డిజిటల్‌ ఫీవర్‌

16 Nov, 2017 23:54 IST|Sakshi

అమితానందం
సెలబ్రిటీలన్నా, వారి ఆటపాటలన్నా, వారి పర్సనల్‌ ఫొటోలు, వీడియోలన్నా అందరికీ పండుగే. వాళ్లకి కష్టమొస్తే అభిమానులు దుఃఖపడతారు. వాళ్లు పెళ్లి చేసుకుంటే వీళ్లు పండుగ చేసుకుంటారు. వాళ్ల బర్త్‌డేలు, జీవితంలోని ఇతర ముఖ్యమైన రోజులు అభిమానులందరికీ అతి ముఖ్యమైనవే. అమితాబ్‌ బచ్చన్‌ ఇష్టం లేనిదెవరికి? ఆయన భార్య జయాబచ్చన్, కుమారుడు అభిషేక్‌ బచ్చన్, కోడలు విశ్వసుందరి ఐశ్వర్యా బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌... టోటల్‌ ఫ్యామిలీ అంతా సెలబ్రిటీలే... వీళ్లందరూ కలసి ఒకచోట కనిపిస్తే.. అదీ ఏ సినిమా షూటింగ్‌లోనో కాకుండా... ప్రైవేట్‌గా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా సందడి చేస్తూ కంటపడితే... అభిమానులకు పండుగే పండుగ కదా! అది వైరల్‌ కాక ఏమవుతుంది మరి!

తేనెపొట్ట
తేనెటీగలంటే మీకు ఇష్టమా? మీకేమైనా పిచ్చా? తేనె అంటే ఇష్టమే కానీ, తేనెటీగలెవరికయినా ఇష్టం ఉంటుందా? ఒకవేళ ఇష్టం ఉంటే మాత్రం వాటినేమైనా ముద్దుపెట్టుకుంటామా? అంటారా? అలా అయితే మీరు వెంటనే సైడ్‌ తీసుకోవలసిందే... ఎందుకంటే ఈ ఫొటోలో ఉన్న అమ్మడు ప్రకృతి ప్రేమికురాలు.  ఓహియోకు చెందిన ఎమిలీ ముల్లర్‌ అనే ఈ ముప్ఫై ఏడేళ్ల ఆమెకు తేనెటీగలంటే వల్లమాలిన అభిమానం ఉండటం వల్ల ఎంతో ప్రేమగా తేనెటీగలను పెంచుకుంటోంది. ఇటీవల ఆమె నాలుగోసారి గర్భం ధరించడంతో ఫొటో షూట్‌ చేయించాలనుకున్నాడామె భర్త. అంతే! తాను ముద్దుగా పెంచుకుంటున్న 20,000 తేనెటీగలను పిలిచి, పొట్టమీదకి ఎక్కించుకుని మరీ ఫొటోలకు స్టిల్సిచ్చింది.

టీన్‌ ఇన్‌ ఫిఫ్టీ
జూహీచావ్లా... ఒకనాటి విశ్వసుందరి. 80ల చివరి నుంచి 90ల చివరి వరకు వెండితెరను ఏలిన అందాల తార. ఖయామత్‌ సే ఖయామత్‌ తక్, ఇష్క్‌ తదితర చిత్రాలలో నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన తారాజువ్వ. ముద్దుగారే ముఖం, మిలమిలా మెరిసే కళ్లు, చురుక్కున గుచ్చినట్టుండే నవ్వు... ఆమె నటించిన చిత్రాలను ఒకసారి చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూసి మరీ సూపర్‌ డూపర్‌ హిట్‌ చేసేవారు. చాలా రోజులుగా తెరమరుగున ఉన్న ఈ తార ఉన్నట్టుండి వార్తల్లోకెక్కింది. మొన్నీమధ్యే యాభయ్యవ పుట్టిన రోజు జరుపుకున్న ఈ సుందరిని చూసిన వారందరా వహ్వా అన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆట్టే తేడా ఏం కనిపించట్లేదన్నారు.అందరి కామెంట్లూ ఆనందంగా స్వీకరించిందామె. రిటర్న్‌ గిఫ్ట్‌గా తన బ్యూటీ సీక్రెట్స్‌ అందరితోనూ పంచుకుంది. ఆమె షేర్‌ చేసిన బ్యూటిప్పులు, ఆమె బర్త్‌డే ఫొటోలు వాట్సప్పుల్లో, ఫేస్‌బుక్‌లో వేలాది షేర్లు, లక్షలాది లైకులుగా హల్‌ చల్‌ చేస్తున్నాయి.

అది నిజమైతే ఎంత బావుణ్ణు!
ఒక బీద కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఒక తండ్రి, తల్లి, ముగ్గురు పిల్లలు. తం్రyì కి ఎప్పుడూ ఆరోగ్యం బాగోదు. ఒకరోజు తండ్రి చనిపోయాడు. మూడు రోజుల వరకు బంధువులు ఆహారం పంపించారు. తరువాత ఆకలితో భరించాల్సిన రోజులు వచ్చాయి. తల్లి కొన్ని రోజులు ఎలాగో అవస్థలు పడి పిల్లలకి ఆహారం పెట్టగలిగింది. కానీ తరువాత ఆహారం లేక ఆకలితో ఉండవలసి వచ్చింది. ఆకలితో ఉండటం వలన 8 సంవత్సరాల బాబుకి జ్వరం వచ్చింది. మంచంలో ఉన్నాడు. ఒకరోజు ఐదేళ్ల పాప వాళ్ళ అమ్మని అడిగింది‘‘అమ్మా!! అన్నయ్య ఎప్పుడు చచ్చిపోతాడు..?’’అప్పుడు అమ్మ, పాపని అడిగింది ‘‘ఎందుకు అలా అడుగుతున్నావు’’ అని.అమ్మాయి బాధతో సమాధానం చెప్పింది. ఆ సమాధానం విని అందరికీ అప్పుడు ఏడుపొచ్చింది..సమాధానం ఏంటంటే!... ‘‘అన్నయ్య చచ్చిపోతే మన ఇంటికి అన్నం వస్తుంది కదా...!’’ ప్రియమైన సోదర సోదరీ మణులారా! మన దగ్గర మిగిలి ఉన్న ఆహారాన్ని బీద ప్రజలకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వటం మన బాధ్యత కూడా. అలా మన బాధ్యత నెరవేర్చుకుంటే పైన ఉన్న భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడు.ఈ మెసేజ్‌ గత కొద్ది నెలలుగా వాట్సప్‌లో షేర్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు పెళ్లి, ఇతర వేడుకల సందర్భంగా ఎక్కువగా వండి, మిగిలిపోయిన భోజనాన్ని తీసుకెళ్లి అనాథలకు పంచి పెట్టే స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమకు దగ్గరలో ఉన్న కార్యకర్తల కాంటాక్ట్‌ నంబరు దగ్గర ఉంచుకుంటే... ఇలాంటి పిల్లలకు అన్నం పెట్టవచ్చు.

>
మరిన్ని వార్తలు