అంతా ఉత్తుత్తిదే!

18 Apr, 2014 23:30 IST|Sakshi
అంతా ఉత్తుత్తిదే!
  •  అవన్నీ నిజం ఫైట్స్ కాదు
  •    డబ్ల్యూడబ్ల్యూఈ ఓ టీవీ సీరియల్
  •  దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో కొత్తగా కేబుల్ ప్రసారాలు ప్రారంభమైన రోజులవి... స్పోర్ట్స్ చానల్‌లో వచ్చే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిల్లల్ని కట్టిపడేసింది. బయట ఆటలకు కూడా పోకుండా టీవీలకు అతుక్కునేలా చేసింది. ఇద్దరు బలమైన వ్యక్తులు ఒకరినొకరు భయంకరంగా రక్తం వచ్చేలా కొట్టుకునేవాళ్లు. దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పేరు మార్చుకుని డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది. అప్పట్లో టీవీలకు అతుక్కుని దీనిని చూసిన వాళ్లు... ఇప్పుడు తమ పిల్లలు దీనిని చూస్తుంటే రిమోట్ ఇచ్చేస్తున్నారు. చూసే తరాలు మారినా వినోదం అలాగే ఉంది. అయితే ఇది నిజమైన యుద్ధం కాదని, కేవలం స్క్రిప్ట్ ప్రకారం సాగే ఓ సీరియల్ మాత్రమే అని తెలిసిన వాళ్లు తక్కువే.
     - శ్యామ్ తిరుక్కోవళ్లూరు
     
    ‘కుస్తీ’... భారతీయులకు పెద్దగా పరిచయం అక్కర్లేని క్రీడ. కండలు తిరిగిన వస్తాదులు పోటీపడుతుంటే ఆసక్తిగా చూసే వాళ్లకు కొదువే ఉండదు. అంతర్జాతీయంగా దీన్ని రెజ్లింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒలింపిక్స్‌లో కూడా క్రీడాంశమే. ఈ రెజ్లింగ్‌కు కాస్త గ్లామర్ జోడిస్తే అదే డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల రెజ్లర్లు డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటారు. ఈ రెజ్లింగ్‌ను అభిమానించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్నారు. అయితే ఇది అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఆ ఆటలోని ప్రత్యేకత. కండలు తిరిగిన రెజ్లర్లు ప్రత్యర్థిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టడమే ఈ రెజ్లింగ్. రకరకాల ఫీట్లు ఈ రెజ్లింగ్‌కు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. రెజ్లింగ్‌ను టీవీల్లో చూసిన వాళ్లకు ఇలా కొట్టుకుంటే ఎవరైనా బతుకుతారా అనే సందేహం రాక మానదు.. అలా ఉంటాయి ఫీట్లు.
         
    స్టోరీ-స్క్రీన్‌ప్లే-డెరైక్షన్...
     
    ఒళ్లు గగుర్పొడిచే ఈ ఫీట్లు చేస్తే ఎవరైనా కచ్చితంగా ఆస్పత్రి పాలు కావాల్సిందే . కానీ ఈ రెజ్లర్లకు మాత్రం సాధారణంగా ఏమీ కాదు. ఇందుకు కారణం ఇదంతా డ్రామానే. ఒకడు కొడుతుంటాడు.. ఇంకొకడు చేష్టలుడిగిపోయి దెబ్బతింటుంటాడు... మనకు కనిపించేది అంతవరకే. కానీ అదంతా తూచ్. డబ్ల్యూడబ్ల్యూఈ అంతా నటన. రెజ్లింగ్‌ను వినోదాత్మకంగా చూపించడమే దీని పని. స్క్రిప్ట్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. ఎలా ఆడాలి.. ఎలా రక్తికట్టించాలి.. అన్నదే ఇందులో ప్రధానం. అయితే ఇదంతా నిజం అని భ్రమ కల్పించేలా ఫీట్లు ఉంటాయి. అవి అంతవరకే నిజం.
     

