కల్పవల్లి... ఆండాళ్‌ తల్లి

23 Dec, 2018 00:22 IST|Sakshi

వైష్ణవసంప్రదాయంలో 108 దివ్య దేశాలున్నాయి. ఆ క్షేత్రాలలో విష్ణువు నెలకొని ఉంటాడు. వాటిలో ఒకటి శ్రీవిల్లిపుత్తూర్‌. ఇక్కడే విష్ణుచిత్తుడు అనే భక్తుడుండేవాడు. ఆయనకు తులసివనంలో ఒక బాలిక దొరుకుతుంది. ఆ బాలికకు పుష్పమాలిక అనే అర్థం వచ్చేట్టు కోదై అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ప్రతిరోజూ విష్ణువుకు సమర్పించే మాలలను సిద్ధం చేస్తుంటే తండ్రికి సహాయం చేసేది కోదై. విష్ణువుకు అలంకరించే మాలలు తాను ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోయేది. ఒకసారి స్వామి వారికి మాలసమర్పిస్తుంటే పొడవైన కేశం విష్ణుచిత్తుడి కంటపడింది.

విషయం గ్రహించి కూతుర్ని మందలించి మరునాటి మాలలను సిద్ధం చేసి తానే తీసుకుని వెళ్తే అది స్వామి స్వీకరించడు. గోదా అలంకరించుకున్న మాలే సమర్పించమంటాడు. ఇన్నాళ్లు తాను పెంచింది సాక్షాత్తు లక్ష్మీదేవినే అని గ్రహించి ఆమెను ఆండాళ్‌ తల్లి అని సంబోధిస్తాడు. పవిత్రధనుర్మాసంలో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆమెను వివాహం చేసుకోవడానికి తిరుమల నుంచి వేంకటేశ్వర స్వామి, కంచి నుండి వరదరాజస్వామి వస్తుండగా రంగనాథస్వామి గరుడవాహనంపై విచ్చేసి ఆమె చేయందుకుంటాడు.

ఇందుకు ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వర సన్నిధి ఉంది.గర్భాలయంలో గోదాదేవి, రంగనాథస్వామితోపాటు గరుత్మంతుడు కూడా ఉంటాడు. గోదాదేవి ఎడమచేతిలో చిలుకను ధరించి, చేతిని వంపుగా కిందికి వదిలి ఉంటే, రంగనాథస్వామి గోపాలకుడిగా చెర్నాకోలు, ముల్లుకర్ర ధరించి ఉంటాడు. గరుత్మంతుడు అంజలి బద్ధుడై వారిని సేవించుకుంటూ దర్శనమిస్తాడు. ఇటువంటి అపురూపమైన గోదాదేవి దర్శనాన్ని చేసుకుని భక్తులంతా తరిస్తారు. అయితే వటపత్రశాయి సన్నిధి దివ్యదేశం అనీ, ఇప్పటి గోదాదేవి ఆలయం పెరియాళ్వార్‌ గృహమనీ, అదే కాలక్రమంలో ఆలయంగా రూపుదిద్దుకుందని భక్తులు గ్రహించాలి. 
గోదాదేవి దర్శనం సకలశుభాలకు నెలవు. 
– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి 

మరిన్ని వార్తలు