విటమిన్-డి సప్లిమెంట్స్‌తో గుండెకు మేలు..!

16 May, 2016 01:24 IST|Sakshi
విటమిన్-డి సప్లిమెంట్స్‌తో గుండెకు మేలు..!

పరి పరిశోధన
గుండె పనితీరు సరిగా లేని ‘హార్ట్ ఫెయిల్యూర్’ రోగులకు విటమిన్-డి సప్లిమెంట్స్ ఇవ్వడం... వాళ్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుందని ఒక బ్రిటిష్ అధ్యయనంలో తేలింది. ‘హార్ట్ ఫెయిల్యూర్’ సమస్య తలెత్తిన కొందరిని బ్రిటన్‌కు చెందిన నిపుణులు ఎంపిక చేసుకున్నారు. వీళ్లలో బీటాబ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటార్స్ వంటి మందులు వాడతున్నవారు కొందరు ఉన్నారు. మరికొందరు తమ శరీరంలో పేస్‌మేకర్ వంటి పరికరాన్ని తమ అమర్చుకున్నవారు. వీళ్లలో సగం మందికి డాక్టర్లు విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు.

మిగతా సగానికి కేవలం రోగి సంతృప్తి కోసం వాడేందుకు ఉపయోగించే మందులేని టాబ్లెట్లను ఇచ్చారు. ఇలా రోగి సంతృప్తి కోసం మాత్రమే ఇచ్చే మందు లేని టాబ్లెట్స్‌ను ‘ప్లాసెబో పిల్స్’ అంటారు. వాటిని రోజుకు ఒకసారి చొప్పున ఏడాది పాటు వాడారు. ఏడాది తర్వాత వాళ్లకు గుండెకు సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష నిర్వహించారు. విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చిన వారిలో గుండె పనితీరు 26 శాతం నుంచి 34 శాతం మెరుగయ్యిందని ఆ పరీక్షల్లో తేలింది. ‘‘గుండె పనితీరు మరింత దిగజారిపోయి ‘ఇంప్లాంటబుల్ కార్డియోవాస్క్యులార్ డీ-ఫిబ్రిలేటర్(ఐసీడీ)’ వంటి ఉపకరణాలను వాడాల్సిన పరిస్థితిని విటమిన్-డి3 సప్లిమెంట్స్ నివారించాయి’’ అని అధ్యయన ఫలితాలను వెల్లడించిన నిపుణులు వెల్లడించారు.

‘‘ఐసీడీ ఇంప్లాంట్స్ వాడటం ఖర్చుతో కూడిన పని. పైగా ఆపరేషన్ అవసరం. విటమిన్-డి సప్లిమెంట్స్ ఆ పరిస్థితిని నివారించాయంటే... ఆ మేరకు రోగులకు కలిసి వచ్చినట్టే కదా’’ అని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ఇటీవల అమెరికాలోని షికాగోలో  నిర్వహించిన 65వ వార్షిక సదస్సులో (ఏన్యువల్ సైంటిఫిక్ సెషన్‌లో) బ్రిటన్‌కు చెందిన అధ్యయనవేత్తలు తెలిపారు.

మరిన్ని వార్తలు