అసహాయులకు అండ

22 May, 2014 22:14 IST|Sakshi

సాయాల్లో బోలెడు రకాలుంటాయి. ఒక్కోసారి ‘మాట’ చేసినంత సాయం మరేదీ చేయకపోవచ్చు. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన ఓ లా స్టూడెంట్ ఓ వేదికను ఏర్పాటు చేశాడు. దానికి ‘న్యాయ సహాయ’ అని పేరు పెట్టాడు.  ‘వినడానికి పేరు, ఆలోచన చాలా బాగున్నాయి. కానీ ఆచరణలో  మనమెంతవరకూ ‘న్యాయం’ చేయగలం’ అని మొదట సందేహించిన అతని తల్లి చివరకు బిడ్డ మాటను కాదనకుండా తన వంతు సేవకు సిద్ధ్దపడింది. తనలాంటి మరో నలుగురు సేవాభావం కలిగిన లాయర్లను సభ్యులుగా మార్చి, ‘న్యాయ సహాయ’ ద్వారా పేదలకు ఉచితంగా న్యాయ సలహాలిస్తూ  చిన్న ‘మాట’ సాయం చేస్తోంది.
 
ఐలయ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో మేస్త్రీ పని చేసుకుంటూ భార్యాబిడ్డల్ని షించుకుంటున్నాడు. నాలుగంతస్తుల అపార్డుమెంటు పని సగం పూర్తయింది. ఒకరోజు ఐలయ్య స్లాబ్ పనిచేస్తుండగా ఉన్నట్టుండి పైకప్పు కూలి మీద పడింది. పనివాళ్లంతా కలిసి ఆసుపత్రిలో చేర్పించారు. మెదడుకి బలమైన గాయమైంది. కుడి కన్ను పూర్తిగా పోయింది. కుడి చేయి, కాలు పనిచేయడం మానేశాయి. ఆరునెలలు ఆసుపత్రిలో ఉండి వైద్యం చేయించారు. తనకు సంబంధం లేదన్న యజమానిపై కేసు పెట్టాడు ఐలయ్య. యజమాని తన ‘బలాన్ని’ చూపించి అందరి నోరూ మూయించాడు.

ఐలయ్య వెళ్లి అడిగితే ‘ఏవో నాలుగు రూపాయిలిస్తాను... సరిపెట్టుకో’ అన్నాడు. చదువు లేని పేదవాడు ఏం చేస్తాడు! అంతా తన కర్మ అనుకుని భార్య సంపాదనతో నాలుగు ముద్దలు తింటూ పదేళ్ల వయసు పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇంతలో ఎవరో ఐలయ్యకు ‘న్యాయ సహాయ’ గురించి చెప్పారు.
 
‘‘ఐలయ్యకు జరిగిన అన్యాయం గురించి విన్నాక చాలా బాధ కలిగింది. ఏడుస్తూ...‘‘అమ్మా... మీరైనా నాకు న్యాయం చేయండమ్మా... ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. వారిని మంచి చదువులు చదివించుకుందామనుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి వారికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకుండైంది’’ అని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా అతనికి ముందు లీగల్ కౌన్సెలింగ్ ఇచ్చి వెంటనే లేబర్ కమిషనర్ దగ్గర కేసు పెట్టించాను. ప్రస్తుతం కేసు నడుస్తోంది. చట్ట ప్రకారం అతని యజమాని 15 నుంచి 20 లక్షలరూపాయల నష్ట పరిహారం చెల్లించాలి.

ఇలాంటి కేసుల్లో బాధితుడి వయసు, సంపాదన, అతనిపై ఆధారపడ్డ వాళ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని యజమానులతో కోర్టు నష్ట పరిహారం ఇప్పిస్తుంది. ఐలయ్య కేసు గెలిచే వరకూ అతనికి తగిన సలహాలిస్తూ ముందుకు నడిపించే బాధ్యత మాది’’ అని చెప్పారు లాయర్ రాజశ్రీ. కొడుకు చెప్పిన ‘న్యాయ సహాయ’ ఆలోచనను ఆచరణలో పెట్టిన తల్లి ఆమె. ‘న్యాయ సహాయ’ వేదికను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ కుర్రాడి పేరు లింగం శెట్టి పారు.్థ  ప్రస్తుతం ఇతను ఒరిస్సాలో నేషనల్ లా యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

అతనికి అండగా నిలిచిన అమ్మ రాజశ్రీ తనతోటి వారితో కూడా ‘న్యాయ సహాయ’ గురించి చర్చించి మరో నలుగురిని సభ్యులుగా చేర్చుకున్నారు. ‘‘నాతో పాటు కల్లూరి గీత, ఎల్. స్వర్ణలత, సి. పద్మజ, ఎన్. నర్సింహారావు ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రారంభించింది కరీంనగర్‌లోనైనా మాకు హైదరాబాద్‌లో కూడా లాయర్లసాయం ఉంది. వీరితో పాటు పార్థు, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొందరు లా విద్యార్థులు కూడా మాకు అండగా ఉన్నారు’’ అని చెప్పారు రాజశ్రీ.
 
నిందితుల తరఫున...

‘న్యాయ సహాయ’ ఏర్పాటుకి పార్థుని కదిలించిన విషయం మన రాష్ట్రంలో వేల   సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్న నిందితుల సంఖ్య. వీరిలో చాలామంది కేవలం ఆరోపణలు ఎదుర్కొంటూనే నెలల తరబడి కటకటాల వెనక ఉండిపోతున్నారు. వీరి కోసం కూడా ‘న్యాయ సహాయ’ పనిచేస్తోంది. ‘‘ఇప్పటి వరకూ ఏడుగురు నిందితులకు బెయిల్ ఇప్పించాం. చాలామంది నిందితులకు నా అన్నవాళ్లు ఉండరు. అలాంటి కేసులకు సంబంధించి పోలీసులే కమ్యూనికేషన్ బాధ్యత తీసుకోవాలి. అన్నిచోట్లా అది అమలు కాదు. దీంతో చాలామంది బెయిల్‌ని పొందే హక్కుని కోల్పోతున్నారు. దీనికోసం మేం జైళ్లకు వెళ్లి కేసుల్ని పరిశీలించి అవసరమైనవారికి బెయిల్ ఇప్పించే పని కూడా చేస్తున్నాం’’ అని చెప్పారు మరో లా స్టూడెంట్ పి. దినేశ్.
 
తప్పుదోవ పట్టించే కొందరున్న ఈ ప్రపంచంలో తప్పొప్పులు చెప్పి న్యాయ మార్గంలో నడిపించే న్యాయవాదులు కూడా ఉన్నారు. ‘‘ మేం ‘మాట‘ సాయం చేయడం న్యాయమే కాదు ధర్మం కూడా’’ అంటున్నారు రాజశ్రీ. న్యాయం కోసం పోరాడే వృత్తిలో ఉన్న లాయర్లలో మరింత మంది ఈ ధర్మానికి నిలబడితే సామాన్యుడికే కాదు, సమాజానికీ అదే పెద్ద సాయం!
 

మరిన్ని వార్తలు