నాణేల కాలువ

10 Apr, 2019 00:54 IST|Sakshi

చెట్టు నీడ 

‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని అన్నారు జుబేదా!

హారూన్‌ రషీద్‌ అనే చక్రవర్తి పరిపాలనా కాలం అది. ఇరాక్‌ నుంచి మక్కా వెళ్లే మార్గంలో మంచినీటి కటకటతో బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. హజ్‌ యాత్రకు వెళ్లేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న మంచినీరు అయిపోతే బాటసారులతోపాటు ఒంటెలు, గుర్రాలు దప్పికతో అల్లాడిపోయేవి, మృత్యువాతపడేవి. ప్రజలు, జంతువులు నీటికోసం అల్లాడుతున్నారన్న విషయం ఖలీఫా సతీమణి జుబేదాకు తెలిసి ఆమె హృదయం చలించిపోయింది. ఎడారి ప్రాంతంలో మంచినీటి కాలువ ప్రవహింపజేయాలి అనే యోచనను తన భర్త ఖలీఫా ముందుంచింది. దీనికి ఖలీఫా కూడా సానుకూలంగా స్పందించారు. కాలువ నిర్మాణం కోసం రాజ్యంలో ఉన్న సాంకేతిక నిపుణుల్ని అందరినీ ఆహ్వానించి, హజ్‌ యాత్రికుల నీటి ఎద్దడిని దూరం చేసేందుకు ఉపాయం ఏమిటో యోచించాలని ఆదేశించిందామె.

ఏమాత్రం ఆలస్యం చేయక ప్రయత్నాలు మొదలెట్టారు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ గాలించారు. నీటి వనరులున్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. పథకాలు తయారు చేశారు. ‘‘అమ్మా! సమస్యకు పరిష్కారం గోచరించింది. తాయిఫ్‌ లోయలో చక్కటి సెలయేరు ఉంది. అది హునైన్‌ కొండ వైపునకు ప్రవహిస్తుంది. ఆ నీళ్లు అమృతతుల్యంగా ఉన్నాయి. కాని దాన్ని మక్కాకు మళ్లించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎన్నో కొండలు, గుట్టలు, బండరాళ్లు మార్గంలో అడ్డుపడుతున్నాయి. ఈ అవరోధాన్ని తొలగించి కాలువ కట్టవలసి ఉంటుంది. అయితే అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని, బోలెడంత ఖర్చు అవుతుంది’’ అని విన్నవించుకున్నారు. ‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని తన దాతృత్వాన్ని చాటుకుంది.

నిపుణులు తాయిఫ్‌ లోయలో పుట్టిన ఊటను మక్కాకు చేర్చేందుకు కాలువ తవ్వించారు. దారిలో వచ్చిన ఎన్నో చిన్న చిన్న ఊటల్ని ఈ కాలువలో కలుపుకుంటూ వచ్చారు. కాలువ రానురాను నదిగా మారి మక్కాకు చేరింది. నీటి పథకం పూర్తయి ప్రజలకు మంచి నీటి వసతి కలిగింది. జుబేదా సంకల్పం నెరవేరింది. ఒకరోజు మంత్రి ‘‘రాణి గారూ! కాలువ నిర్మాణానికి మొత్తం 17 లక్షల బంగారు నాణేల ఖర్చయ్యింది’’ అని చెప్పి ఖర్చు వివరాల కాగితాలను ఆమెకు అందించాడు. ఆమె చిరునవ్వుతో ఖర్చు వివరాల కాగితాలను కాలువలో పడేశారు. నేటికీ అక్కడి ప్రజలకు, లక్షలాది సంఖ్యలో ఏటా వచ్చే హజ్‌ యాత్రికులకు నీరు సరఫరా చేస్తోంది జుబేదా కాలవ. 
 ముహమ్మద్‌ ముజాహిద్‌ 

మరిన్ని వార్తలు