ఎప్పుడు పరీక్ష చేయించినా...

2 May, 2018 11:51 IST|Sakshi

నా వయసు 50 ఏళ్లు. నేను ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగిని. ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మాస్టర్‌ హెల్త్‌చెకప్‌ చేయించుకుంటూ ఉంటాను. అయితే ప్రతిసారీ పరీక్షల్లో నేను ఒక విషయం గమనిస్తున్నాను. నా విటమిన్‌ బి12, విటమిన్‌–డి పాళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగతా అన్ని పరీక్షలూ నార్మల్‌గా ఉంటున్నాయి. ప్రతిసారీ ఇందుకోసం మందులు వాడుతున్నా, నాకు ఆ పరీక్షల్లో నార్మల్‌ రిజల్ట్‌ రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా?  – ఒక సోదరుడు, హైదరాబాద్‌ 

విటమిన్‌ బి12 సాధారణంగా మాంసాహారంతో పాటు పాలు, పాల ఉత్పాదనల్లోనే చాలా ఎక్కువగా లభ్యమవుతుంటుంది. ఒకవేళ మీరు శాకాహారి అయి ఉండి, పాలు చాలా తక్కువగా తీసుకునేవారైతే మీకు విటమిన్‌ బి12, విటమిన్‌–డి లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే అవకాశాలు ఉండవు. అయితే చాలామంది మాంసాహారం తీసుకునేవారిలో సైతం, దాన్ని రక్తంలోకి తీసుకెళ్లే కొన్ని కాంపోనెంట్స్‌ లేకపోవడం వల్ల అవి భర్తీకాకపోవచ్చు. ఇలా విటమిన్‌ బి12 తక్కువగా ఉన్నవారు వాటిని డాక్టర్‌ సూచించిన మోతాదులో (అంటే సాధారణంగా మొదట... ప్రతి రోజు ఒకటి చొప్పున నాలుగు రోజులూ, ఆ తర్వాత ప్రతివారం ఒకటి చొప్పున నాలుగు వారాలు, ఇక ఆ తర్వాత ప్రతి నెలా ఒకటి చొప్పున ఆర్నెల్లు... ఆ తర్వాత మూడు నెలలకొకసారి చొప్పున) ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాలి.  ఇక విటమిన్‌–డి అనేది కేవలం సూర్యకాంతితోనే మనకు లభ్యమవుతుంది. ఆహారం ద్వారా లభ్యం కావడం చాలా చాలా తక్కువ (అందులోనూ చాలా ఎక్కువ మోతాదులో డి–విటమిన్‌ చేర్చితే తప్ప). ఒకవేళ విటమిన్‌–డి కోసం మీరు ఎండలో తిరిగినా కేవలం మీ ముఖం, బట్టలతో కప్పి లేని చేతుల వంటి భాగాలు మినహా మిగతా భాగాలు ఎండకు ఎక్స్‌పోజ్‌ కావు. మీ మేని రంగు నలుపు అయితే మీకు విటమిన్‌–డి పాళ్లు తక్కువగా సమకూరే అవకాశం ఉంది. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విటమిన్‌–డి లోపం ఉన్నట్లు కనుగొన్నప్పుడు విటమిన్‌–డి 60,000 యూనిట్ల టాబ్లెట్లను వారానికి ఒకటి చొప్పున ఎనిమిది వారాలు వాడాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. ఆ తర్వాత కూడా  ప్రతి నెలా ఒక టాబ్లెట్‌ తీసుకొమ్మని సూచిస్తారు. మీరు ఒకసారి మీ ఫిజీషియన్‌/న్యూరాలజిస్ట్‌ను కలిసి చర్చించి, మీ డాక్టర్‌ సలహా మేరకు విటమిన్‌ సప్లిమెంట్లు వాడండి.

డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి, 
చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, 
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు