విత్వానికి ఇదొక బుక్

20 Mar, 2014 03:09 IST|Sakshi
విత్వానికి ఇదొక బుక్

 అక్షరాల కూర్పులోని అందమైన భావన అంటే అది అమ్మను ఆకట్టుకోవడానికి చిన్నారి చేసే కేరింత లాంటిది... అలా అందమైన భావననిచ్చే అక్షరాల పొందికే కవిత. అలాంటి భావవ్యక్తీకరణకు అవకాశాన్ని ఇచ్చే సందర్భాలు ప్రతి జీవితంలో ఉండేవే. మరి అత్యంత సహజమైన ఈ ప్రక్రియకు నేడు సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లు ఎంతో సాయంగా నిలుస్తున్నాయి.


యువతకు అత్యంత ఇష్టమైనవిగా మారిన ఫేస్‌బుక్, బ్లాగుల్లో కవిత్వం రయ్‌మంటూ దూసుకెళ్తోంది. సెల్ఫ్ బ్రాడ్ కాస్టింగ్ మీడియా అనద గ్గ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో సృజనాత్మకతను సులభంగా చాటుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, అస్తిత్వవాద కవిత్వం... ఏదైనా సరే, మదిలో మెదిలే ఆలోచనలను మనసు మాటలుగా మార్చేస్తున్నారు అనేక మంది.
 అనేక పేజ్‌లున్నాయి...
 
తరచి చూడాలి కానీ ఫేస్‌బుక్‌లో తెలుగు కవితల కూర్పుగా ఉండే పేజ్‌లు ఎన్నో కనిపిస్తాయి. ప్రతి దాంట్లోనూ అనేక మంది సృజించిన కవిత్వం కనిపిస్తుంది. ‘తెలుగు కవితలు’ అనే పేరుతో ఉన్న పేజ్‌లే లెక్కకు మించి ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒక్కోపేజ్‌కూ కనీసం ఏడెనిమిది వేల మంది సబ్‌స్క్రైబర్లు కనిపిస్తూ ఉంటారు. అలాంటి పేజ్‌లలో పబ్లిష్ చేసే కవిత్వానికి వచ్చే లైకులూ, షేర్‌లే వాటి ఆదరణకు రుజువులు.

 కాదేదీ కవిత్వానికనర్హం..!

 అక్షరాల విత్తులు నాటి, ఊహలతో వ్యవసాయం చేసి, పదముల పూవుల పూయించి... కట్టేదే కవితల మాల. ఈ విషయంలో చెలి అధరాల తడిముద్రల నుంచి భువిని ముద్దాడే వానచినుకుల వరకూ కాదేదీ కవిత్వానికి అనర్హమైనది అంటోంది నయా జనరేషన్. అలాగే తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ నుంచి తెలుగు భాషను సుసంపన్నం చేసిన ప్రముఖ కవులపై అభిమానాన్ని ప్రకటించుకోవడానికి కూడా ఫేస్‌బుక్ మంచి మాధ్యమంగా ఉపయోగపడుతోంది.

మరిన్ని వార్తలు