ఉదర సంబంధ వ్యాధులకు బత్తాయితో చెక్‌

26 Apr, 2019 01:11 IST|Sakshi

హెల్దీ ఫుడ్‌

ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బత్తాయి ముఖ్యమైనది. పండిన బత్తాయి లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా అనేక లాభాలు. బత్తాయిలో ముఖ్యంగా విటమిన్‌ –సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధులను నివారిస్తుంది. ఇది దంత చిగుళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇంకా దగ్గు, జలుబు, పెదాల పగుళ్ళను నివారిస్తుంది. బత్తాయి రసంలో ఉండే విటమిన్‌ సి ఇన్ని రకాలుగా సహాయపడుతుంది. పీచుపదార్థాలు, జింక్, కాపర్, ఐరన్‌ శక్తి, క్యాల్షియం వంటివి దాగివున్నాయి.

క్యాలరీలు, ఫ్యాట్‌ కూడా తక్కువ. ఉదర సంబంధిత రోగాలకు బత్తాయి పండ్లు చెక్‌ పెడతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ పండ్ల రసాన్ని రోజూ ఓ గ్లాసుడు తీసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. శరీరానికి కావలసిన ధాతువులు, పీచు పదార్థాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. గర్భిణులు తరచూ బత్తాయి రసాన్ని తీసుకుంటే, అందులో ఉండే క్యాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది.ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్‌ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమే కాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది.

బత్తాయిరసంలో ఉండే యాసిడ్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యలను నివారిస్తుంది. బత్తాయి రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల నోటి అల్సర్లు రాకుండా ఉంటాయి. బత్తాయి రసం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్‌ ప్రెజర్‌ నియంత్రణలో ఉంటాయి. ఈ జ్యూస్‌ లోని ఫ్లేవనాయిడ్స్‌ పిత్తం, జీర్ణ రసాలను, యాసిడ్స్‌ను విడగొడుతుంది. కాబట్టి, బత్తాయి రసం త్రాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట సమస్యలు, అజీర్ణం, వికారం, కళ్ళు తిరగడం వంటి సమస్యలను నివారిస్తుంది. బత్తాయి జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది.+

మరిన్ని వార్తలు