గాంధీ మార్గంలో ఒంటరి యాత్ర

1 Mar, 2019 00:11 IST|Sakshi

150 నగరాలు.. 41 వేల కిలోమీటర్లు!

గిన్నిస్‌కు చేరువలో ప్రవాస భారతీయురాలు 

ఆమె ప్రవాస భారతీయురాలు. స్వదేశం అంటే ప్రేమ. మాతృభూమి కోసం తనవంతుగా కొంతైనా చేయాలనుకున్నారు. స్వచ్ఛతా యాత్ర మొదలు పెట్టారు. గాంధీ 150..  క్లీన్‌ ఇండియా.. సేఫ్‌ ఇండియా.. అనే నినాదంతో ఒంటరిగా ఇండియా అంతా పర్యటించి గిన్నిస్‌ రికార్డు సృష్టించబోతున్నారు. ఆమే... సంగీతా శ్రీధర్‌. 

సంగీతా శ్రీధర్‌ (52) తమిళనాడులోని కోయంబత్తూరు నివాసి. ఆమె పూర్వీకులు తెలుగువారే. సంగీత ఎంసీఏ పూర్తి చేసి, ఈ–గవర్నెన్స్‌ స్టాటజిక్‌ కౌన్సిలర్‌ గా అబుదాబిలో స్థిరపడ్డారు. ఆమె భర్త ఆయిల్‌ కంపెనీలో ఉద్యోగి. అబుదాబిలో ఉంటున్నా జన్మభూమిపై మమకారం, దేశాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలనే గాంధీజీ ఆశయాలు ఆమెలో స్పూర్తిని రగిలించి, భారతయాత్రకు సన్నద్ధం చేయించాయి. గాంధిజీ 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని 150 నగరాలను ఒంటరిగా చుట్టిరావాలని సంగీత నడుం బిగించారు. అనుకున్నదే తడవుగా గతేడాది ఆగస్ట్‌ 12న ముంబైలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా దేశంలో కనీసం రెండు లక్షల మంది కలవాలని కూడా ఆమె నిర్ణయించుకున్నారు. అందుకోసం బ్యాంకులో ఐదు లక్షల రుణాన్ని తీసుకుని, టాటా సన్స్‌ కంపెనీ అందించిన హెక్సా కారులో యాత్రకు బయల్దేరారు.

రోజుకు 250 నుండి 300 కిలోమీటర్లు కారులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సంగీత తను చేరుకున్న ప్రతి గ్రామంలో అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛతపై పరిస్థితులను బుక్‌ లో రికార్డు చేసుకుంటున్నారు. ఆ వివరాలను యాత్ర పూర్తయ్యాక త్వరలోనే ఐక్యరాజ్య సమితికి ఒక నివేదికగా అందించనున్నారు. అన్ని రాష్ట్రాలలో స్వచ్ఛతపై పరిశీలన జరిపిన సంగీత.. తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో మరుగుదొడ్లు వాడుతున్నా, వాటి పర్యవేక్షణ సరిగా లేదని, ప్రభుత్వాలు వాటిపై శ్రద్ధ తీసుకోవటంలేదని గ్రహించారు. ఇప్పటి వరకు ఆమె 181 రోజుల్లో 29 రాష్ట్రాల్లో 270 నగరాలలో ప్రయాణించి 24 సరిహద్దు ప్రాంతాలను చేరుకున్నారు. 27 యునెస్కో వారసత్వ భవనాలను తిలకించారు. రోజుకు 8 నుండి 12 గంటలపాటు ప్రయాణం చేస్తూ, ఎక్కడా ఎవరి ఆశ్రయమూ తీసుకోకుండా తన కారులోనే రాత్రి వేళల్లో నిద్రిస్తున్నారు.

ఉదయాన్నే యోగాతో ఆమె దినచర్య ప్రారంభం అవుతుండగా.. స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలు వంటివి మాత్రమే తీసుకుంటూ ఆమె తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా పలు అవాంతరాలను కూడా సంగీత ఎదుర్కొన్నారు. కశ్మీర్‌లోని లేహ్‌ సరస్సు సమీపంలో 18 వేల అడుగుల ఎత్తులో మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో తాను నడుపుతున్న వాహనం మంచులో చిక్కుకుపోవటంతో రోజంతా ఒంటరిగా అక్కడే గడిపిన భయానక పరిస్థితులు కూడా ఆమెకు ఎదురయ్యాయి. ఆ సంఘటనను కళ్లారా చూసిన కశ్మీరీ మహిళలు ఆమెను ఐరన్‌ లేడి అని ప్రశంసించడం యాత్రలో ఆమెను ఉత్తేజపరిచిన ఒక సందర్భం.  కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ, పర్యాటక మంత్రి ఆల్ఫోన్స్‌ వంటి మంత్రులు ప్రత్యేకంగా అభినందించడం కూడా తన యాత్ర దిగ్విజయంగా పూర్తవడానికి దోహదపడ్డాయని సంగీత తెలిపారు.

సంగీత మంచి ఫొటోగ్రాఫర్‌ కూడా. జాతీయస్థాయిలో పలు అవార్డులు కూడా అందుకున్నారు. అమెరికాలోని కొన్ని జర్నల్స్‌ ఆమె ఫొటోలు ప్రచురించాయి. యాత్రలో ఇటీవలి వరకు ఆమె ప్రయాణించిన మొత్తం దూరం 41 వేల కిలోమీటర్లు! అంటే కశ్మీర్‌ లోని శ్రీనగర్‌ నుండి కన్యాకుమారి వరకు పదకొండు సార్లు రోడ్డు మార్గంలో ప్రయాణించినంత దూరం.  దేశంలో అన్ని రాష్ట్రాలనూ ఇప్పటికే చుట్టేసిన సంగీత యాత్ర.. కేరళ, కర్నాటక మీదుగా.. ఎక్కడైతే మొదలైందో అక్కడే ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర ఈ మార్చి 15న పూర్తి కానుంది. అది పూర్తవగానే గిన్నిస్‌ ఆమె పేరు నమోదు అవుతుంది. యాత్రలో భాగంగా ఇటీవల చెన్నైలో తనను కలిసిన పాత్రికేయులతో ఆమె ఈ వివరాలను పంచుకున్నారు. 
సంజయ్‌ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై బ్యూరో

మరిన్ని వార్తలు