అమ్మకు నమస్కారం...

25 Sep, 2014 22:54 IST|Sakshi

నవమాసాలు మోసి పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు...
 ఆ బిడ్డలనే తమ పంచప్రాణాలుగా భావించుకున్నారు...
 అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలబడలేదు...
 ఆ బిడ్డలకు పంచేంద్రియాలు పనిచేయవని తెలుసుకున్నారు...
 అయినప్పటికీ ఏ మాత్రం దిగాలు పడిపోలేదు...
 జన్మనిస్తే సరిపోదు... వారికి జీవితాన్ని కూడా ఇవ్వాలి అనుకున్నారు...
 వారిలోని ప్రత్యేక ప్రతిభను వెలికి తీశారు...
 స్వయం ఉపాధితో వారు తలెత్తుకునేలా తీర్చిదిద్దారు...
 ఆ బిడ్డలకు పాతిక ముప్ఫై సంవత్సరాలు నిండినా కన్నతల్లులకు మాత్రం ఇంకా చంటిబిడ్డలే...
 అలాంటి అయిదుగురు పిల్లల్ని అత్యంత సహనంతో సాకుతున్న అయిదుగురు మాతృమూర్తుల కథ ఇది...

మానసిక వికలాంగుల కోసం ‘విద్యాసాగర్’ అనే విద్యాసంస్థ ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇందులో చేరిన పిల్లల్లోని మేధాశక్తిని వెలికి తీసేందుకు ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. ఎన్ని అంగవైకల్యాలు ఉన్నా, ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని ఈ సంస్థ విశ్వాసం. అందుకే ఇక్కడ చేరిన మానసిక వికలాంగులకు వృత్తి విద్యలపై శిక్షణ ఇస్తోంది. ఈ సంగతి తెలిసి, తమిళనాడు నలుమూలల నుండి ప్రత్యేక ప్రతిభావంతులను ఈ విద్యాసంస్థలో చేర్పిస్తున్నారు.
 
అలా పిల్లలను చేర్పించిన వారిలో నలుగురు తల్లులు ఒకరికొకరు పరిచయమయ్యారు. వనజకు లక్ష్మి (30) అనే కుమార్తె, భారతికి విఘ్నేష్ (24), శాంతికి సాయి సంతోష్ (23), కవితకు కార్తిక్ (32) కుమారులు. వీరితో సంతోష్ (30) తండ్రి కుంచితపాదం కూడా కలిశారు. ఈ బిడ్డలు బాగా చదివి ఏదో సాధించాలనే ఆశ వీరికి లేదు. అలాగని వీరిని గాలికి వదిలేయలేరు. మానసిక వికలాంగులైన ఈ బిడ్డలకు ఒక ఉపాధి మార్గం కల్పించాలని ఈ తల్లులంతా కృత నిశ్చయానికి వచ్చారు. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషించారు. ‘‘ఇటువంటి పిల్లలతో ఏమి చేయగలరని మమ్మల్ని కొందరు ఎద్దేవా చేశారు. మేం సాధించాలనుకున్నది అసాధ్యమని కొందరు కొట్టిపారేశారు. తల్లిదండ్రులతో చనువున్నవారైతే ఇటువంటి పిల్లలతో రిస్క్ ఎందుకంటూ తిట్టిపోశారు’’ అని వారు ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు ఆ తల్లులు.
 
కన్నపేగు బంధం వారిలోని పట్టుదలను మరింత బలోపేతం చేసింది. తమ బిడ్డలకు ఇస్తున్న వృత్తి విద్య శిక్షణను తాము కూడా తీసుకున్నారు. దాని నుంచి ‘ఎన్‌లైటన్ ఎంటర్‌ప్రైజెస్’ అనే చిన్న ఉత్పత్తుల సంస్థ ఉద్భవించింది. ఈ సంస్థలో రెండేళ్లపాటు శిక్షణ పొందిన వారికి నేషనల్ హాండీక్యాప్డ్ ఫెడరల్ కార్పొరేషన్ సిఫార్సుతో వారి బిడ్డల పేరున సీసీ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ. 2.50 లక్షల పెట్టుబడితో చెన్నై టి-నగర్‌లో సంస్థను ప్రారంభించారు.

‘‘అరటిబోదెతో భోజనం ప్లేట్లు, కప్పులు, వివాహాది శుభకార్యాలకు వినియోగించే తాంబూలం బ్యాగులు, కవర్లు, ఎన్‌వలప్‌లు, శారీ బాక్సులు తయారు చేయడం ప్రారంభించాం. మా బిడ్డల్లోని నైపుణ్యాన్ని బట్టి వారికి తగ్గ బాధ్యతలను అప్పగిస్తున్నాం’’ అంటూ వారు స్థాపించిన సంస్థ గురించి వివరించారు.
 
అరటి బోదెలను నీళ్లతో కడిగి మట్టిని తొలగిస్తాడు సాయిసంతోష్. విఘ్నేష్ వాటిని బ్రష్‌తో శుభ్రం చేస్తాడు. కార్తిక్, సంతోష్‌లలో ఒకరు అందిస్తుంటే మరొకరు ప్రెస్సింగ్ మిషన్‌ను ఆపరేట్ చేస్తారు. ఇలా ఐదు అంచెలుగా ఈ ప్లేట్లను తయారుచేస్తారు. సంస్థలోని తల్లుల్లో ఒకరు వారికి సహకరిస్తారు. ఇలా తయారైన ఉత్పత్తులను శాంతి, భారతి మార్కెటింగ్ చేస్తారు. ‘‘కొందరు బజారుకు వెళ్లినపుడు మిగతావారి పిల్లలను మా సొంత పిల్లల్లాగ చూసుకుంటాం’’ అని వివరించారు అక్కడి మిగతా తల్లులు.
 
ఇంటి దగ్గర సంసార బాధ్యతలను ఉదయాన్నే పూర్తిచేసుకుని, బిడ్డను తీసుకుని పది గంటలకల్లా యూనిట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.30కు పనులు పూర్తిచేసుకుని ఇళ్లకు చేరుకుంటారు. మానసిక చైతన్యం లేని ఐదుగురిని అదుపు చేయడం మహా కష్టం. ప్రతి ఒక్కరినీ కుర్చీలకు వేసి కట్టేయాల్సిందే. పాతికేళ్లు పైబడిన వారంతా పసిబిడ్డల్లా కోరే బొమ్మలు, ఆట వస్తువులు కొనివ్వాల్సిందే.

‘‘మా సంస్థ కార్యకలాపాలతో ఈ ఐదుగురు బిడ్డలూ ఒకే తల్లి బిడ్డల్లా కలిసిపోయారు. మేమంతా అక్కాచెల్లెళ్లుగా మారిపోయాం. మన కర్మ అని కుంగిపోకుండా ముందుకు సాగిపోతున్నాం’’ అంటున్న వీరు సమాజంలో ఆదర్శ తల్లులుగా నిలిచిపోతారనడంలో సందేహమే లేదు.
 
 భవిష్యత్తుకు బాటలు

 కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తుకు తగిన రీతిలో బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాం. వ్యాపారంలో వచ్చిన మొత్తంలో ముందుగా ఒక్కో రుణ వాయిదా కింద రూ.1,400 చొప్పున చెల్లించి, మిగిలిన లాభాన్ని ఐదు సమానభాగాలు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాం. 2012 ఏప్రిల్‌లో తీసుకున్న రుణం మూడేళ్లలో అంటే 2015కు తీరిపోతుంది. అప్పు తీరిపోతే పడిన శ్రమకు మరింత ఫలితం దక్కే అవకాశం ఉంది. అయితే మా ఉత్పత్తులను నిలకడగా కొనుగోలు చేసే వారు లేక ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నాం. ప్రతినెలా వాయిదాలకు సరిపడా సొమ్ము కోసం మేమంతా పాకులాడక తప్పడం లేదు. మనిషి ఎదుగుతున్నా మనసు ఎదగని మా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా శ్రమించేందుకు మేం సిద్ధం.
 - శాంతి
 
 ‘సాక్షి’కి హాయ్

సంతోష్ ప్రత్యేకమైన పరిభాషలో ప్లస్ ఐఐ ఉత్తీర్ణుడయ్యాడు. మిగతా వారితో పోల్చుకుంటే కొంత మెరుగ్గా వ్యవహరించగలడు. తల్లుల హావభావాల ద్వారా ఎవరో వచ్చి తమ కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నట్లు లీలగా గుర్తిస్తాడు. అందరికీ ఫోటోలు తీసి తల్లులతో ఇంటర్వ్యూను ముగించుకుని వెళుతున్న సాక్షి బృందానికి ఒక ప్లాస్టిక్ పలకపై ఉన్న ఏబీసీడీల వరుసలో వేలితో స్పెల్లింగ్ చూపుతూ థ్యాంక్యూ చెప్పాడు. ‘హెచ్‌ఐ’ అక్షరాలను చూపాడు.

 - కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్‌చార్జ్, చెన్నై
    ఫోటోలు: వన్నె శ్రీనివాసులు

 

మరిన్ని వార్తలు