వస్త్రం సమర్పయామి

12 Oct, 2018 00:10 IST|Sakshi

అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మకు పట్టుచీరలంటే మక్కువ అని అర్చకులు చెబుతారు. ఆ జగజ్జననికి వంద రూపాయల నుంచి వేలరూపాయల వరకు ఖరీదు చేసే చీరలను భక్తులు సభక్తికంగా సమర్పించుకుంటారు. దుర్గమ్మను అలంకరించేందుకు భక్తులు పట్టుచీరలతో పాటు శక్తి కొలదీ నూలు, సిల్క్‌చీరలను కూడా సమర్పిస్తుంటారు.  దుర్గమ్మకు అలంకరించే చీరలను ప్రత్యేకంగా ఎక్కడా నేత నేయించరు. భక్తులు సమర్పించిన వస్త్రాలలో పెద్ద అంచు ఉన్న చీరలను అమ్మవారికి అలంకరించేందుకు ఉపయోగిస్తారు. భక్తులు తమకు నచ్చిన పట్టు చీరలను కొనుగోలు చేసి దేవస్థానం కౌంటర్‌లో అందచేస్తారు. కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పట్టుచీరలను నేత నేయించి కానుకలుగా అందచేస్తారు. అమ్మవారికి ఇచ్చే ప్రతి చీరను అంతరాలయంలో ఉత్సవమూర్తికి చూపుతారు. నిత్యం నాలుగు నుంచి ఐదు చీరలను అమ్మవారి మూలవిరాట్టుకు అలంకరిస్తారు. దసరా ఉత్సవాలలోనూ ఇదే తరహాలో అలంకరిస్తారు. ఇక ఉత్సవ మూర్తులు, అమ్మవారి ఆలయం చుట్టూ కొలువుదీరిన అష్టలక్ష్ములకు కూడా పట్టుచీరలను అలంకరిస్తారు.

ప్రభుత్వం నుంచి పట్టుచీర
దసరా ఉత్సవాలలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం రోజున ప్రభుత్వం తరపున రాష్ట్రముఖ్యమంత్రి పట్టుచీరను సమర్పిస్తారు. దసరా ఉత్సవాల ప్రారంభం రోజున పోలీసు శాఖ నుంచి విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. దీనితోపాటు దుర్గ గుడి ఆలయ అధికారి ఈవో హోదాలో అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీ. సమర్పించే పట్టుచీరలను అమ్మవారికి అలంకరించిన అనంతరం దేవస్థానం వాటిని వస్త్ర ప్రసాదంగా భక్తులకు విక్రయిస్తుంది. వివాహం, గృహప్రవేశం, కంపెనీల ప్రారంభోత్సవం వంటి శుభకార్యాల సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరలను సమర్పిస్తుంటారు. సాధారణ రోజులలో కొండపై ఆలయ ప్రాంగణంలో రెండు కౌంటర్లు, మహామండపం దిగువన ఒక కౌంటర్‌లో ఈ వస్త్రప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దసరా, భవానీ దీక్షల విరమణ సమయంలో కొండ దిగువన మహామండపం, కనకదుర్గ నగర్‌లలో వస్త్ర ప్రసాద కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. అమ్మవారి చీరల విక్రయాలు ఆలయ ఈవో పర్యవేక్షణలో జరుగుతుంది. భక్తులు అమ్మవారికి అలంకరించే నిమిత్తం సమర్పించిన చీరను... పుట్టినరోజు, పెళ్లిరోజు... ఇలా తమకు నచ్చిన తేదీలలో అమ్మవారికి అలంకరింపచేసుకునే అవకాశం ఉంటుంది. 

అమ్మవారి వస్త్ర ప్రసాదం
దేవస్థానానికి వచ్చే ఆదాయంలో చీరల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి రూ. 1.98 కోట్ల ఆదాయం వచ్చింది.  గత రెండు సంవత్సరాలుగా దేవస్థానమే చీరల విక్రయాలను నిర్వహిస్తోంది. ఐఎఎస్, ఐపీఎస్‌ అధికారులు సైతం అమ్మవారి చీరలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆ వస్త్రాలను అమ్మవారి దివ్య ప్రసాదంగా భావిస్తారు.

దసరా ఉత్సవాలలో అమ్మవారికి  అలంకరించే పట్టు చీరలు
శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి – బంగారు రంగు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి     – లేత గులాబీ రంగు శ్రీగాయత్రీదేవి – ముదురు నారింజ రంగు
శ్రీలలితా త్రిపుర సుందరీదేవి – అచ్చమైన బంగారు రంగు
శ్రీసరస్వతీదేవి (మూలానక్షత్రం) – తెలుపు రంగు
శ్రీఅన్నపూర్ణాదేవి – గంధపు రంగు
శ్రీమహాలక్ష్మీదేవి – నిండు గులాబీ రంగు
శ్రీదుర్గాదేవి– నిండు ఎరుపు రంగు
శ్రీమహిషాసురమర్దినీదేవి – గోధుమ, ఎరుపు రంగుల కలనేత జరీ పట్టు చీర
శ్రీరాజరాజేశ్వరీదేవి – పచ్చరంగు
– ఎస్‌.కె.సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడ
 

మరిన్ని వార్తలు