వాల్‌నట్స్‌తో మధుమేహం దూరం

1 Jul, 2018 14:55 IST|Sakshi

లండన్‌ : రోజుకు గుప్పెడు వాల్‌నట్స్‌తో టైప్‌ 2 డయాబెటిస్‌కు దూరంగా ఉండవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు మూడు టేబుల్‌స్పూన్ల వాల్‌నట్స్‌ తీసుకుంటే డయాబెటిస్‌ ముప్పును సగానికి సగం తగ్గించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. నిత్యం వాల్‌నట్స్‌ను తింటే డయాబెటిస్‌ వచ్చేఅవకాశాలు 47 శాతం మేర తగ్గుతాయని అథ్యయనం పేర్కొంది. 34,000 మందిపై జరిపిన పరిశోధనలో ఏ తరహా వాల్‌నట్స్‌ను తీసకున్నా మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధన చేపట్టిన కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన డేవిడ్‌ గెఫెన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నవారిలో మధుమేహాన్ని నిరోధించడాన్ని గుర్తించామని అథ్యయన రచయిత డాక్టర్‌ లీనోర్‌ అరబ్‌ పేర్కొన్నారు. కాగా వాల్‌నట్స్‌ మానసిక ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయని మరో పరిశోధనలో వెల్లడైంది. 18 నుంచి 80 సంవత్సరాల వయసున్న స్త్రీ, పురుషులకు నిర్వహించిన మధుమేహ పరీక్షల్లో వాల్‌నట్స్‌ తరచూ తీసుకునే వారిలో ఈ ఆహారాన్ని తీసుకోని వారితో పోలిస్తే  టైప్‌ 2 డయాబెటిస్‌ అరుదుగా కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు.

డయాబెటిస్‌తో బాధపడేవారు బీపీ, కొలెస్ర్టాల్‌, ట్రైగిజరైడ్లు అధికంగా కలిగి గుండెజబ్బులు, స్ర్టోక్‌ బారిన పడే అవకాశాలున్నాయని చెప్పారు. వాల్‌నట్స్‌తో మధుమేహంతో పాటు గుండెజబ్బులూ నిరోధించవచ్చని గతంలోనూ పలు పరిశోధనల్లో వెల్లడైంది. వాల్‌నట్స్‌లో ఉండే ప్లాంట్‌ ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. అథ్యయన వివరాలు డయాబెటిక్స్‌ మెటబాలిజం రీసెర్చ్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు