పాలు రుబ్బండి...  గొడుగు పట్టండి! 

13 Dec, 2018 00:48 IST|Sakshi

విటమిన్‌ డి, బి12 లోపానికి విరుగుడు

ఇప్పటి పశువుల పాలు ఒకనాటి పాలు కావు. రసాయన అవశేషాలుండే ఆ పాలు తాగితే మనమూ అనారోగ్యం పాలు కావచ్చు. ఇల్లూ ఆఫీసూ ఇవే జీవితమైపోయిన మనకు ఎండ ఎండమావి అయిపోయింది. విటమిన్‌–బి 12, విటమిన్‌–డి లోపాలకు మందులు అక్కర్లేదు... రుబ్బిన పాలు, పట్టించే గొడుగు చాలంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్‌వలి. 

ఆరోగ్యవంతమైన జీవనానికి పోషకాలతోపాటు విటమిన్‌ డి, విటమిన్‌ బి–12 అత్యంత అవసరం. ఎండ తగలని జీవనశైలి వల్ల, భిన్నమైన డ్యూటీ సమయాల వల్ల విటమిన్‌–డి లోపం వస్తుంది. కొందరికి బి–12 లోపం వస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలం మందులు వాడాల్సిందేనన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఈ రెండు ముఖ్య విటమిన్లూ, కాల్షియం కూడా  దేశీయ ఆహార పదార్థాల్లోనే పుష్కలంగా ఉన్నాయంటున్నారు ప్రసిద్ధ స్వతంత్ర ఆరోగ్య, ఆహార శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌వలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే  విటమిన్‌ బీ 12  చాలా అవసరం. ఇది లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బి 12 కేవలం మాంసాహారం ద్వారా  లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే కోడిగుడ్డు, కోడి, గొడ్డు, మేక, పంది, కుందేలు మాంసం.. ఇంకా ఏ జంతువు/పక్షిæనుంచి సేకరించిన మాంసాహారమైనా మనిషి దేహంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందే తప్ప సమతుల్యత కలిగించదు. నాటు జాతి కోళ్లు, పశువులను రసాయనాల్లేకుండా పెంచినవైనప్పటికీ వాటి గుడ్లు, మాంసం మనిషికి ఉపయోగపడవు. 

చిరుధాన్యాల పాలతో  బి 12 
విటమిన్‌ బి 12ను.. ఆ మాటకొస్తే ఏ విటమిన్‌ను అయినా టాబ్లెట్లు, ఇంజక్షన్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకుంటేనే సరిగ్గా ఒంటికి పడుతుంది.ఆహారంలో ఇమిడి ఉంటేనే దేహం సజావుగా గ్రహించగలుగుతుంది. ఆహారం ద్వారా విటమిన్‌ బి 12ను పొందడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. 

మొదటిది.. దేశీ ఆవు పాలు, పెరుగు, మజ్జిగలో బి 12 విటమిన్‌ పుష్కలంగా ఉంది. ఈ పాలు తోడుపెట్టి చిలికి వెన్న తీసిన మజ్జిగను ఉదయం ఒక గ్రాసు, సాయంత్రం ఒక గ్లాసు తీసుకుంటే బి 12 విటమిన్‌ లోపం రాదు. 

రెండోది.. కుసుమలు, వేరుశనగలు, నువ్వులు మనకు నూనె గింజలుగా మాత్రమే తెలుసు. అయితే వీటి ద్వారా పాలు, ఆ పాలతో పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని వాడుకోవడం పూర్వం మన దేశంలోని చాలా ప్రాంతాల్లో వాడుకలో ఉండేది. వీటితోపాటు సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరితో కూడా చక్కని పాలు, పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని నిక్షేపంగా వాడుకోవచ్చు.  పశువుల మాంసం, పశువుల పాలకు బదులుగా ఈ పాలతో తయారు చేసిన పెరుగును, మజ్జిగను వాడుతూ ఉంటే బి 12 విటమిన్‌ లోపం రాదు. వచ్చినా కొద్ది వారాల్లో పోతుంది.పర్యావరణ దృక్కోణంలో చూసినా కూడా ఇదే సబబైన దారి. 

