పుట్టిన చోటుకే ప్లాస్టిక్‌ చెత్త

4 Nov, 2019 02:06 IST|Sakshi

సక్సెస్‌ స్టోరీ

మట్టిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుందని ప్లాస్టిక్‌ వినియోగాన్ని ఆపేస్తే... ఈ క్షణమే బతుకు బండి ఆగిపోయేంతగా మనుషులు ప్లాస్టిక్‌కి అలవాటు పడిపోయారు. అయితే ప్లాస్టిక్‌ ఏ ఇంధనంలోంచి తయారవుతోందో ఆ ఇంధనంలోకే తిరిగి తీసుకెళ్లడం ద్వారా పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చెన్నైలో ఉంటున్న విద్య.

విద్య కామర్స్‌ గ్రాడ్యుయేట్‌. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నట్లుండి తన ప్రయాణాన్ని వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైపు మలుపు తిప్పుకున్నారు. ‘ఎ జర్నీ ఫ్రమ్‌ వెల్త్‌ టూ వేస్ట్‌’ అని నవ్వుతారామె.  ఞ్ఞ్ఞఅంతేకాదు, ‘‘చెన్నైలో తాగడానికి పనికి వచ్చే నీటి చుక్క కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.

వ్యర్థాలను విడుదల చేసే ఫ్యాక్టరీలు ఆ వ్యర్థాల మేనేజ్‌మెంట్‌ మీద దృష్టి పెట్టడం లేదు. నిజానికి వాళ్లు ఆ పని చేస్తే సమాంతరంగా రెండు రకాల ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతాం. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణ మీద కనీస స్పృహ కల్పించాల్సిన అవసరం ఉంది’’ అంటారు విద్య.

తప్పదు నిజమే
ఏడాదికి దేశంలో దాదాపు అరవై లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వేస్ట్‌ వస్తోంది. అందులో 20 శాతం మాత్రమే రీసైకిల్‌ అవుతోంది. మిగిలిన ప్లాస్టిక్‌ భూమిని, తాగునీటిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించమని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ హెచ్చరిస్తూనే ఉంది. అయితే క్యారీ బ్యాగ్‌ల బదులు క్లాత్‌ బ్యాగ్‌ వాడకం తప్ప మరేదీ మన చేతిలో ఉండదు.

ఉదయం పాలప్యాకెట్‌ నుంచి రాత్రి వేసుకునే మందుల డబ్బా వరకు ప్లాస్టికే. ఏ వస్తువు అయినా భద్రంగా రవాణా చేయాలంటే ప్యాకింగ్‌కి ప్లాస్టిక్‌ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. వాడటం తప్పనిసరి అయినప్పుడు ప్లాస్టిక్‌ను డీ కంపోజ్‌ చేయడానికి సరైన పద్ధతి ఉంటే సమస్య నివారణ అయినట్లే. సరిగ్గా ఆ సామాజిక బాధ్యతనే తలకెత్తుకున్నారు విద్య, ఆమె భర్త అమర్‌నాథ్‌.

వీళ్లేం చేస్తున్నారంటే..!
విద్య దంపతులు ప్లాస్టిక్‌ వేస్ట్‌తో పర్యావరణ హితమైన ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్లాస్టిక్‌ని తిరిగి మూలరూపానికి తెస్తారు. ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి మూలవస్తువు క్రూడ్‌ ఆయిల్‌. వీళ్లు వేస్ట్‌ ప్లాస్టిక్‌ని ఐదువందల సెల్సియస్‌ వేడిలో కరిగించి పూర్వ రూపమైన క్రూడ్‌ అయిల్‌ను తీసుకువస్తారు.

పైరోలిసిస్‌ అనే రియాక్టర్‌.. ప్లాస్టిక్‌ వేస్ట్‌ని పైరోసిలిస్‌ ఆయిల్, హైడ్రో కార్బన్‌ గ్యాస్, నల్లటి కార్బన్‌ పౌడర్‌లుగా మారుస్తుంది. గ్యాస్‌ని తిరిగి ప్లాస్టిక్‌ను వేడి చేయడానికి ఉపయోగిస్తారు. పౌడర్‌ని పెయింట్‌ కంపెనీలు, సిమెంట్‌ పరిశ్రమలు తీసుకుంటాయి. ఈ ఇంధనం మార్కెట్‌లో దొరికే మామూలు ఇంధనం కంటే 25 శాతం తక్కువ ధరకే లభిస్తోంది.

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌
ఒక టన్ను ప్లాస్టిక్‌ వేస్ట్‌ నుంచి 500 లీటర్ల ఆయిల్‌ వస్తుంది. గ్యాస్, పౌడర్‌ వంటి బై ప్రోడక్ట్స్‌ కాకుండా ఆయిల్‌ లెక్క ఇది. ఇలాంటి పరిశ్రమలను దేశమంతటా స్థాపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్య.
‘‘ప్లాస్టిక్‌ని తప్పు పట్టడం మానేయాలి. మనిషి సృష్టించిన అద్భుతాల్లో ప్లాస్టిక్‌ ఒకటి. ఇరవయ్యో శతాబ్దం పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావడంలో ప్లాస్టిక్‌ పాత్ర ముఖ్యమైనది.

అయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అసమతుల్యతకు కారణం... రీసైకిల్‌ చేసి మరీ వాడుకోగలిగిన ఈ మెటీరియల్‌ని నిర్లక్ష్యం చేయడమే. విలువైన ప్లాస్టిక్‌ వస్తువులను మాత్రమే రీసైకిల్‌ చేస్తున్నారు. మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. అందుకే ఆ విలువలేని ప్లాస్టిక్‌ వేస్ట్‌ని ఇలా రీసైకిల్‌ చేస్తున్నాం’’ అని వివరించారు విద్య.
– మను

మరిన్ని వార్తలు