వెజ్‌ డిన్నర్‌... స్కూల్లో విన్నర్‌!

10 May, 2017 23:44 IST|Sakshi
వెజ్‌ డిన్నర్‌... స్కూల్లో విన్నర్‌!

పరిపరిశోధన

మీ పిల్లలకు రాత్రి భోజనంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పుష్కలంగా తినిపిస్తున్నారా?  అలా తినిపిస్తే మర్నాడు ఆ పిల్లలు స్కూల్లో అత్యంత చురుగ్గా ఉంటారట. మీ పిల్లలు డిన్నర్‌లో మాంసాహారం ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు, చక్కెరపాళ్లు ఉండే  శీతల పానీయాలు తీసుకున్నారా? మర్నాడు స్కూల్లో మందకొడిగా ఉంటారట. అందుకే పిల్లలకు రాత్రి భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా పెట్టేలా చూడాలంటూ తల్లిదండ్రులకు ఆస్ట్రేలియన్‌ పరిశోధకులు హితవు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని న్యూ క్యాజిల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 8 నుంచి 15 ఏళ్ల వయసు గల కొంతమంది పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వారిలోని కొందరికి రాత్రి భోజనంలో తప్పనిసరిగా ఆకుకూరలు, పండ్లు వంటి శాకాహారం ఇచ్చారు. ఆ మర్నాడు నిర్వహించిన లాంగ్వేజ్‌ పరీక్షలు, లెక్కల పరీక్షల్లో పిల్లల సామర్థ్యాన్ని పరిశీలించారు. రాత్రి భోజనంలో ఆకుకూరలను ఆహారంగా తీసుకునే పిల్లలు... ఆ మర్నాడు చాలా చురుగ్గా ఉంటారని తేలింది.

గతంలో ఈ తరహా అధ్యయనాన్ని బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో నిర్వహించారట. అయితే క్రితం రాత్రి తీసుకున్న భోజనం... ఆ మర్నాటి చురుకుదనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయంపై ఇదే సరికొత్త అధ్యయనం. ఆకుకూరలు, పండ్లలోని పాలీఫీనాల్స్, యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల ఈ ప్రభావం కనిపిస్తుందని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు