వేసవిలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా..

16 Nov, 2017 01:07 IST|Sakshi

టూ ఇన్‌ వన్‌ షర్ట్‌ల గురించి మీరెప్పుడైనా విన్నారా? రెండువైపులా వేసుకోవచ్చు ఈ షర్ట్‌ను. అయితే వీటితో రంగులు, డిజైన్లు మారడానికి మించి ఇంకో ప్రయోజనం లేదు. ఇలా కాకుండా.. చలికాలంలో ఒకవైపున వేసుకుంటే వెచ్చగా ఉంటే.. ఇదే షర్ట్‌ను వేసవిలో తిరగేసి వేసుకుంటే చల్లగా అనిపిస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించారు స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఇలాంటి దుస్తులు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే.. జనాలు ఏసీలు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గిస్తారని, తద్వారా వాతావరణ మార్పులను కొద్దిగానైనా అడ్డుకోవచ్చునని అంటున్నారు ఈ వినూత్న వస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఈ కూయి. గత ఏడాది కూయి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చర్మాన్ని చల్లబరచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను ప్రసారం చేయగల ఓ వస్త్రాన్ని అభివృద్ధి చేసింది.

పత్తితో తయారైన వస్త్రంతో పోలిస్తే ఇది శరీరాన్ని రెండు డిగ్రీ సెల్సియస్‌ వరకూ చల్లగా ఉంచగలిగింది. వేర్వేరు ఉష్ణోగ్రత సామర్థ్యాలున్న రెండు పొరలను ఈ ప్రత్యేక వస్త్రంతో కలిపి వాడటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకూ వీలవుతుందని వీరు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ వస్త్రాన్ని నేరుగా వాడే అవకాశం లేదని.. పోగులు తయారు చేసి వస్త్రం తయారు చేస్తే అది దృఢంగా ఉండటంతోపాటు మన్నిక కూడా ఎక్కువవుతుందని.. ప్రస్తుతం తాము అదే ప్రయత్నంలో ఉన్నామని కూయి తెలిపారు. వీలైనంత సులువుగా ఈ వినూత్న వస్త్రాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు