థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి నీరు...!

27 Jun, 2018 01:09 IST|Sakshi

వాతావరణ మార్పులు కానివ్వండి.. ఇంకేదైనా కారణం కానివ్వండి.. భూమ్మీద నీటికి కరువు వచ్చేసింది. మేఘాలను కురిపించేందుకు, ఉన్న నీటిని మళ్లీమళ్లీ వాడుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వాడేసిన నీటిని సేకరించేందుకు సరికొత్త మార్గం ఒకదాన్ని ఆవిష్కరించారు. బొగ్గుతో విద్యుదుత్పత్తి చేసే థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి వెలువడే ఆవిరి నుంచి నీటిని సేకరించేందుకు వీరు ఓ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. బొగ్గును మండించి నీటిని ఆవిరిగా మార్చి.. టర్బయిన్లను తిప్పడం థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో జరిగే ప్రక్రియ అని మనకు తెలుసు. విద్యుదుత్పత్తి తరువాత కూలింగ్‌ టవర్స్‌ నుంచి బోలెడంత ఆవిరి వెలువడుతూంటుంది.

 ఇలాంటి ఆవిరి నుంచి నీటిని సేకరించేందుకు మధ్యలో లోహపు లేదంటే ప్లాస్టిక్‌ జల్లెడ ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే అనేకచోట్ల ఉపయోగిస్తున్న ఈ పద్ధతితో ప్రయోజనం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ జల్లెడపైకి విద్యుదావేశంతో కూడిన కణాలను పంపినప్పుడు అధిక మొత్తంలో నీటి బిందువులు ఏర్పడ్డాయి. దాదాపు 600 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా ఏడాదికి అరవై కోట్ల లీటర్ల నీటిని సేకరించవచ్చునని.. అవసరమైతే ఈ నీటిని అక్కడే మళ్లీ వాడుకోవచ్చు. లేదంటే చుట్టుపక్కల ఉండే జనావాసాలకు సరఫరా చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త కపా వారణాసి తెలిపారు.  

 

మరిన్ని వార్తలు