నుంచి నేర్చుకోవాలి. కొందరు తమకు తెలిసిన దానిని తమతోనే ఉంచుకుంటారు. ఇవ్వడం, పంచడం ఉదార విషయాలు. ఆ ఇవ్వడం, పంచడం తెలిసిన ఉదారత గొల్లపూడిలో ఉంది. కొన్ని ఆయన అభిప్రాయలతో, తత్త్వంతో కొందరికి భేదం ఉండొచ్చు. కాని మాట్లాడే పెద్దమనిషి ఒకడు మనతో ఉన్నాడు అనే భావన అవసరం. గొల్లపూడి మారుతీరావు అనే నూరు కెరటాల సముద్రపు హోరు ఇక మీదట వినిపించకపోవచ్చు. ‘గిరీశం’ వంటి పాత్రలను పదేపదే ప్రతిష్ఠాపన చేయడానికి ఆయన కనపడకపోవచ్చు. వేదిక మీద ఒక మంచి ఉపన్యాసం ఇవ్వడానికి మైకందుకుంటూ గోచరం కాకపోవచ్చు. వారం వారం అలవాటైన ఒక పలకరింపుకు ఎప్పటికీ గుడ్‌బై చెప్పేయవచ్చు. కాని ఆయన వదిలివెళ్లిన గుర్తులు ఇప్పటికిప్పుడు చెరిగిపోవు. చెదిరిపోవు. మిగిలిన మౌనంలోని సంభాషణ కూడా.
- ఖదీర్‌

మరిన్ని వార్తలు