    నిజానికి ఈ రెజ్లింగ్ మ్యాచ్‌లు అచ్చం సినిమాల్లో కథలా, టీవీల్లో సీరియల్‌లా సాగుతాయి. కథనంతో మ్యాచ్‌లను రక్తికట్టిస్తారు.. ఎప్పుడూ ఒకేలా పోటీలు జరిగితే ఎవరికీ ఆసక్తి ఉండదు. అందుకే శృంగార సంబంధాలు, ఒకడి లవర్‌ను మరొకడు ఎత్తుకెళ్లడం, ముక్కోణపు ప్రేమ కథలు, పెళ్లిళ్లు, ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడం, జాతి వివక్ష, కిడ్నాప్‌లు... ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది.
     
    ఒక్కసారి డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ చూస్తే ఇందులో ఎంత డ్రామా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.‘డబ్ల్యూడబ్ల్యూఈలో ట్రిపుల్ హెచ్ స్టార్ రెజ్లర్.. అతనికో గర్ల్‌ఫ్రెండ్ ఉంది. పేరు స్టెపనీ మెక్‌మహోన్. తోటి రెజ్లర్ (డానియల్ బ్రయాన్) ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఈవిషయాన్ని స్టెపనీ, ట్రిపుల్ హెచ్ దగ్గర మొర పెట్టుకుంటుంది. ఎందుకిలా చేశావంటూ అతను బ్రయాన్‌ను నిలదీస్తాడు. అయితే అనుచితంగా ప్రవర్తించిన బ్రయాన్‌ను చితక్కొడతాడని ఆమె అనుకుంటుంది. కానీ ట్రిపుల్ హెచ్ ఏమీ చేయకపోవడంతో స్టెపనీ, సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తుంది. వాళ్లొచ్చి అతని చేతికి బేడీలు వేస్తారు. నీవేమీ చేయలేకపోయావంటూ ట్రిపుల్‌హెచ్‌పై మండిపడుతుంది. దీంతో అతనికి ఎక్కడా లేని కోపం వస్తుంది. బేడీలతో ఉన్న బ్రయాన్‌ను ట్రిపుల్ హెచ్ చితక్కొట్టేస్తాడు. అంతేకాదు ఆమెతో కూడా  కొట్టిస్తాడు. మొత్తానికి తగినశాస్తి జరిగిందంటూ స్టెపనీ తెగ సంబరపడిపోతుంది. చివరికి బ్రయాన్‌ను మ్యాచ్‌లో ఓడించడంతో ఆ ఆనందంలో ట్రిపుల్ హెచ్‌ను ముద్దాడుతుంది. ఇలా ప్రతీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసేలా ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారు. సాధారణంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్ మ్యాచ్‌లు ఇలా జరగవు. ఉత్తుత్తి మ్యాచ్‌లు కాబట్టే ఇలా సీరియల్‌లా రక్తికట్టిస్తారు.
         
    సూపర్ టెక్నిక్స్...
     
    సాధారణంగా రెజ్లింగ్ క్రీడ యుక్తితో కూడుకున్నది. ప్రత్యర్థిని మట్టికరిపించాలంటే బలమొక్కటే సరిపోదు. యుక్తి కూడా ప్రధానం. దీంతో పాటు వేగం, చురుకుదనం రెజ్లింగ్‌లో విజేతను నిర్ణయిస్తాయి.  బలంతో కొట్టలేని రెజ్లర్లు ప్రత్యర్థిని టెక్నిక్‌తో చిత్తు చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం పోటీలు జరిగినా...ప్రేక్షకులను ఆకట్టుకునేవి రెజ్లింగ్ టెక్నిక్‌లే. ఈ రెజ్లింగ్‌లో లెక్కలేనన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. ఇవే అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. డైవింగ్ బుల్‌డాగ్, డైవింగ్ హెడ్‌బట్, డైవింగ్ షోల్డర్ బ్లాక్, ఫ్లయింగ్ నెక్ బ్రేకర్, ఫ్లయింగ్ స్పైనంగ్ హీల్ కిక్, సూసైడ్ డైవ్, ప్లాంచా, రోప్ వాక్, సోమర్‌సాల్ట్, సూపర్ ప్లెక్స్, పవర్ బాంబ్స్, ఫ్రాగ్ స్ప్లాష్, సెన్టెన్ బాంబ్, సీటెడ్ సెన్టెన్ బై సైకిల్ కిక్, సూపర్ కిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆటలో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు చాలా టెక్నిక్‌లే ఉన్నాయి. అయితే వీటిలో చాలా టెక్నిక్‌లు ప్రమాదకరమైనవి. అందుకే వీటిని ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అప్పుడప్పుడు అనుకోని ప్రమా దాలు జరుగుతాయి.  రిస్క్‌తో కూడిన టెక్నిక్‌లను ప్రదర్శించడం ద్వారా  రెజ్లర్లు ప్రమాదాల బారిన పడిన సందర్భాలున్నాయి.
     
     మనోడూ ఉన్నాడు


     రాక్, అండర్‌టేకర్, ట్రిపుల్ హెచ్, కేన్, రికిషి, క్రిస్ బెనాయిట్, స్టోన్ కోల్డ్, రాండీ ఆర్టన్, జాన్ సెనా, క్రిస్ జెరికో...ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఈ స్టార్స్ జాబితాలో భారతదేశానికి చెందిన ఓ రెజ్లర్‌కూడా ఉన్నాడు. పేరు... దలిప్ సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ ఖలీ. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఖలీ ఎనిమిదేళ్లుగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆకట్టుకుంటున్నాడు. ఏడు అడుగుల 1 అంగుళం పొడుగు ఉండే ఈ భారీకాయుడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నట్లు ఖలీ రెజ్లింగ్ పాపులారిటీతో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టే కంటే ముందే ద లాంగెస్ట్ యార్డ్ (2005లో)అనే హాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. గెట్ స్మార్ట్ (2008), మెక్ గ్రూబెర్ (2010)తో పాటు 2012లో ఓ ఫ్రెంచ్ సినిమాలో కూడా నటించాడు. 2010లో కుస్తీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది రామా ది సేవిలియర్‌లో వాలిగా నటించి మెప్పించాడు. ఖలీ బాలీవుడ్, హాలీవుడ్‌లోనే కాదు.. బుల్లితెరపైనా మెరిశాడు. కలర్స్ చానెల్‌లో బిగ్ బాస్ రియాల్టీ షోలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రన్నరప్‌గా నిలిచాడు.  
     
     డబ్బే డబ్బు...

     ప్రస్తుతం ఇది వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూడబ్ల్యూ ఈ)గా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే గతంలో దీన్ని క్యాపిటల్ రెజ్లింగ్ కార్పొరేషన్, వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఫెడరేషన్, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌గా పిలిచేవారు. అమెరికాలోని స్టాంఫోర్డ్ కేంద్రంగా డబ్ల్యూడబ్ల్యూఈ  కార్యకలాపాలు సాగుతున్నాయి.  న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈగా ట్రేడవుతోంది. 1952లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్‌గా మొదలైన దీనికి జెస్ మెక్‌మహోన్, టూట్స్ మోండ్ సృష్టికర్తలు. అతికొద్ది మందితో మొదలైన ఈ రెజ్లింగ్.. ఇంతింతై అన్నట్లు 62 ఏళ్లుగా అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది. ఏడాదికి  320 హౌస్ షోలతో 150 దేశాల్లో రెజ్లింగ్ పోటీలు ప్రసారమవుతున్నాయి.
     
     2013లో డబ్ల్యూడబ్ల్యూఈ
     రాబడి    :    రూ. 3955.98 కోట్లు
     మొత్తం మిగులు ఆదాయం    : రూ. 828 కోట్లు
     లాభం    :    రూ. 594 కోట్లు
     ఆస్తుల విలువ    :    రూ. 20,232 కోట్లు
     ఈక్విటీ    :    రూ. 13,248 కోట్లు
     
     

మరిన్ని వార్తలు