బి 12తోపాటు కాల్షియం కూడా..
నువ్వులు, రాగుల పాల ద్వారా బి 12తోపాటు మన దేహానికి అవసరమైనంత మేరకు కాల్షియం కూడా లభిస్తుంది. పశువుల పాలలో కన్నా నువ్వుల పాలతో తయారైన పెరుగు/మజ్జిగలో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంది. నువ్వుల పాల పెరుగు అందుబాటులో లేకపోతే వారానికి ఒక నువ్వు లడ్డు తిన్నా లేదా వారానికి రెండు చెంచాల దోరగా వేపిన నువ్వులు తిన్నా పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరికైనా కాల్షియం లోపం దరిచేరదు. లోపం ఉంటే కొద్దివారాల్లోనే తగినంత సమకూరుతుంది. 

నేరుగా కాయకూడదు
 నూనె గింజలు, చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరితో తయారు చేసుకునే పాలలో సాధారణ పశువుల పాలలో మాదిరిగా కొవ్వు ఎక్కువగా ఉండదు. అందువల్ల వీటిని గిన్నెలో పోసి నేరుగా పొయ్యి మీద కాయకూడదు. నురగ వచ్చి పొంగవు. అలా చేస్తే ఇరిగిపోతాయి. పొయ్యి మీద గిన్నెలో నీరు పోసి మరిగిస్తూ ఆ నీటిలో ఈ పాల గిన్నెను ఉంచి వేడిచేయాలి. గోరు వెచ్చగా కాగితే చాలు. మొదట్లో సాధారణ పెరుగు/మజ్జిగతోనే తోడు వేసుకోవాలి. అలా గింజల పాల ద్వారా తయారైన పెరుగు/మజ్జిగతోనే తోడు వేస్తూ ఉంటే కొన్నాళ్లకు పూర్తిగా ఈ పెరుగే సిద్ధమవుతుంది. పశువుల పాలు/పెరుగు/మజ్జిగకు బదులు నూనెగింజలు, చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరి పెరుగు/మజ్జిగను తీసుకోవటం ఉత్తమం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా నిశ్చింతగా వీటిని తాగవచ్చు. కుసుమ, వేరుశనగ, నువ్వులు, సజ్జలు, జొన్నలు, పచ్చి కొబ్బరిలలో మీకు ఏవి అందుబాటులో ఉంటే లేక ఏవి నచ్చితే వాటిని ఉపయోగించి పాలు తయారు చేసుకొని పెరుగు/మజ్జిగ చేసుకొని వాడుకోవచ్చు. ఒకే రకం పాలతో చేసిన పెరుగు/మజ్జిగ దీర్ఘకాలం పాటు నిరంతరాయంగా వాడకుండా ఉంటే మంచిది. వారానికి ఒక రకం తీసుకుంటే బాగుంటుంది. మీ నోట్లోకి వెళ్లే ప్రతి ముద్దా, ప్రతి నీటి చుక్కా సరైనదైతే.. సంపూర్ణ ఆరోగ్య    వంతులవ్వడానికి     ఏ ఔషధమూ       అక్కర్లేదు. ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు. దేశీయ ఆహారమే నిజమైన దివ్యౌషధం. ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం. అందరమూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుదాం. ఎలుగెత్తి చాటుదాం!
– డాక్టర్‌ ఖాదర్‌ వలి,   స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త, మైసూరు

ఎండిన పుట్టగొడుగుల్లో పుష్కలంగా విటమిన్‌ డి!
ఎండ వేళ ఆరుబయట తిరిగే అవకాశం లేని వారికి కాలక్రమంలో విటమిన్‌ డి లోపం వస్తుంటుంది.  ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాల ఉద్యోగులు, బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లలో నివసించే వారిలో కూడా కొందరికి అసలు ఎండ పొడ సోకని పరిస్థితి ఉంటుంది. ఇటీవల కాలంలో విటమిన్‌ డి లోపాన్ని ఖరీదైన మాత్రల ద్వారా తగ్గించుకోవచ్చన్న ప్రచారం సాగుతోంది.  నిజానికి, ఎటువంటి మందులూ అవసరం లేదు. పుట్టగొడుగులను ఎండబెట్టి వంట చేసుకొని తినటం ద్వారా విటమిన్‌ డి లోపం రాకుండా చూసుకోవచ్చు.  పుట్టగొడుగుల్లో ఎర్గోస్టెరాల్‌ అనే పదార్థం ఉంటుంది. ఎండ తగిలినప్పుడు విటమిన్‌ డిగా మారుతుంది. అందువల్ల వారానికి రెండు, మూడుసార్లు ఎండు పుట్టగొడుగులు తింటూ ఉంటే కొన్ని వారాల్లో  విటమిన్‌ డి లోపాన్ని అధిగమించవచ్చు. తాజా పుట్టగొడుగులను 3 గంటల పాటు ఎండబెట్టి, అదేరోజు కూర వండుకొని తినవచ్చు లేదా సూప్‌ చేసుకొని తాగవచ్చు. మరో పద్ధతి ఏమిటంటే.. పుట్టగొడుగులను 3–4 రోజులు ఎండలో పెట్టి పూర్తిగా ఒరుగుల మాదిరిగా చేసుకొని, గాజు సీసాల్లో నిల్వ చేసుకొని.. తదనంతరం అవసరమైనప్పుడు వాడుకోవడం. ఎండిన పుట్టగొడుగులను నీటిలో నానబెట్టి, తర్వాత కూర వండుకోవచ్చు.  లేదా బాగా ఉడకబెట్టి జావ మాదిరిగా చేసుకొని తాగవచ్చు. ఏదో ఒక విధంగా?? రోజు మార్చి రోజు ఒకసారైనా ఎండు పుట్టగొడుగులు తింటూ ఉంటే..  3 నెలల్లో విటమిన్‌ లోపాన్ని ఎటువంటి మందులూ వాడకుండానే అధిగమించవచ్చు. ఇప్పటికే లోపం వచ్చినా లోపాన్ని పూడ్చుకోవడానికి నిస్సందేహంగా ఆస్కారం ఉంది. ఎండలోకి వెళ్లే అవకాశం ఉన్న వారు కూడా బయటకు వెళ్లకపోవడం వల్ల కూడా విటమిన్‌ డి లోపానికి గురవుతూ ఉంటారు. అటువంటి వారు ఖాళీ ఉన్నప్పుడల్లా వీలైనప్పుడల్లా ఎండలో నడవటం ద్వారా విటమిన్‌ డి లోపాన్ని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎండలో నడుస్తూ ఉంటే 3 నెలల్లో సమస్య తీరిపోతుంది. కనీసం వారానికి ఒక రోజు వంటికి నువ్వుల/కొబ్బరి నూనె రాసుకొని ఎండలో కొద్దిసేపు నిలబడినా కొద్ది వారాల్లో విటమిన్‌ డి లోపం తీరిపోతుంది. 

రాతి రోలులో రుబ్బి పాలు తయారు చేసుకునే పద్ధతి 
ఈ నూనెగింజలు/చిరుధాన్యాలను కనీసం 7, 8 గంటలు లేదా రాత్రి నానబెట్టి పొద్దున రాతి రుబ్బు రోలులో కొంచెం కొంచెం నీరు కలుపుతూ పొత్రంతో రుబ్బుతూ.. ఆ పిండిని పల్చని గుడ్డలోకి తోడుకొని పిండితే పాలు వస్తాయి. మిక్సీలో వేస్తే పాలు రావు. మోటారుతో నడిచే వెట్‌ గ్రైండర్‌ను వాడుకోవచ్చు. ఆ పిండిని మళ్లీ రోట్లో వేసి కొంచెం నీరు పోసి రుబ్బుతూ.. మళ్లీ పిండుకోవాలి. ఇలా అనేక సార్లు చేయడం ద్వారా వంద గ్రాముల నూనెగింజలు/చిరుధాన్యాలతో కనీసం లీటరు వరకు పాలు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పాలను తోడు వేసి పెరుగు/మజ్జిగ చేసుకొని ఉదయం, సాయంత్రం గ్లాసు తీసుకున్నట్లయితే మందుబిళ్లల ద్వారా కన్నా ఎక్కువ మోతాదులో బి 12 మనకు అందుతుంది. 

మాంసాహారంతో హార్మోన్‌ అసమతుల్యత
మనిషి దేహం మాంసాహారం భుజించడానికి అనువుగా నిర్మితమైనది కాదన్న వాస్తవాన్ని ప్రపంచం నెమ్మదిగా గుర్తిస్తోంది. మాంసాహారం కలిగించే హార్మోన్ల అసమతుల్యత వల్ల మనిషి దేహంలో జీవక్రియలు అస్తవ్యస్తమై అనేక అనారోగ్యాలు వస్తున్నాయన్న చైతన్యం కూడా పెరుగుతోంది. పారిశ్రామిక ప్రక్రియలతో అతి తక్కువ రోజుల్లోనే అధిక పరిమాణంలో మాంసం, గుడ్లు ఉత్పత్తి చేయడానికి కోళ్లు, వివిధ జంతువులకు తినిపించే కృతకమైన పదార్థాలు, అందులో కలిపే రసాయనాలు, గ్రోత్‌ హార్మోన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్‌ ఔషధాలు.. అన్నీ గుడ్లు, మాంసాన్ని అనేక రసాయనాల కుప్పగా మార్చుతున్నాయని అర్థం చేసుకోవాలి. దీనినే జైవిక్‌ సాంద్రీకరణ (బయో కాన్సంట్రేషన్‌) అంటారు.  

మాంసాహారం తిన్న వారి దేహాల్లో పోగుపడే రసాయనిక అవశేషాలు, కల్మషాలు వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఒక కిలో మాంసం ఉత్పత్తి చేయడానికి ఇటువంటి 8 కిలోల ఆహార ధాన్యాలను పశువులకు మేప వలసి వస్తున్నది. అంటే, 8 కిలోల ధాన్యాలను తిన్నప్పుడు కలిగే హాని కిలో మాంసంతోనే కలుగుతోంది.  మరోవైపు పారిశ్రామిక, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో అడ్డూ అదుపూ లేకుండా రసాయనిక కలుపు మందులు, ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. దీని అర్థం ఏమిటంటే.. ఈ ధాన్యాలను తిని ఆకలి తీర్చుకునే వారికన్నా మాంసం, గుడ్లు తిని ఆకలి తీర్చుకునే మనుషుల దేహాల్లోకి విష రసాయనాల అవశేషాలు 8 రెట్లు ఎక్కువగా చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వనరులను మాంసాహారుల కన్నా శాకాహారులు చాలా పొదుపుగా వాడుతున్నారని మనం గ్రహించాలి.  వాతావరణంలోకి అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాల విడుదలకు కారణభూతమవుతున్న అన్ని రకాల మాంసం, గుడ్ల ఉత్పత్తిని తగ్గించుకుంటేనే భూతాపాన్ని కొంతమేరకైనా తగ్గించగలుగుతాం.కిలో వరి బియ్యం ఉత్పత్తి చేయడానికి 8 వేల లీటర్ల నీరు ఖర్చవుతోంది. కిలో కొర్ర, అరిక వంటి సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తికి కేవలం 300 లీటర్ల నీరు సరిపోతుంది. వరి తినటం, పండించడం మాని సిరిధాన్యాల వైపు కదలితే ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుంది. ప్రకృతి వనరుల వృథా తగ్గిపోతుంది. ఆ మేరకు ఉద్గారాలతోపాటు భూతాపమూ తగ్గుతుంది. ఏ విటమిన్‌ను అయినా టాబ్లెట్లు, ఇంజక్షన్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకుంటేనే సరిగ్గా ఒంటికి పడుతుంది.  విటమిన్లు ఆహారంలో ఇమిడి ఉంటేనే దేహం సజావుగా గ్రహించగలుగుతుంది. 
– డాక్టర్‌ ఖాదర్‌ వలి 

మరిన్ని వార్తలు