అనుమానాలే శిక్షకు ప్రాతిపదికలా?

2 Apr, 2019 00:21 IST|Sakshi

అభిప్రాయం

గుజరాత్‌ అల్లర్ల సమయంలో వందమందిని చంపేసిన సంఘటనలో బాబు బజ్రంగి ముఖ్యుడు. ఈ కేసులో 2012లో తనకు జీవితఖైదు విధించారు. 2019 మార్చిలో అతడికి సుప్రీం కోర్టు వైద్యకారణాలతో బెయిల్‌ మంజూరు చేసింది. కానీ ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం)  చట్టం కింద శిక్ష అనుభవిస్తున్న, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రొ‘‘ సాయిబాబాకు నాగ్‌పూర్‌ హైకోర్టు మార్చి 25న బెయిల్‌ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉపా చట్టంలోని లొసుగులను సీరియస్‌గా డిబేట్‌ చేయాల్సిన అవసరముంది. ఉపా చట్టంలోని సెక్షన్‌ 19, 20 ప్రకారం ఏదైనా టెర్రరిస్ట్‌ సంస్థలో సభ్యుడైనా, లేదా అలాంటి వాళ్ళకు ఆశ్రయమిచ్చినా, తోడ్పడినా శిక్షార్హుడు అవుతాడు. 2017లో 90 శాతం అంగవికలుడైన ప్రొ. సాయిబాబాను ఈ చట్టం కింద శిక్షార్హుడిగా ప్రకటించారు. సాయిబాబా ‘రెవల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌’ అనే ఒక సంస్థకు జాయింట్‌ సెక్రటరీ. ఆ సంస్థ ఢిల్లీలో ఎన్నో బహిరంగ సమావేశాలు కూడా నిర్వహించింది. ఆ సంస్థ చట్టబద్ధమైనా (రెండు రాష్ట్రాల్లో తప్ప) సరే, అది ప్రచారం చేసే ‘థియరీ’తో భాగం కావడం వలన సాయిబాబను దోషిగా ఆరోపించారు.

1919లో రౌలత్‌ చట్టం వచ్చింది. దాని ప్రకారం విప్లవచర్యలు చేపడుతున్నాడన్న అనుమానం మీదే ఎవరినైనా, ఎన్నిరోజులైనా అరెస్ట్‌ చేసే అధికారం బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు మనిషి చుట్టూ నక్సలైటు వాసన వస్తోం దని నిర్దయగా సాయిబాబాకు జైలుశిక్ష వేశారు. మరి రౌలత్‌ చట్టానికి, ఉపా చట్టానికి తేడా ఏమిటి? కోర్టులు పోలీసుస్టేషన్లుగా పనిచేయాలనుకుంటే, అందుకోసం విచారణలు, లాయర్లు దేనికి? సాయిబాబాతోపాటు ఇంకా ఐదుగురు శిక్షకు గురయ్యారు. అందులో ముగ్గురు ఆదివాసీ రైతులు, ఒక స్టూడెంట్, ఒక జర్నలిస్టు ఉన్నారు. ఆ తీర్పుచూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. మచ్చుకు ఒకపేరా చూద్దాం. ‘90వ పేజీలో ఎగ్జిబిట్‌ 267 నుంచి తెలిసేదేమంటే చేతిలో దినపత్రిక లేదా అరటిపండు పట్టుకోవడం సూచి కగా మావోయిస్టులు వాడతారు. అది స్పష్టమే కాబట్టి ప్రాసిక్యూషన్‌ వాదించిందే (అంటే చేతిలో న్యూస్‌ పేపర్‌ పట్టుకున్న ఒక ముద్దాయి మావోయిస్టు అని) ఎక్కువ సంభావ్యత ఉన్నట్టుగా తోస్తుంది‘ (ఆ తోచడం కూడా కచ్చితంగా కాదు !)

ఇలా కేవలం నమ్మకాలు, విశ్వాసాలమీద కూడా అందరికీ శిక్ష ఖాయం చేస్తున్నారు. సాయిబాబా కేసులో Doctrine of pleasure ఫాలో అవుతూ తీర్పు ఇచ్చినట్లు కనబడుతోంది. ఉరిశిక్షలాంటి విషయాల్లో మనం దీన్ని చూస్తాం. ఇందులో హేతువు ఎంత స్థాయిలో ఉండాలి అన్నది నిర్ణయం తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. మనిషి ప్రాణానికి విలువనివ్వని న్యాయవ్యవస్థ తీరును మనం సీరియస్‌గా ప్రశ్నించాల్సిన అవసరం సాయిబాబా కేసు ముందుకు తీసుకొస్తోంది. అసలు సాయిబాబా చుట్టూ అల్లుకున్న కేసును చూస్తే ఇవే ప్రాథమిక సందేహాలు అగుపిస్తాయి: 1. సాయిబాబా ముక్కుమొహం తెలీని ఏదో మహారాష్ట్ర మారుమూలల్లో బతుకుతున్న ముగ్గురు ఆదివాసీలతో కలిసి ‘యుద్ధంచేయాలని’ కుట్రపన్నుతున్నాడని ఆరోపణ. సాయిబాబా తన వీల్‌చెయిర్‌లో వెళ్ళిన వాళ్లతో కలిసి ఈ పన్నాగం పన్నారా? 2. సాయిబాబా ఇంటిమీద పోలీసులదాడికి కారణం– అతను మహారాష్ట్రలో ‘ఆహిరె’ అనేచోట ఒక ఇంట్లో దొంగతనం చేశాడని! అదెలా సాధ్యం? 3. ఈ కేసులో సాక్ష్యం సీలు వేసి లేదు. సీలువేయని సాక్ష్యం ఎవరన్నా మార్చేయొచ్చుకదా? ఇదెలా కోర్టు అంగీకరించింది?

ఇలాంటి కేసుల్లో ‘ఇంప్రెషన్‌ మేనేజ్‌మెంట్‌’ మాత్రమే ప్రధాన భూమిక వహిస్తున్నట్టుగా అగుపిస్తుంది. మనదేశంలో చట్ట, న్యాయవ్యవస్థ ఇంత బలహీనమైనదా అనే గుబులు పుట్టించే కేసు సాయిబాబాది. పైగా ముద్దాయి రాజకీయఖైదీ. సత్యం రామలింగరాజులా రూ. 5,000 కోట్లు వెనకేసుకున్న క్రైం కాదిది. మాల్యాలా గొప్ప లాయర్ల టీమ్‌ని పెట్టుకునే స్థాయి కూడా సాయిబాబా భార్యకు లేదు. 90 శాతం అంగవైకల్యంతో కిడ్నీ, ఛాతీ, క్లోమంకు సంబంధించి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రొఫెసర్‌కి తగిన మెడికల్‌ కేర్‌ ఇవ్వకుండా అల్పశరీరాన్ని కృశింపజేసే విధా నం మనకు లోపభూయిష్టంగా అనిపించకపోతే మన పబ్లిక్‌ కన్సైన్స్‌లో దారుణమైన లోపం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అనుమానాలతో శిక్షకు అర్హత ప్రకటించే చట్టాలు ఇంకా మనదేశంలో ఉండడం సమంజసం కాదు. ఇది నిజానికి ప్రజాస్వామ్యం పైన వేలాడుతున్న కరవాలం లాంటిది. ఎవరినైనా, ఎప్పుడైనా తెగ్గోయవచ్చు !

పి. విక్టర్‌ విజయకుమార్‌
వ్యాసకర్త ఫ్రీలాన్స్‌ రచయిత
మొబైల్‌ : 96188 88955

మరిన్ని వార్తలు