మనసులు దోసేశాడు

23 Nov, 2019 04:47 IST|Sakshi

ఫుడ్‌ ప్రింట్స్‌

ఒక్క నిముషం కూడా తీరిక లేకుండా (ఇంటర్వ్యూ చేసే సమయంలో సాక్షితో మాట్లాడేంత సమయం కూడా ఇవ్వలేదు) ఇడ్లీ–దోశల తయారీలో బిజీగా ఉన్నారు గోవింద్‌. మీ దోసెలో ప్రత్యేకత ఏంటి?’ అని అడిగితే, ‘మీరే తిని చూడండి! అర్థమవుతుంది’ అంటూ నవ్వుతూ తల తిప్పకుండా, అవలీలగా దోసె వేసేసి, దాని మీద పల్చగా ఉండే ఉప్మా వేసి, ఆ పైన, ఉల్లి తరుగు, బటర్‌ వేస్తారు, చివరగా మసాలా కారం జల్లి. బటర్‌ను బాగా కరిగిస్తూ, ఉప్మా కారం మసాలాలు దోసె అంతా పట్టేలా చేస్తారు. ఆ తరవాత మళ్లీ ఉల్లి తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర చల్లుతాడు. చివరగా చీజ్‌ వేస్తారు.

దానిని కూడా కరిగించి, బాగా కరకరలాడే దోసె తయారుచేసి, వేడివేడిగా అందిస్తారు గోవింద్‌.ఈ రుచి కోసం ఉదయాన్నే పెద్ద క్యూ సిద్ధమవుతుంది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌజ్‌ దగ్గర గత 30 ఏళ్లుగా వినియోగదారులకు వివిధ రకాల రుచులను అందిస్తున్నారు. ప్రధాన రోడ్డులోని చౌరస్తా దగ్గర రోడ్డు పక్కన బండిపై తన కుటుంబ సభ్యులతో కలిసి గోవింద్‌ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వాళ్లు గోవింద్‌ను ఆప్యాయంగా భాయ్‌..భాయ్‌ అంటూ పలకరిస్తుండడంతో...గోవింద్‌ కాస్తా...గోవింద్‌ భాయ్‌గా మారిపోయారు.

ఈ ఘుమఘుమల ప్రక్రియ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సాగుతూనే ఉంటుంది. దోసెలు మాత్రమే కాదు, ఆ పక్కనే తాజాగా ఇడ్లీ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. గోవింద్‌ వేసే దోసె ఆహారప్రియుల నోరూరిస్తుంది. తన చుట్టూ నిరీక్షిస్తున్న కస్టమర్ల విన్నపాలు వింటూ, వాటికి అనుగుణంగా ఫలహారాలు తయారు చేయడంలో తలమునకలైనా, ఆ ముఖంలో ఒత్తిడి కనపడదు. దోసె, ఇడ్లీ, వడ, ఫ్రైడ్‌ ఇడ్లీలతోపాటు అక్కడ ప్రత్యేకంగా లభించే చట్నీ కోసం ఎంతసేపైనా వేచి చూస్తారు కస్టమర్లు.

అందరికీ గోవింద్‌ భాయ్‌
దోసె వేసిన తరవాత, పైన వేసే చీజ్, బటర్, ఉల్లి తరుగు, ఆలుగడ్డ, టొమాటో, రహస్యంగా తయారుచేసుకున్న మసాలాలు, చీజ్‌... ఇవన్నీ దోసెను కమ్మేస్తుంటే, ఆ దోసెలు రంగురంగుల సీతాకోకచిలుకల్లా ప్లేట్లలోకి ఎగిరి వస్తుంటాయి. కరిగించిన బటర్‌ వేయడం వల్ల, టొమాటో ముక్కలు మెత్తబడి, రుచికరంగా తయారవుతుంది దోసె. ఇలా తయారైన దోసెను ఆకు మీదకు తీసి, ఆ ఆకును పేపర్‌ మీద ఉంచి అందిస్తారు. అది నోట్లో పెట్టుకోగానే అమృతం సేవించినట్లు అనుభూతి చెంది ‘జై గోవిందా!’ అనకుండా ఉండలేరు. ఒకేసారి ఎనిమిది దోసెలు వేస్తారు గోవింద్‌ భాయ్‌.
– పిల్లి రాంచందర్, సాక్షి చార్మినార్, హైదరాబాద్‌

స్వయం కృషితో....
మా నాన్న పేరు రాఘవులు. మాది పేద కుటుంబం. మేం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్న నర్సింహం గుల్జార్‌హౌజ్‌ ఆగ్రా హోటల్‌ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌ మీద బండి పెట్టి, ఇడ్లీ–దోసె తయారు చేయడం ప్రారంభించారు. ఆయన దగ్గర మేమందరం పని చేసాం. ఆయన స్ఫూర్తితో 1990లో సొంతంగా ఇడ్లీ బండి పెట్టి, వ్యాపారం మొదలుపెట్టాను. వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన నా వ్యాపారం బాగా ఎదిగింది. నాకు మంచి ఆదాయం వస్తుండటంతో, మా పిల్లలను చదివించుకుంటున్నాను. కష్టపడి పని చేస్తే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడితే నలుగురికీ ఆదర్శంగా ఉంటారు.
– గోవింద్‌ భాయ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా