గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

22 Jul, 2019 11:36 IST|Sakshi

స్వాభావిక ప్రసవం (నాచురల్‌ డెలివరీ) కోసం అందరూ తాపత్రయపడతారు. మంచి శారీరక వ్యాయామం ఉన్నవారికి నాచురల్‌ డెలివరీ అయ్యే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తేల్చాయి. వాకింగ్‌ వల తుంటి కండరాల్లో సాగే గుణం పెరుగుతుంది. ఈ అంశమే వారిలో సుఖంగా ప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది. అయితే గర్భవతులకు నడక చాలా మంచి వ్యాయామం అంటున్నారు నిపుణులు. గర్భం ధరించి ఉన్న మహిళలు వాకింగ్‌ చేయడం అంత మంచిది కాదనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భవతులకు వాకింగ్‌ కంటే మంచి వ్యాయామం మరొకటి లేనేలేదు.

ఒక మహిళ తాను గర్భం దాల్చడానికి ముందు ఉన్న ఫిట్‌నెస్‌ను బట్టి తానెంతదూరం హాయిగా, శ్రమలేకుండా నడవగలన్న అంశాన్ని నిర్ణయించుకొని ఆ మేరకు నడవవచ్చు. ఇలా గర్భం దాల్చి ఉన్నప్పుడు నడక కొనసాగించడం అటు తల్లికీ, ఇటు కడుపులోని బిడ్డకూ ఇరువురికీమంచిది. అయితే గర్భవతులు నడక వ్యాయామాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఒకసారి తమ డాక్టర్‌ను సంప్రదించి, తన ఫిట్‌నెస్‌ ఎంత, ఎంతసేపు నడవాలి అనే అంశాలను తెలుసుకున్న తర్వాతే నడక కొనసాగించడం మంచిది. కాబోయే తల్లికీ, బిడ్డకూ నడక ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి.  

కాబోయే తల్లి నడక వ్యాయామాన్ని కొనసాగించడం వల్ల కడుపులోని బిడ్డ బరువు ఆరోగ్యకరమైన విధంగా పెరుగుతుంది. ప్రసవం సమయానికి ఎంత బరువు ఉండాలో అంతకు చేరుతుంది. అంతేకాదు... స్వాభావికమైన ప్రసవం (నేచురల్‌ డెలివరీ) అయ్యేందుకు నడక దోహదం చేస్తుంది.
నడక వల్ల కాబోయే తల్లి బరువు అదుపులో ఉండటమే కాకుండా... ఆ సమయంలో సాధారణంగా మహిళల్లో కనిపించే జెస్టేషనల్‌ డయాబెటిస్‌ను నడక నివారిస్తుంది.
గర్భవతుల్లో ఒత్తిడి అనేది చాలా సాధారణంగా కనిపించే అంశం. అన్ని వ్యాయామాల్లో లాగే నడక వల్ల కూడా ఒంట్లో ఆరోగ్యకరమైన ఎండార్ఫిన్లు, సంతోషాన్ని కలిగించే రసాయనాలు వెలువడి గర్భవతుల్లో ఒత్తిడిని తొలగించడంతో పాటు వారిని మరింత హాయిగా సంతోషంగా ఉండేలా చూస్తాయి.
వాకింగ్‌ వల్ల వేవిళ్ల సయంలో కనిపించే వికారం తగ్గుతుంది. అలసట, కండరాలు పట్టేయడం (క్రాంప్స్‌) తగ్గుతాయి. మలబద్దకం రాదు. వేరికోస్‌ వెయిన్స్‌ వచ్చే అవకాశాలు నివారితమవుతాయి. గర్భవతుల్లో సహజంగా కనిపించే రాత్రివేళ నిద్రపట్టకపోవడం అనే లక్షణం నివారితమై, కంటినిండా నిద్రపడుతుంది.

>
మరిన్ని వార్తలు