కలిసుందాం అన్నయ్యా...

6 Jun, 2019 02:21 IST|Sakshi

గోడలు కట్టుకోవచ్చు. పిల్లల మనసులో అవి నిలువవు. ఆస్తులు పంచుకోవచ్చు. పిల్లల దృష్టిలో ఆ కాగితాలు చిత్తు కాగితాలు. ఎడమొహం పెడమొహంగా జీవించవచ్చు. కాని పిల్లలు వారధులు కట్టే ఉడుతలు. బంధాలున్న బాల్యం... బాల్యాన్నిచ్చే బంధాలు వీటిని మనం ఎప్పటికి అర్థం చేసుకోగలం?

‘అమ్మా... చెట్టు విరిగి మీద పడినట్టు కల వచ్చిందమ్మా’ అన్నాడు బుజ్జి స్కూల్‌కు వెళుతూ.తల్లి స్కూల్‌కు పంపే హడావిడిలో పట్టించుకోలేదు.ఆమె గమనించి ఉంటే అతడి కళ్లు వాచి ఉండటాన్ని చూసేది. అది నిద్ర సరిగ్గా పట్టని ముఖం అని తెలుసుకొని ఉండేది. అది పీడకలలతో భీతిల్లిన మనసు అని అర్థం చేసుకొని ఉండేది.‘ఇదిగో నీకిష్టమని క్యారెట్‌ రైస్‌ పెట్టాను. లంచ్‌లో అంతా తినాలి. వాటర్‌ బాటిల్‌ మొత్తం తాగి ఖాళీ బాటిల్‌ ఇంటికి తేవాలి. నీళ్లు అలాగే తెచ్చావో ఈసారి నీ క్లాస్‌ టీచర్‌కు కంప్లయింట్‌ రాస్తా నీ డైరీలో’ అని బుజ్జిని స్కూల్‌ బస్సు ఎక్కించింది.ఆ మధ్యాహ్నమే స్కూల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.‘మీ బాబు ఏం తినట్లేదండీ’‘వాడికి ఇష్టమైనదే పంపానే’‘అసలు వాడు రెండు మూడు నెలలుగా సరిగ్గా తినడం లేదు. చాలా అన్నం పారేసి బాక్సులు తెస్తున్నాడు.

మీకు చెప్దాం చెప్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను’ అంది క్లాస్‌ టీచర్‌. బుజ్జి తల్లి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ చెమటతో తడిసింది. మూడు నెలలుగా బుజ్జి సరిగ్గా లేడన్న సంగతి ఇప్పుడు తీరిగ్గా కూచుని మననం చేసుకుంటే బుజ్జి తల్లికి అర్థమైంది. వాడు ఎక్కువ తినడం లేదు. అపార్ట్‌మెంట్‌లో కింద ఆడుకోవడానికి వెళుతున్నాడు కాని అక్కడ ఊరికే కూచుని ఉంటున్నాడు. హోమ్‌ వర్క్‌లో చురుకు పోయింది. నవ్వడం తగ్గింది.‘అమ్మో.. ఇదంతా ఏమిటి?’ అనుకుందామె.స్కూల్‌ బస్‌ వచ్చి వాడిని దింపే వరకూ ఏమిటేమిటోగా అనిపించింది.సాయంత్రం స్కూల్‌బస్‌ రాగానే బుజ్జిని వెళ్లి గట్టిగా కావలించుకుంది.‘కన్నా... ఏమైంది ఎందుకలా ఉంటున్నావు?’బుజ్జి ఏం చెప్పలేదు.ఇంట్లోకొచ్చి బాల్‌ పట్టుకొని ఒక్కడే నేలకు టప్పాలు కొడుతూ కూచున్నాడు.

కిందకు తాకుతున్న బాల్‌ పైకి లేస్తోంది. వాడు ఆటగా దాన్ని కిందకు కొడుతున్నాడా? కోపంగానా? ఎనిమిదేళ్ల బుజ్జికి లోకంలో డబ్బు అనేది ఉంటుందని సరిగ్గా తెలియదు. దాని వల్ల మనుషులు అవస్థలు పడతారని తెలీదు. దాని కారణాన అవస్థలు తెచ్చుకుంటారని తెలియదు. దాని కోసమని దారుణంగా వ్యవహరిస్తారని తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒక్కటే. తను ఇష్టపడే ఇల్లు. ఆ ఇంట్లో తనతో ఎప్పుడూ ఆడుకునే ఇద్దరు స్నేహితులు. పెద్దా. చిన్నా. వాళ్లు మొదట అతడి గాఢమైన స్నేహితులు. ఆ తర్వాతే పెదనాన్న పిల్లలు.పెద్దా.. చిన్నా... ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆమె కూడా అదే ప్రశ్న వేసింది బుజ్జి తల్లిదండ్రులను.‘మీ అబ్బాయి ఎవరినో మిస్‌ అవుతున్నాడు. బహుశా పెద్దా చిన్నల గురించి కావచ్చు.

వాళ్లెక్కడ?’ బుజ్జి తల్లిదండ్రులు తల వొంచుకున్నారు. బుజ్జి తండ్రి రాజకుమార్‌ ఎం.సి.ఏ చేశాడు. ఆ తర్వాత హైటెక్‌ సిటీలో జాబ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్‌ కొన్నాడు. మరొకటి అద్దెకు తీసుకున్నాడు. ఒకటి తనకు. రెండోది తన అన్నయ్యకు. రాజకుమార్‌ చిన్నప్పటి నుంచి చదువులో టాపర్‌. కాని తండ్రి పట్టించుకునేవాడు కాదు. అతడు తాగుబోతు. ఉన్న నాలుగెకరాల భూమిని వ్యవసాయం చేయకుండా పాడుబెట్టాడు. అప్పుడు డిగ్రీ చదవాల్సిన రాజకుమార్‌ అన్న దేవకుమార్‌ చదువు మానేసి వ్యవసాయంలో దిగాడు. తమ్ముడి చదువుకోసం రెక్కలు ముక్కలు కొట్టుకున్నాడు. అతడు చేసుకున్న భార్య కూడా రాజకుమార్‌ను అభిమానించి దేవకుమార్‌ ఏం చేసినా అడ్డు చెప్పలేదు. పల్లెటూళ్లో దేవకుమార్‌ కష్టపడుతుంటే రాజకుమార్‌ చదువు కోసమని ఉద్యోగం కోసమని మంచి జీవితం అనుభవించాడు.

తాను పెళ్లి చేసుకొని సెటిల్‌ అయ్యాక అన్నయ్యను ఇక పల్లెటూరి వ్యవసాయం వద్దని ఆ భూమి కౌలుకు ఇచ్చి హైదరాబాద్‌కు తెచ్చుకున్నాడు. తమ ఫ్లాట్స్‌ దగ్గరే ఒక కిరాణా షాప్‌ పెట్టించాడు. అన్నదమ్ములు చెరో ఫ్లాట్‌లో ఉన్నా కలిసి ఉన్నట్టే. వారి కంటే వాళ్ల పిల్లలు బుజ్జి, చిన్నా, పెద్ద ఇంకా కలిసి ఉండేవాళ్లు.వారు ఒకరిగా ఎప్పుడూ లేరు. అన్నం తింటున్నా టీవీ చూస్తున్నా కింద ఆడుకుంటున్నా ముగ్గురూ ఒక జట్టుగా ఉండేవారు. స్కూలుకు కూడా కలిసి వెళ్లేవారు. లంచ్‌ అవర్‌లో కలిసి తినేవారు. బుజ్జి మూడో క్లాస్‌లో ఉంటే చిన్నా ఐదో క్లాసు పెద్ద ఏడో క్లాసు.కాని రాజకుమార్‌కు రాను రాను అన్న కుటుంబం భారం అయ్యింది. కిరాణా షాపులోనూ కౌలులోనూ వచ్చేది దేవ కుమార్‌ కుటుంబానికి ఏమీ సరిపోయేది కాదు. అది సరిపోదని తాను సపోర్ట్‌గా ఉంటానని చెప్పే తీసుకు వచ్చాడు.

లక్షన్నరకు పైగా జీతం వచ్చే రాజకుమార్‌ అన్నయ్య ఇరవై ముప్పై వేలకు నెలకు సపోర్ట్‌గా ఉండటం నిజంగా చూస్తే కష్టం కాదు.కాని మనసు మారింది.ఎవరి బతుకులు వారివైతే బాగుండు అన్నట్టు ప్రవర్తన మారింది.పల్లెటూరి వాళ్లకు ఏమి అర్థమైనా అర్థమవకపోయినా ఇంట్లాంటివి అర్థమవుతాయి.వేసవి సెలవులు ముగియడంతోటే తమ శక్తిమేరకు తాము బతుక్కుంటాము అని దేవకుమార్‌ కుటుంబం సిటీ శివార్లకు వెళ్లిపోయింది. వ్యవసాయం తెలుసు కనుక ఒక ఫామ్‌హౌస్‌ మేనేజర్‌గా కుదురుకున్నాడు దేవకుమార్‌. అక్కడి మామూలు స్కూల్‌లో పిల్లలు చేరారు. నివాసం ఫ్రీ కనుక పెద్ద ఇబ్బంది లేదు.కాని ఇబ్బంది అంతా బుజ్జికి వచ్చింది.విడిపోయి ఆర్నెల్లయినా వాళ్లు వచ్చింది లేదు. వీళ్లు వెళ్లింది లేదు.అంతవరకూ ఉన్న ప్రపంచం తల్ల కిందులైపోయింది.

‘వాడు చెట్టు కూలి మీదపడినట్టుగా చెబుతున్నది మీ ఇంటి చెట్టు గురించి. మీ బాంధవ్యాల చెట్టు గురించి. అది మీకు అర్థం కాలేదు’ అంది సైకియాట్రిస్ట్‌.‘చూడండి. ఇది పెద్ద సమస్య కాదు. పిల్లలు ఇలా ఫీల్‌ అవడం మామూలే. కొన్నాళ్లకు సర్దుకుపోతారు. మర్చిపోతారు కూడా. కాని నిజంగా తన పెదనాన్న పిల్లలను మర్చిపోయి పెరగాల్సిన అవసరం వాడికీ, చిన్నాన్న కొడుకును మర్చిపోయి బతకాల్సిన అవసరం ఆ పిల్లలకీ ఉందా? ఆర్థిక సమస్యలు అవసరానికి మించి మోయాల్సిన పని లేదు. కాని చేదుగా విడిపోయి బంధాలను తెంచుకోవడం ఎందుకు? మీ అన్న మట్టి పిసకడానికి అంగీకరించక అతని స్వార్థం అతను చూసుకొని ఉంటే ఇవాళ మీరు అదే పల్లెటూళ్లో చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని ఉండేవారు. అవసరం తీరిపోయింది కాబట్టి ఆయన మీకు భారం అయ్యాడు కాని జీవితానికి సరిపడా భారం ఆయన తీర్చేశాడు అని మీకు అనిపించడం లేదు.

కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఏది మంచో అది గ్రహించండి’ అంది సైకియాట్రిస్ట్‌. ఇప్పుడు ఆరునెలలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం స్కూలు మార్చడం కుదరనట్టే. కాని వచ్చే సంవత్సరానికి మళ్లీ ఆ అన్నదమ్ములు కలిసి జీవించాలని కలిసే ఉండాలని రాజకుమార్‌ అనుకున్నాడు.ఆ ఆదివారమే భార్యతో బుజ్జితో అన్నయ్య ఉంటున్న ఫామ్‌హౌస్‌ దగ్గరకు వెళ్లారు.బుజ్జి, చిన్నా, పెద్దా ఆ చెట్లలో రోజంతా ఆటలే.ఆ మరుసటి రోజు స్కూల్‌ నుంచి టీచర్‌ వచ్చింది ‘ఏమిటండీ మీ వాడికి అంత తక్కువ అన్నం పంపారు. వాడు పక్కనున్న పిల్లలది కూడా లాక్కుని తింటున్నాడు’.. అవతల టీచర్‌ తిడుతూ ఉంటే బుజ్జి తల్లి మాత్రం సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చింది.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు