రక్తదానం చేయాలనుకుంటున్నారా?

5 Apr, 2018 00:26 IST|Sakshi

తెలుసుకోండి 

కొందరు వ్యక్తులు సమాజానికి ఏదైనా చేయాలనుకుంటారు. ఎంతో కొంత ఉపయోగపడాలనుకుంటారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టేనని భావించి... వాళ్ల పుట్టినరోజునాడో లేదా వారు ప్రత్యేకమని అనుకునే రోజుల్లో రక్తదానం చేస్తుంటారు. ఇలాంటి మానవీయ వ్యక్తులు రక్తదానం చేసే సమయంలో ఇది గుర్తుంచుకోండి.  మీరు రక్తదానం చేయాలనుకున్నప్పుడు రక్తంలోని వివిధ కాంపోనెంట్స్‌ను విడదేసే సౌకర్యం ఆ బ్లడ్‌బ్యాంకులో ఉందా, లేదా అని వాకబు చేయండి. ఎందుకంటే... ఒక వ్యక్తి నుంచి మొత్తం రక్తాన్ని (హోల్‌ బ్లడ్‌ను) సేకరించి ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి రక్తాన్ని ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్‌ కూడా అతడి శరీరంలోకి వెళ్లి, అవి వృథా అయిపోతాయి. కానీ... రక్తంలోని ఏ అంశం లోపించిందో నిర్దిష్టంగా అదే అంశాన్ని (అదే కాంపోనెంట్‌ను) ఎక్కించే ఆధునిక వసతి సదుపాయాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఒక వ్యక్తికి పూర్తి రక్తం కంటే ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీతన ఎక్కువగా ఉన్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్‌ ఆర్‌బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగ్యూలాంటి వ్యాధి సోకి ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే చాలు. ఇలా... రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే... అప్పుడు ఒకరి నుంచి సేకరించిన హోల్‌బ్లడ్‌ను వివిధ అవసరాలు ఉన్న చాలామంది రోగులకు ఎక్కించి, ఒకరికంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు నేరుగా ఏదైనా బ్లడ్‌బ్యాంకుకు వెళ్లడం కంటే.... రక్తాన్ని వివిధ కంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేయడం మంచిది.

మరిన్ని వార్తలు