వంద దేశాలకెళ్లిన వేస్ట్‌ డీ కంపోజర్‌!

27 Mar, 2018 00:44 IST|Sakshi

‘సాక్షి సాగుబడి’తో ఎన్‌.సి.ఓ.ఎఫ్‌. సంచాలకుడు డా. క్రిషన్‌ చంద్ర

వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయ విస్తరణకు ఇతోధికంగా దోహదపడుతున్న వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణంపై ఎటువంటి అపోహలకూ తావీయవద్దని కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్‌.సి.ఓ.ఎఫ్‌.) సంచాలకులు డాక్టర్‌ క్రిషన్‌ చంద్ర రైతులకు సూచించారు. ఏకలవ్య ఫౌండేషన్, అక్షయ్‌ కృషి పరివార్‌లతో కలసి హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఆవరణలో ఈ నెల 24, 25 తేదీల్లో ‘భూమి సుపోషణ’ ఆవశ్యకతపై నిర్వహించిన కార్యశాలలో ఆదివారం ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

తదనంతరం ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ వేస్ట్‌ డీ కంపోజర్‌పై రైతులకు ఎటువంటి అపోహలూ అవసరం లేదన్నారు. వేస్ట్‌ డీ కంపోజర్‌ను వాడొద్దని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా రైతులకు సందేశాలను పంపారు. దీనిపై డా. క్రిషన్‌ చంద్ర స్పందిస్తూ.. ‘వేస్ట్‌ డీ కంపోజర్‌ను మన దేశంలో 30–40 లక్షల మంది సేంద్రియ వ్యవసాయదారులతోపాటు వందకు పైగా దేశాల్లో సైతం రైతులు వాడుతున్నారు. భూసారం పెరుగుతోంది.

తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో రైతులు అధిక దిగుబడులు పొందగలుగుతున్నారు. ఫలితాలు రాలేదని ఏ ఒక్క రైతూ చెప్పలేదు. అయినా, కొందరు తప్పుడు అభిప్రాయాలను ప్రచారం చేస్తుండటం దురదృష్టకరం. పదేళ్లుగా జీవామృతం, పంచగవ్య వాడుతున్న రైతులు కూడా వేస్ట్‌ డీ కంపోజర్‌తో చాలా సంతృప్తిగా ఉన్నారు.. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో రకరకాల పేర్లతో 19 పద్ధతులు చలామణిలో ఉండటం వల్ల గందరగోళం నెలకొంది. పద్ధతి ఏదైనా ఆవు మూత్రం, పేడ, పప్పుధాన్యాల పిండి, బెల్లం తదితరాలతోనే ఉత్పాదకాలను తయారు చేసుకుంటున్నారు.

జీవామృతం, పంచగవ్య వాడినప్పుడు పొలంలో పంట/పశువుల వ్యర్థాలను, ఆకులు, అలములను కుళ్లబెట్టే ప్రక్రియే  చోటు చేసుకుంటుంది. పూర్తి ఫలితాలు రాబట్టుకోవడానికి రైతులు ఆరు నెలలు వేచి ఉండాల్సి వస్తున్నది. ఆవు పేడ నుంచే సంగ్రహించిన ఎంజైమ్‌లతో తయారైన వేస్ట్‌ డీ కంపోజర్‌ వాడితే 40 రోజుల్లోనే కుళ్లబెట్టే ప్రక్రియ పూర్తవుతూ వేగంగా పంటలకు పోషకాలు అందుబాటులోకి వచ్చి దిగుబడులు పెరుగుతున్నాయి.

జీవామృతం తయారు చేసిన డ్రమ్ముల్లో అడుగున 13–14 కిలోల వ్యర్థాలు కుళ్లకుండా మిగిలే ఉంటున్నాయి. జీవామృతం తయారీలో నీటికి బదులుగా వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణాన్ని వాడితే.. వ్యర్థాలు 2 కిలోలకు మించి మిగలవు. వడకట్టుకోవడం కూడా సులభమవుతుంది. కూలీల కొరతతో సతమతమవుతున్న రైతులకు వేస్ట్‌ డీ కంపోజర్‌ సంజీవనిలా ఉపకరిస్తున్నది’ అన్నారు. గడ్డీ గాదాన్ని వేస్ట్‌ డీ కంపోజర్‌ అతివేగంగా కుళ్లబెట్టేయడం వల్ల సమస్యలు వస్తాయి కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎక్కువ ఆకులు, పంట వ్యర్థాలను, పశువుల పచ్చి పేడను సైతం ఆచ్ఛాదనగా వేయాలని తామూ రైతులకు చెబుతున్నామన్నారు.

సదస్సు నేడు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు ఆడిటోరియంలో ఈనెల 27న ఉదయం 10 గంటలకు వేస్ట్‌ డీ కంపోజర్‌ను ఉపయోగించే పద్ధతులపై ఉచిత రైతు సదస్సు జరగనుంది. డా. క్రిషన్‌ చంద్ర, డా. ప్రవీణ్‌కుమార్‌ ముఖ్య వక్తలు. వివరాలకు.. 94902 35031, 91003 07308, 91003 07308, 95428 62345.

మరిన్ని వార్తలు