కలిగిన పీడ పోయినది

9 Mar, 2020 00:47 IST|Sakshi

సాహిత్య మరమరాలు

ప్రతాపరుద్రీయం అన్న అలంకార శాస్త్ర రచయిత విద్యానాథకవి కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్ర మహారాజు దర్శనానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అసూయాగ్రస్తులైన రాజాశ్రితులు అతనికి అడ్డుపడి రాజదర్శనం కలగనీయకుండా చేస్తూ ఉంటారు. ఒకరోజు రాజు నగరంలో తన గుర్రం మీద సంచరిస్తుండగా జనం మధ్యలో నిలిచి విద్యానాథుడు ఈ అసంపూర్ణ శ్లోకం గట్టిగా చదివి వినిపిస్తాడట. ‘నవలక్ష ధనుర్ధరాధినాథే, పృథివీం శాసతి వీరరుద్రదేవే, అభవత్‌ పరమగ్రహార పీడాం’. అంటే తొమ్మిది లక్షల ధనుర్ధారుల సైన్యానికి అధిపతి అయిన వీర రుద్రదేవుడు పరిపాలిస్తుండగా అగ్రహారములకు గొప్ప పీడ కలిగినది అని భావము. బ్రాహ్మణ భక్తి కలిగిన ప్రతాపరుద్రుడు, ‘నా పాలనలో  అగ్రహారములకు పీడన కలుగుటయా’ అని ఉలిక్కిపడి ఆ వ్యక్తిని తనముందు హాజరు పెట్టవలసినదని ఆజ్ఞాపిస్తాడు.

అప్పుడు విద్యానాథకవి ముందుకు వచ్చి శ్లోకాన్ని ఇలా పూరిస్తాడు. ‘కుచ కుంభేషు కురంగ లోచనాం’ అని. అంటే తొమ్మిది లక్షల ధనుర్ధారుల సైన్యానికి అధిపతి అయిన వీర రుద్రదేవుడు పరిపాలిస్తుండగా లేడికన్నుల వంటి కన్నులు కలిగిన వనితల కుచాగ్రములకు హారముల పీడ కలిగినది అని. పీడ అంటే ఒత్తిడి, ఒరిపిడి అని అర్థం వచ్చేలా శ్లోకభావాన్ని మార్చి వినిపిస్తాడు విద్యానాథుడు. ఈ పాదము చేర్చడంతో శ్లోకానికి ‘కుచాగ్రముల వరకూ హారములను ధరించేటంతటి సంపద కలిగి ఉన్నారు ప్రజలు’ అన్న అర్థం వచ్చింది. ఈ పూరణకు ముగ్ధుడైన ప్రతాపరుద్రుడు అతనిని తన ఆస్థానానికి ఆహ్వానించి, సత్కరించి, తన ఆస్థానంలో నియమించుకొన్నాడట. ఈ కథలో చారిత్రక సత్యమెంతో తెలియదు గానీ ఒక రమణీయమైన కథ ఈ శ్లోకం ద్వారా ఆవిష్కృతమౌతున్నది. ఈ ఉదంతం మనకు వేదం వేంకటరాయశాస్త్రి నాటకం ‘ప్రతాపరుద్రీయం’లో కనిపిస్తుంది. 
-ఆర్‌.ఎ.ఎస్‌.శాస్త్రి

మరిన్ని వార్తలు