బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌

2 Oct, 2019 05:38 IST|Sakshi

ఒక కుర్రవాడు బస్‌ దొరక్క ఇంటర్వూ్యకి ఆలస్యంగా వెళ్లాడు. ఉద్యోగం రాలేదు. నిస్త్రాణగా వెనక్కి వస్తున్నాడు. మే నెల. విపరీతమైన దాహం. కిలోమీటర్‌ నడిచినా ఒక్క నీళ్ల షాపు కూడా కనబడలేదు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చి ఆ వీధిలోనే చిన్న షాప్‌ పెట్టి నీళ్ల బాటిల్స్‌ అమ్మసాగాడు. మూడు నెలల్లో ఐదు వేల లాభం వచ్చింది. దాంతో కూల్‌డ్రింక్స్, ఆపై ఐస్‌క్రీమ్‌... అలా పెంచుకుంటూ పోయి, ఆ తర్వాత దాన్ని సూపర్‌ మార్కెట్‌ చేశాడు. పదేళ్లలో లక్షాధికారి అయ్యాడు. ఆ రోజు అతడికి గానీ బస్సు దొరికి ఉంటే ఇప్పటికీ రూ.10 వేలకు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.

ఒక చిన్న సంఘటన జీవితాన్ని మార్చటం అంటే అదే!
గాంధీ జీవితంలో కూడా ఇలాంటి ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌’ ఒకటి ఉంది. సౌత్‌ –ఆఫ్రికా రైలు నుంచి ఒక బ్రిటిష్‌ వాడు ఆయన సామాన్లు బయటికి విసిరేసినప్పుడు ‘మిమ్మల్ని కూడా భారతదేశం నుంచి ఇలాగే బయటకి విసిరేస్తా’అన్న ఆలోచన ఆయనకి బహుశా అప్పుడే వచ్చి ఉంటుంది. మా ఎనిమిదో తరగతి ఇంగ్లీష్‌లో ‘సెల్ఫ్‌ హెల్ప్‌’అన్న పాఠం ఉండేది. మహాత్మాగాంధీ ఆత్మకథ నుంచి ఒక భాగం. అందులో బాపూ, ‘తన క్షవరం తనే చేసుకునేవాడు’అని వ్రాశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మేము ఆ రోజుల్లో ప్రతి పైసా చూసుకోవలసి వచ్చేది. గాంధీగారి పాఠంతో ప్రభావితమైన నేను, మా తండ్రి గారి ప్రోత్సాహంతో నా క్షురకర్మ నేనే చేసుకోవటం ప్రారంభించాను. గత 60 సంవత్సరాల్లో ఆ రోజు నుంచి ఇప్పటివరకూ కేవలం పది, పదిహేను సార్లు తప్ప మళ్ళీ బార్బర్‌ షాప్‌కి వెళ్ళలేదు. ఒక చిన్ని వ్యాసం నా జీవితాన్ని అలా ప్రభావితం చేసింది.

ఒక మంచి ఉపన్యాసం కూడా మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఈ తరం వాళ్లకి అంతగా పరిచయం లేని వ్యాపార దక్షులు, పత్రికా సంపాదకులు కె.ఎన్‌.కేసరి. మహాత్మా ఇచ్చిన ఉపన్యాసం తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో కేసరి మాటల్లో:  ‘‘..పుట్టిన ఐదో నెలలోనే తండ్రిని పోగొట్టుకొని, నా కోసం తల్లి పడుతున్న అవస్థలు చూడలేక చెన్నపట్నం వెళ్లాలనుకున్నాను. డబ్బు లేదు. ఒంగోలు నుంచి కాలి నడకన మద్రాసు చేరాను. అక్కడ అష్ట కష్టాలు పడ్డాను. ఆ పై ‘కేసరి సంస్థ’ స్థాపించి, ఆయుర్వేద ఔషధాల ద్వారా స్త్రీల వ్యాధులకు ‘లోధ్ర’మందు తయారు చేసి అనతికాలంలోనే విశేష ధనార్జన చేశాను. నడమంత్రపు సిరి తలకెక్కినది. అంతులేని కోరికలు. పటాటోపమైన వేషము. చెవులకు ఒంటి రాయి వజ్రము. మొలకు బంగారు మొలత్రాడు. ఆ రోజు 1919 ఏప్రిల్‌ నెలలో మన మహాత్ముడు విజయవాడలో ఇచ్చిన ఉపన్యాసం విన్నప్పటి నుంచి నాలో క్రమక్రమముగా అనేక మార్పులు కలిగాయి.

తల బోడిచేసి గాంధి టోపీని ధరించితిని. వేషము మారినది. పట్టుచొక్కాలు, దుకూలాంబరములు దూరములయినవి. సాత్వికాహారము మితముగ భుజించుటకు అలవడితని. కోరికలకు కళ్లెం వేయడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ నేర్చుకున్నాను’’ అంటారు కేసరి. ఆపై ఆయన గొప్ప వితరణశీలిగా మారి, సర్వస్వం సమాజానికి అర్పించి ప్రజాసేవకి అంకితమయ్యారు.గీత ఆధారంగా ‘విజయానికి ఆరో మెట్టు’పుస్తకం రాస్తున్నప్పుడు, మహాత్ముడి ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం భగవద్గీత అని తెలిసింది. తన తల్లికి జైనులతో ఉన్న పరిచయాల వలన గాంధీకి జైన్‌ ఫిలాసఫీ కూడా ప్రియమైనదిగా మారింది. ‘‘గీతా పఠనం వల్ల ఆత్మజ్ఞానము, నిష్కామకర్మ ఒకవైపూ, జైనమత ఆలోచనలైన కరుణ, శాకాహారం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ప్రతిజ్ఞ యొక్క ప్రాముఖ్యత విలువల ప్రభావం మరోవైపూ నా జీవితంలో ప్రధానాంశాలయ్యాయి’’అంటారు బాపూ. బౌద్ధాన్ని నమ్మే మాలాంటి వారికి జైన్‌ ఫిలాసఫీ విరుద్ధంగా కనపడుతుంది.

అయితే గౌతమ బుద్ధుడే ఒక చోట, ‘‘నీ మనసుకు సరి అయినది నమ్ము. సరి కాదనిపిస్తే, నేను చెప్పేది కూడా నమ్మే అవసరము లేదు’’అంటాడు. ప్రజలందరూ జైనిజం ఆచరిస్తే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని గాంధీ నమ్మారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ గాంధీ గురించి ‘రక్తమాంసాలున్న ఇటువంటి ఒక మనిషి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు’ అంటాడు. బెర్నార్డ్‌ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడిన తరువాత, ఆయన వ్యక్తిత్వమూ, ఆలోచనాసరళీ మరింత నిర్దిష్టంగా రూపుదిద్దుకొన్నాయని కొందరు చరిత్రకారులు అంటారు. షా ప్రసక్తి వచ్చింది కాబట్టి అప్రస్తుతమైనా, నన్ను బాగా ప్రభావితం చేసిన ఒక కథ చెపుతాను. బాల్‌రూమ్‌లో బెర్నార్డ్‌షా ఓ మూల కూర్చుని ఉండగా, ఒకామె వచ్చి ‘డ్యాన్స్‌ చెయ్యకుండా ఇలా కూర్చున్నారేమిటి? రండి’అన్నదట. ‘వద్దులెండి. నేను కథ గురించి ఆలోచించుకుంటున్నాను’అన్నాడు షా.

‘డ్యాన్స్‌ చేస్తూ కూడా ఆలోచించుకోవచ్చుగా’అన్నది ఆమె. ‘ఒకేసారి రెండు పనులు చేయటం నాకు రాదు’అన్నాడు షా. ‘జీవితాన్ని ఎంజాయ్‌ చెయ్యాలి. డ్యాన్స్‌లో ఉండే కిక్‌ తెలిస్తే మీరు ఈ మాట అనరు’.‘డ్యాన్స్‌లో ఉండే కిక్‌ నాకు బాగా తెలుసు. అందుకే నేను దానికి దూరంగా ఉంటున్నాను. పుస్తకాలు వ్రాయటం వల్ల నాకు కిక్‌తో పాటూ డబ్బు, కీర్తి, సంతృప్తి వస్తాయి. ఈ కిక్‌ శాశ్వతమైనది, లోతైనది. డ్యాన్స్‌కి అలవాటు పడితే ఆ తాత్కాలికమైన కిక్‌లో నేను శాశ్వతమైన దాన్ని మర్చిపోతాను’ అన్నాడట. ‘మీరు చెప్పే ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు’అని చెప్పి ఆమె వెళ్లిపోయిందట. ఈ కాలపు విద్యార్థులకు ఈ కథ ఒక బట్టర్‌ఫ్లై ఎఫెక్ట్‌ కావాలి.

బాపూ గురించి చాలా మందికి తెలియని వివరాలు
►ఆహార పంటలు వదిలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని బీహారు రైతులను తెల్లదొరలు నిర్బంధించినప్పుడు ఆ పరిస్థితులను వ్యతిరేకించి గాంధీ సత్యాగ్రహాలు నిర్వహించి అరెస్టు అయినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. అప్పటి నుంచే గాంధీని ప్రజలు ప్రేమతో ‘బాపూ’అనీ, ‘మహాత్మా’అనీ పిలుచుకోసాగారు.

►దేశాన్ని మతప్రాతిపదికన విభజించటాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. జిన్నాను ప్రధానమంత్రిగా చేసి అయినా సరే దేశాన్ని ఐక్యంగా నిలపాలని ఆయన వాంఛ. కానీ, ‘దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి’అని జిన్నా హెచ్చరించాడు. కలహాలు ఆపాలంటే విభజన కంటే గత్యంతరము లేదని హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రం చేస్తూ గడిపాడు.

►విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు ఇవ్వవలసిన 55 కోట్ల రూపాయలను (ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని) ఇవ్వడానికి భారత్‌ నిరాకరించింది. ఈ విషయమై గాంధీ తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తాన్‌కు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పాకిస్తాన్‌కూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నాడని తీవ్రవాదులు ఉడికిపోయారు. గాంధీని గాడ్సే చంపాడని జనాలకి తెలుసుగానీ, 1934లోనే ఆయనపై మూడు హత్యా ప్రయత్నాలు జరిగాయి.

►నోబెల్‌ బహుమతికి మహాత్మాగాంధీ ఐదుసార్లు ప్రతిపాదించబడ్డాడు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని ఇవ్వలేదు. 1948 లో మళ్లీ ప్రతిపాదించబడినా మరణానంతరం ఇవ్వకూడదనే నియమం వల్ల ఇవ్వలేదట. 20వ శతాబ్దిలో అత్యధిక మానవాళిని ప్రభావితం చేసిన నాయకునిగా కేబుల్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ (సీఎన్‌ఎన్‌) జరిపిన సర్వేలో ప్రజలు గాంధీజీని గుర్తించారు. నోబెల్‌ ప్రైజ్‌ కన్నా ప్రజాభిమానం ఎప్పుడూ గొప్పదే కదా.
– యండమూరి వీరేంద్రనాథ్‌ 

మరిన్ని వార్తలు