మన వేడితోనే విద్యుత్తు...

25 Jan, 2019 01:47 IST|Sakshi

శరీర వేడితోనే విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకోగల సరికొత్త వస్త్రాన్ని అభివృద్ధి చేశారు మసాచుసెట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త త్రిషా ఆండ్రూ. ఈ సరికొత్త వస్త్రం ద్వారా సెన్సర్లు, పేస్‌ మేకర్లు, ఇతర చిన్న చిన్న ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను పనిచేయించవచ్చునని అంచనా. మన శరీర ఉష్ణోగ్రతలకు, పరిసరాల్లోని వేడికి మధ్య ఉండే అంతరాన్ని ఆధారంగా చేసుకుని తాము ఈ వస్త్రాన్ని తయారుచేశామని, విద్యుత్తును బాగా ప్రసారం చేయగల, వేడిని ప్రసారం చేయలేని పదార్థాలను పొరలుగా అమర్చినప్పుడు విద్యుత్తు ఛార్జ్‌ అనేది వేడిగా ఉన్న చోటు నుంచి చల్లటి ప్రాంతానికి వెళుతుందని త్రిష తెలిపారు.

ఈ పద్ధతి ద్వారా ఎనిమిది గంటల వ్యవధిలో ఒక వ్యక్తి నుంచి కొంత విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని ఇప్పటికే తెలుసు. అయితే ఇందుకు అవసరమైన ప్రత్యేక పదార్థాల తయారీ ఇప్పటివరకూ వ్యయప్రయాసలతో కూడుకున్నది.  ఉన్ని, ప్రత్తి వంటివాటితో అతిచౌకగా ప్రత్యేక పదార్థాలను తయారు చేయగలిగారు త్రిష. వీటన్నింటితో తయారైన ఒక చేతి బ్యాండ్‌ దాదాపు 20 మిల్లీవోల్టుల విద్యుత్తును పుట్టించాయని త్రిష తెలిపారు. అంతేకాకుండా.. స్వేదం విద్యుదుత్పత్తిని మరింత పెంచుతున్నట్లు తాము గుర్తించామని తెలిపారు. ఈ ప్రత్యేక పదార్థాలతో తయారైన దుస్తులను ధరించినప్పుడు స్మార్ట్‌ గాడ్జెట్లకు విద్యుత్తు అవసరం లేకుండా పోతుందని అంచనా 

మరిన్ని వార్తలు